ఒడిదుడుకులు తప్పవు
న్యూఢిల్లీ: డాలరుతో మారకంలో దేశీయ కరెన్సీ కదలికలు ఈ వారం స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందే సంకేతాలు, విదేశీ పెట్టుబడులు కూడా కీలకంకానున్నాయని తెలిపారు. మరోవైపు దేశీయంగా ఆగస్ట్ నెల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల గడువు గురువారం(29న) ముగియనుండటం కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తుందని వివరించారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌కు స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలు శుక్రవారం(30న) విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతాయని అభిప్రాయపడ్డారు. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో జీడీపీ 4.8-5% స్థాయిలో పుంజుకోగలదని అంచనా. ఆగస్ట్ సిరీస్ ముగింపు, జీడీపీ పనితీరు వెల్లడి వంటి అంశాల కారణంగా ఈ వారం మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయని ఇన్వెంచర్ గ్రోత్ అండ్ సెక్యూరిటీస్ చైర్మన్ నాగ్‌జీ కె.రీటా పేర్కొన్నారు. ఇవికాకుండా డాలరుతో మారకంలో రూపాయి కదలికలపై కూడా ట్రేడర్లు దృష్టిపెడతారని చెప్పారు. రూపాయి ఇప్పటికే భారీగా పతనమైందని, ఇందువల్లనే శుక్రవారం ఒక్కసారిగా బౌన్స్ అయ్యిందని విశ్లేషించారు. ఇటీవల రూపాయి నిరంతరంగా బలహీనపడుతూ 65 స్థాయికి పతనమైన విషయం విదితమే. కాగా, వారాంతంలో ఏకంగా 135 పైసలు పుంజుకుని 63.20 వద్ద నిలిచింది.
నిరాశ అనవసరం
రూపాయి విలువ తక్కువగా ఉన్నదని(అండర్‌వ్యాల్యూయ్డ్), అయితే ఈ విషయంపై శ్రుతిమించిన నిరాశావాదం అనవసరమని ఆర్థిక మంత్రి పి.చిదంబరం గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే. కరెన్సీ పతన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన విదేశీ మారక నిల్వలున్నాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది కూడా. కాగా, ఆర్థిక వృద్ధి, కరెంట్ ఖాతా లోటు, కరెన్సీ పతనం వంటి అంశాలపై స్టాక్ మార్కెట్లు దృష్టిపెడతాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులతీరు ఆశావహంగా లేదన్నారు. మార్కెట్లలో ర్యాలీ వస్తే అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు.
ఆయిల్ ధరలపైనా చూపు
ముడిచమురు ధరల ఎఫెక్ట్ కూడా మార్కెట్లపై ఉంటుందని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. మధ్యప్రాచ్య దేశాలలో చెలరేగిన అశాంతి, యూఎస్ చమురు నిల్వల్లో తగ్గుదల వంటి అంశాల కారణంగా ఆయిల్ ధర లు బలపడే అవకాశమున్నదని వివరించారు. చైనా, యూరోజోన్, యూఎస్‌లలో తయారీ రంగం పురోగమిస్తున్న సంకేతాలు కూడా ఇందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 5,500 స్థాయి కీలకంగా నిలవనుందని గోయల్ చెప్పారు. ఈ స్థాయికి ఎగువన కొనుగోళ్లు పుం జుకుంటాయని అంచనా వేశారు. గత వారం బీఎస్‌ఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 0.4% క్షీణించి 18,519 వద్ద ముగిసింది. గడచిన వారంలో ఎఫ్‌ఐఐలు రూ. 3,000 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్లు జాక్సన్‌హోల్‌లో జరగనున్న ఫెడరల్ రిజర్వ్ వార్షిక సమావేశంపై దృష్టి నిలుపుతాయని చెప్పారు. ప్రస్తుతం అమ లు చేస్తున్న సహాయక ప్యాకేజీలలో కోత లేదా ఎత్తివేయడం వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని అభిప్రాయపడ్డారు.