ఇండియా రికవరీనే కీలకం.. | impartent to india recovery | Sakshi
Sakshi News home page

ఇండియా రికవరీనే కీలకం..

Published Thu, Jan 14 2016 2:21 AM | Last Updated on Mon, Oct 1 2018 5:32 PM

ఇండియా రికవరీనే కీలకం.. - Sakshi

ఇండియా రికవరీనే కీలకం..

అమెరికా ఫెడ్,  చైనా కాదు..
  ఎఫ్‌ఐఐలు మళ్లీ వస్తారు
2008 పరిస్థితులు పునరావృతం కావు
రూపాయి క్షీణతకే ఆర్‌బీఐ మొగ్గు
ఆరు నెలలవరకూ ఫెడ్ రేట్లు పెంచకపోవచ్చు..
ఆటో, ప్రైవేటు బ్యాంకింగ్, ఆయిల్ షేర్లు సానుకూలం

డీఎస్‌పీ బ్లాక్‌రాక్ ఏఎంసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హరీష్ జవేరీ  అది జరిగితే మన మార్కెట్లోకి
 ఇండియా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే అమెరికా, చైనా ప్రభావాలు మన మార్కెట్‌పై ఉండవని, వెనక్కి వెళ్లిన ఎఫ్‌ఐఐలు వెతుక్కుంటూ వెనక్కి వస్తారంటున్నారు డీఎస్‌పీ బ్లాక్‌రాక్ ఏఎంసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్ హరీష్ జవేరీ. అంతర్జాతీయ పరిణామాల కంటే దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడమే స్టాక్ మార్కెట్లకు ముఖ్యమంటున్న జవేరీతో   ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రత్యేక ఇంటర్వ్యూ..

 
 సాక్షి, బిజినెస్ బ్యూరో
ప్రస్తుతం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులను చాలామంది 2008 ఆర్థిక సంక్షోభంతో పోలుస్తున్నారు. అటువంటి పరిస్థితులున్నాయా?
 2008లో స్టాక్ మార్కెట్లు లిక్విడిటీ కొరత వల్ల పతనమయ్యాయి. కానీ ఇప్పుడు లిక్విడిటీ కొరత లేదు. కానీ 2008 తర్వాత అమెరికా వంటి దేశాలు లిక్విడిటీ పెంచడానికి వ్యవస్థలోకి అదనపు నిధులను విడుదల చేశాయి. ఇక ఇప్పుడు అటువంటి చౌక మనీ లభించే రోజులు పోయాయి. ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ 2012 నాటికి పూర్తి భిన్నంగా ఉందని చెప్పొచ్చు. 2012లో అధిక ద్రవ్యలోటుతో ఇబ్బందులు ఎదుర్కొంటే, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో ప్రస్తుతం ద్రవ్యలోటును కట్టడిలోకి వచ్చింది. కాబట్టి 2008 పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశాలు లేవు.

గత రెండేళ్లుగా లార్జ్‌క్యాప్ కంటే మిడ్‌క్యాప్ ఇండెక్స్ మంచి పనితీరు కనపరుస్తోంది? ఈ ఏడాదీ ఇదే విధమైన ట్రెండ్ కొనసాగే అవకాశముందా?
 ఈ ఏడాది షేర్ల కదలికలు గత రెండేళ్లకు భిన్నంగా ఉండే అవకాశముంది. ఇప్పటి వరకు పెరిగిన మిడ్‌క్యాప్ షేర్లు మరింత పెరుగుతాయని చెప్పలేం. ఇక నుంచి ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్న కంపెనీలు మాత్రమే పెరుగుతాయి. ఇక లార్జ్‌క్యాప్‌లో కూడా ఆటో, ప్రైవేటు బ్యాంకులు, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల షేర్లు పెరిగే అవకాశాలున్నాయి. మొత్తం మీద స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్ల కంటే లార్జ్ క్యాప్ షేర్లకే ఎక్కువ మొగ్గు చూపుతాను.

ఎఫ్‌ఐఐలు వైదొలుగుతున్నా.. దేశీయ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ఈ ఏడాది కూడా దేశీయ నిధుల ప్రవాహం ఇదే విధంగా ఉండే అవకాశం ఉందా?
 స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది దేశీయ మ్యూచువల్ ఫండ్స్ లక్ష కోట్ల నికర కొనుగోళ్లు జరిపాయి. ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే సంఖ్యతో పాటు, సగటు సిప్ మొత్తం కూడా భారీగా పెరిగాయి. వచ్చే రెండు నెలలు మ్యూచువల్ ఫండ్స్ డివిడెండ్లు ప్రకటిస్తాయి కాబట్టి నిధుల ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది కూడా దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఇదే విధంగా కొనసాగుతాయి. కానీ ఇదే సమయంలో ఎఫ్‌ఐఐలు అమ్మకాలు చేస్తున్నాయి. చైనా, దక్షిణాసియా కరెన్సీ విలువ, వర్థమాన దేశాల వృద్ధి వంటి అంశాలపై ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. మిగిలిన దేశాలతో పోలిస్తే మన ఫండమెంటల్స్ బాగున్నా.. వారి ఆలోచనలు ఏ విధంగా ఉండొచ్చన్న సంగతి ఇప్పుడే చెప్పలేం.

ఏయే రంగాలపై బుల్లిష్‌గా ఉన్నారు? వేటికి దూరంగా ఉంటున్నారు?
 ఆటో (మారుతీ, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్) ఆటో యాన్సిలరీ, ప్రైవేట్ బ్యాంకులు (ఇండస్ ఇండ్, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్)లపై బుల్లిష్‌గా ఉన్నాం. రాస్ గ్యాస్ ఒప్పందం, గ్యాస్ రంగంలో సంస్కరణల నేపథ్యంలో ఆయిల్-గ్యాస్ షేర్లలో పెట్టుబడులు కొనసాగించొచ్చు. అలాగే గ్యాస్, బొగ్గు సరఫరా మెరుగవ్వడం, ఉదయ్ స్కీం కింద అప్పులు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం వంటి నిర్ణయాల కారణంగా   దీర్ఘకాలానికి విద్యుత్ కంపెనీలకేసి చూడొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో కన్జూమర్ బేస్డ్ కంపెనీలు (హెచ్‌యూఎల్, ఐటీసీ, నెస్లే), యూఎస్‌ఎఫ్‌డీఏ నిర్ణయాల వల్ల ఫార్మా, ఐటీ రంగాలకు దూరంగా ఉంటున్నాం. ఎన్‌పీఏ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకుంటాయన్న దానిపై పీఎస్‌యూ బ్యాంకుల కదలికలు ఆధారపడి ఉంటాయి.

అమెరికా వడ్డీరేట్లు మరింత పెంచే అవకాశం ఉందా? పెంచితే మనపై ప్రభావమేంటి?
 ఇప్పటికే అమెరికా వడ్డీరేట్లను ఒకసారి పెంచింది. దానీ ప్రభావం మనపై అంతగా లేదనే చెప్పొచ్చు. ప్రస్తుతం వచ్చే ఆరు నెలల వరకు ఫెడరల్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచకపోవచ్చు.

చమురు ధరలు తగ్గడం అంతర్జాతీయంగా వృద్ధిలేదనడానికి సంకేతం కదా? ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుస్తుందా?
 అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిరేటు సరిగా లేనందునే చమురు ధరలు తగ్గుతున్నాయనడంలో సందేహం లేదు. కానీ ఈ ధరలు తగ్గడం ఇప్పటి వరకు బాగా లబ్ధిపొందిన దేశాల్లో ఇండియా ఒకటి. ప్రపంచ వాణిజ్యంలో మన వాటా చాలా తక్కువ కాబట్టి సంస్కరణలు అమలు చేస్తూ ముందుకెళ్తున్నంత కాలం మనపై అంతగా ప్రతికూల ప్రభావం ఉండదు. చమురు ధరలు తగ్గడం వల్ల మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే రెమిటెన్స్‌లు తగ్గొచ్చు. కానీ ఇదే సమయంలో రూపాయి పతనం వల్ల మిగిలిన దేశాల నుంచి వచ్చే రెమిటెన్స్‌లు ఆ లోటును భర్తీ చేస్తాయనుకుంటన్నాం.

