మార్కెట్ పంచాంగం
ఇటు రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్‌వేయడం, అటు ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణను ప్రారంభించడం...ఈ రెండు దేశాల కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు మార్కెట్లను ఆశ్చర్యపర్చాయి. ఈ నిర్ణయాల్ని స్వాగతిస్తూ విదేశీ ఇన్వెస్టర్లు ఒకేవారంలో రూ. 6,000 కోట్ల నిధుల్ని భారత్ మార్కెట్లోకి కుమ్మరించడంతో మళ్లీ సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త గరిష్టస్థాయిల్ని సవాలుచేయడానికి సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సందర్భంగా వచ్చిన ర్యాలీ కొత్త శిఖరాలపై స్థిరపడలేకపోయింది. ఆ ర్యాలీని ముందుండి నడిపించే రంగం లేకపోవడమే అందుకు కారణం కావొచ్చు. అయితే ఈ దఫా ప్రధాన ఐటీ షేర్లన్నీ కలిసికట్టుగా ర్యాలీ జరపడం, అవి కొత్త రికార్డులను సృష్టించడం, ఐటీ ఇండెక్స్ ఆల్‌టైమ్ గరిష్టస్థాయికి చేరడం వంటి అంశాలు ఈ దఫా మార్కెట్ ర్యాలీ నిలదొక్కుకునేలా చేయవచ్చు. కొద్ది నెలల నుంచి భయపడుతున్నట్లు ఫెడ్ నిర్ణయం మార్కెట్లను అస్థిరపర్చనందున, ఇన్వెస్టర్ల విశ్వాసం పెంపొంది మార్కెట్లో దీర్ఘకాలిక అప్‌ట్రెండ్ ప్రారంభమయ్యే అవకాశాలు వున్నాయి. ఇక సాంకేతికాంశాలకొస్తే.....
సెన్సెక్స్‌పై సాంకేతిక అంచనాలు
డిసెంబర్ 20తో ముగిసినవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 20,569 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన తర్వాత, 21,118 పాయింట్ల గరిష్టస్థాయికి చేరింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 365 పాయింట్ల లాభంతో 21,080 వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్‌కు 21,134 సమీపంలో తక్షణ నిరోధం ఎదురుకావొచ్చు. ఆసియా మార్కెట్లు సోమవారం సానుకూలంగా వుంటే ఈ స్థాయిపైనే సెన్సెక్స్ గ్యాప్‌అప్‌తో మొదలుకావొచ్చు. అయితే ఆపైన స్థిరపడితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. 21,134 పాయింట్లపైన క్రమేపీ 21,288 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే వేగంగా 21,500-21,600 శ్రేణిని చేరవచ్చు. నాటకీయంగా ఈ శ్రేణిని అధిగమించగలిగితే కొద్ది వారాల్లో 22,498 పాయింట్ల లక్ష్యాన్ని చేరే ఛాన్స్ వుంటుంది. ఈ వారం తొలి అవరోధంపైన స్థిరపడలేకపోతే 20,920 వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతుస్థాయిని ముగింపులో కోల్పోతే నెమ్మదిగా 20,400-20,600 మద్దతుశ్రేణి వద్దకు తగ్గవచ్చు.
నిఫ్టీ తక్షణ నిరోధం 6,306
డిసెంబర్ 20తో ముగిసినవారంలో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగానే 6,130 తగ్గిన తర్వాత, చివరిరోజున వేగంగా 6,284 గరిష్టస్థాయికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ పెరిగింది. అంతక్రితంవారంతో పోలిస్తే 106 పారుుంట్ల లాభంతో 6,274 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 6,306 వద్ద తక్షణ అవరోధం ఎదురవుతున్నది. డిసెంబర్ 9నాటి 6,415 పాయింట్ల స్థాయి నుంచి 6,130 పాయింట్ల వరకూ జరిగిన 285 పాయింట్ల క్షీణతకు 61.8% రిట్రేస్‌మెంట్ స్థాయే ఈ 6,306 పాయింట్లు. అటుపైన 6,355 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఆపైన స్థిరపడితే తిరిగి 6,415 స్థాయికి చేరవచ్చు. డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా మరో రౌండు షార్ట్ కవరింగ్ జరిగితే 6,415 పాయింట్ల స్థాయిని కూడా ఛేదించే ఛాన్స్ వుంది. ఈ స్థాయిపైన క్రమేపీ కొద్ది వారాల్లో 6,550-6,600 శ్రేణిని అందుకోవొచ్చు. తొలి రెండు అవరోధాలను అధిగమించలేకపోతే రెండు వారాలపాటు 6,100-6,355 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చు. ఈ వారం 6,235 పాయింట్ల వద్ద ఈ వారం తొలి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే నెమ్మదిగా మళ్లీ 6,100-6,150 పాయింట్ల మద్దతుశ్రేణి వద్దకు జారుకోవచ్చు.
- పి. సత్యప్రసాద్