రాజన్ను కొనసాగించాలి: సీఐఐ
ఒకాసా: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను సెప్టెంబర్ 4 తరువాత ఇదే బాధ్యతల్లో కొనసాగించాలని పరిశ్రమల వేదిక- కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) పేర్కొంది. సీఐఐ ప్రెసిడెంట్ నౌషాద్ ఫోర్బ్స్ గురువారం ఇక్కడ ఈ అంశంపై ఒక వార్తా సంస్థతో మాట్లాడారు. ఆర్థికమంత్రి జైట్లీ పర్యటనలో భాగంగా, ఇక్కడకు వచ్చిన అత్యున్నత స్థాయి బృందంలో ఫోర్బ్స్ ఒకరు. ఈ సందర్భంగా ఆయన మాటలను క్లుప్తంగా చూస్తే...
‘‘రాజన్ ఇప్పటివరకూ గణనీయమైన బాధ్యతలు నిర్వహించారు. ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికాదు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. ఇక మిగిలిన అంశాలకు వస్తే.. రాజన్‌పై సుబ్రమణ్యస్వామి విమర్శలను నేను తీవ్రంగా చూడ్డం లేదు. ప్రజాస్వామ్యంలో ఇవి ఒక భాగం. అయితే వ్యక్తిగత విమర్శలు మాత్రం సరికాదు. రాజన్‌ను తిరిగి గవర్నర్‌గా కొనసాగింపునకు సంబంధించి నిర్ణయాన్ని ప్రభుత్వం తగిన సమయంలో తీసుకుంటుందని భావిస్తున్నాను’’.