ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు! | Top five cheapest currencies in the world Iranian Rial to Indonesian Rupiah | Sakshi
Sakshi News home page

ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు!

Published Sun, Sep 3 2023 7:42 PM | Last Updated on Mon, Sep 4 2023 6:56 AM

Top five cheapest currencies in the world Iranian Rial to Indonesian Rupiah - Sakshi

ఇప్పటి వరకు 'దినార్, రియాల్, ఫౌండ్, యూరో, డాలర్' వంటి ప్రపంచంలో అత్యంత ఖరీదైన కరెన్సీలను గురించి తెలుసుకుని ఉంటారు. అయితే ఈ కథనంలో ప్రపంచంలో టాప్ చీపెస్ట్ కరెన్సీలు ఏవి? ఇండియన్ కరెన్సీతో వాటికున్న వ్యత్యాసం ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

చీపెస్ట్ కరెన్సీ కలిగిన టాప్ 5 దేశాలు..
👉ఇరానియన్ రియాల్ (IRR)
👉వియత్నామీస్ డాంగ్ (VND)
👉సియెర్రా లియోనియన్ లియోన్ (SLL)
👉లావో/లావోషియన్ కిప్ (LAK)
👉ఇండోనేషియా రుపియా (IDR)

ఇరానియన్ రియాల్ (IRR)
ఇరాన్ కరెన్సీ ఇరానియల్ రియాల్ అనేది ప్రపంచంలో చీపెస్ట్ కరెన్సీలలో ఒకటి. అయితే ఇదే పేరుతో ఉన్న ఒమాని రియాల్ అనేది ప్రపంచంలో ఖరీదైన కరెన్సీలలో ఒకటిగా ఉంది. ఇండియన్ ఒక్క రూపాయి 511 ఇరానియల్ రియాల్స్‌కి సమానం. కాగా ఒక అమెరికన్ డాలర్‌ 42,275 ఇరానియల్ రియాల్స్‌కి సమానం అని తెలుస్తోంది. ఈ దేశంలో రాజకీయ అశాంతి, వ్యాపారం, తలసరి జీడీపీ కారణంగా ఈ దేశ కరెన్సీ విలువ చాలా తక్కువగా ఉంది.

వియత్నామీస్ డాంగ్ (VND)
వియత్నాం చారిత్రాత్మకంగా కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ కింద పనిచేస్తోంది, అయితే ఆర్థిక వ్యవస్థను స్థాపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కాగా ప్రస్తుతం తక్కువ విలువ గల కరెన్సీ కలిగిన దేశాల్లో ఇది కూడా ఒకటి. 291 వియత్నామీస్ డాంగ్స్ భారతీయ కరెన్సీ రూపాయికి సమానం. ఒక అమెరికన్ డాలర్ 24,085 వియత్నామీస్ డాంగ్స్‌కి సమానం. వియాత్నం ఆర్ధిక వ్యవస్థ 2024కి వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు.

సియెర్రా లియోనియన్ లియోన్ (SLL)
ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్ తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటోంది. వినాశకరమైన అంతర్యుద్ధంతో సహా పశ్చిమ ఆఫ్రికాలో కుంభకోణాలు, అవినీతి కారణంగానే ఆ దేశ కరెన్సీకి విలువ తగ్గినట్లు సమాచారం. భారత రూపాయి 238 సియెర్రా లియోనియన్ లియోన్‌లకి సమానం, కాగా అమెరికన్ డాలర్ 19,750 సియెర్రా లియోనియన్ లియోన్‌లకి సమానం.

ఇదీ చదవండి: అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన టాప్ 10 దేశాల్లో 'భారత్' ఎక్కడుందంటే?

లావో/లావోషియన్ కిప్ (LAK)
1952 నుంచి కూడా లావోషియన్ కిప్ కరెన్సీకి విలువ చాలా తక్కువగానే ఉంది. ప్రస్తుతం ఒక ఇండియన్ రూపీ 239 లావోషియన్ క్లిప్‌లలో సమానం, ఒక అమెరికన్ డాలర్ 19,773 లావోషియన్ క్లిప్‌లకి సమానం కావడం విశేషం. కాగా ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలలో ఇది ఒకటిగా ఉంది.

ఇదీ చదవండి: ఆర్‌బీఐ ఊరుకున్నా.. ఈ రెండు బ్యాంకులు తగ్గలే.. వడ్డీ రేట్లు ఇలా!

ఇండోనేషియా రుపియా (IDR)
గత ఏడు సంవత్సరాలుగా ఇండోనేషియా రూపాయి విలువలో ఎలాంటి మెరుగుదల లేదు. విదేశీ మారక నిల్వలు క్షీణించడం, కరెన్సీని కాపాడుకోవడంలో సెంట్రల్ బ్యాంక్ వైఫల్యం కారణమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. అయితే భారతీయ కరెన్సీ రూపాయికి 184 ఇండోనేషియా రూపాయలకు సమానం. అదే విధంగా ఒక అమెరికన్ డాలర్ 15,225 ఇండోనేషియా రూపాయలకు సమానం. ప్రస్తుతం పారిశ్రామిక కార్యకలాపాలలో ఇండోనేషియా కొంత వృద్ధి చెందుతున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement