సంస్కరణలపై ‘రెగ్జిట్’ ప్రభావం పడదు
ప్రపంచబ్యాంక్ స్పష్టీకరణ
* రేటింగ్ నిర్ణయాలు విధానాలపై తప్ప వ్యక్తులపై ఆధారపడి ఉండవని ఫిచ్ ప్రకటన
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ రెండవసారి ఈ బాధ్యతల్లో కొనసాగబోనని చేసిన ప్రకటన (రెగ్జిట్) ప్రభావం బ్యాంకింగ్ సంస్కరణలపై పడబోదని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఆయా సంస్కరణలు కొనసాగుతాయని భావిస్తున్నట్లు ప్రపంచబ్యాంక్ భారత్ వ్యవహారాల డెరైక్టర్ ఓనో రుయాల్ పేర్కొన్నారు.
ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్‌లోటు, విదేశీ మారక ద్రవ్య నిల్వల వంటి భారత్ స్థూల ఆర్థిక అంశాలు పటిష్టంగా ఉన్నట్లు కూడా తెలిపారు. కాగా రేటింగ్ సంస్థ- ఫిచ్ కూడా రెగ్జిట్‌పై ఒక కీలక ప్రకటన చేస్తూ... రేటింగ్ నిర్ణయాలు విధానాలపై ఆధారపడి ఉంటాయితప్ప, వ్యక్తులపై కాదని స్పష్టం చేసింది. రాజన్ పదవీ విరమణ ప్రభావం సావరిన్ రేటింగ్స్‌పై ఎంతమాత్రం ఉండబోదని స్పష్టం చేసింది.
ద్రవ్యోల్బణం, మొండిబకాయిల వంటి సమస్యల పరిష్కారానికి కేంద్రం, రాజన్ వారసుడు తగిన చర్యలను కొనసాగిస్తారన్న విశ్వాసాన్ని ఫిచ్ ఆసియా-పసిఫిక్ సావరిన్స్ గ్రూప్ డెరైక్టర్ థామస్ రుక్‌మాకర్ పేర్కొన్నారు. రాజన్ భారత్ బ్యాంకింగ్ వ్యవస్థకు చేసిన కీలకమైనవని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతం ఫిచ్ భారత్ రేటింగ్ ‘బీబీబీ-’ జంక్ హోదాకు ఇది ఒక స్థాయి ఎక్కువ.
ప్రైవేటు పెట్టుబడులు, డిమాండ్ కీలకం
కాగా ప్రైవేటు పెట్టుబడులు, గ్రామీణ డిమాండ్ క్రియాశీలకంగా ఉండడం ద్వారానే భారత్ 7.6 శాతం వృద్ధి రేటు మున్ముందు కొనసాగుతుందని ప్రపంచబ్యాంక్ తన తాజా ద్వైవార్షిక నివేదికలో పేర్కొంది. ప్రతిష్టంభనలో ఉన్న రంగాల్లో వ్యవసాయం, గ్రామీణ గృహ వినియోగం, ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు ఉన్నట్లు తెలిపింది. 2015-16 తరహాలో 2016-17లో కూడా భారత్ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. రానున్న రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ రేటు 7.7 శాతం, 7.8 శాతంగా అంచనా.