 చైనా కరెన్సీ విలువ తగ్గించడం వల్ల మన ఆర్థిక వ్యవస్థతో పాటు, స్టాక్ మార్కెట్లపై ఏ విధంగా ప్రభావం ఉంటుంది?
 చైనా కరెన్సీ యువాన్ విలువ తగ్గించడం వల్ల ఎగుమతుల్లో పోటీ తట్టుకోవడానికి ఇతర దేశాలు కూడా కరెన్సీ విలువను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే చైనా ఎగుమతులతో ఈ దేశాలు పోటీ పడలేవు. ప్రస్తుతం ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే మన రూపాయి విలువ పటిష్టంగా కనిపిస్తున్నా.. రానున్న కాలంలో రూపాయి విలువ బలహీనపడటానికే ఆర్‌బీఐ మొగ్గు చూపొచ్చు. వచ్చే సెప్టెంబర్ నాటికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 70 పడిపోవచ్చని అంచనా వేస్తున్నాం.

రానున్న కాలంలో దేశీయ మార్కెట్ కదలికలను ఏ అంశాలు నిర్దేశిస్తాయని అనుకుటున్నారు?
 దేశీయ సూచీల కదలికలు ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి అంతర్జాతీయంగా ఎఫ్‌ఐఐల రూపంలో వచ్చే నిధుల ప్రవాహం, దేశ ఆర్థిక వృద్ధిరేటు కోలుకోవడానికి ఎంత దూరంలో ఉన్నా అంశాలు కీలకమైనవి. ప్రస్తుతం దేశీయంగా కొత్త పెట్టుబడులు, ఎగుమతుల పరిస్థితి అంత ఆశావహంగా లేదు. కానీ దేశీయ వినిమయ శక్తి బాగుండటంతో ఇతర దేశాల మార్కెట్ల కంటే మనం కొద్దిగా బాగుండటానికి కారణం. ఒకసారి మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టిందంటే చైనా, అమెరికా ప్రభావాలు మన మార్కెట్లపై పెద్దగా ఉండవు. వెనక్కి వెళ్లిన ఎఫ్‌ఐఐలు కూడా తిరిగి వస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే అంతర్జాతీయ పరిణామాల కంటే మన ఆర్థిక వ్యవస్థ ఎంత తొందరగా కోలుకుంటుందన్న దానిపైనే మార్కెట్ కదలికలు ఆధారపడి ఉంటాయని చెప్పొచ్చు.

♦  మూడో త్రైమాసిక ఫలితాలు ఎలా ఉంటాయని భావిస్తున్నారు?
 సెన్సెక్స్‌లోని 30 కంపెనీలు సగటున 1% వృద్ధిని నమోదు చేయొచ్చు. ఇందులోంచి మెటల్ కంపెనీలను తీసేస్తే మిగిలిన సెన్సెక్స్ కంపెనీల్లో 8-10% వృద్ధి కనపడుతుంది. కమోడిటీ ధరలు బాగా తగ్గడం వల్ల మెటల్ కంపెనీల ఆదాయాల్లో క్షీణత కనిపిస్తోంది. ఇదే సమయంలో ఇతర కంపెనీలకు నిర్వహణ వ్యయాలు తగ్గడంతో ఆదాయం పెరక్కపోయినా లాభాలు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ. చెన్నై వరదల వల్ల మూడో త్రైమాసికం ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. నాల్గవ త్రైమాసిక ఫలితాల తర్వాత కానీ ఒక స్పష్టతకు అవకాశం లేదు.

 ఆర్‌బీఐ వడ్డీరేట్లను మరింత తగ్గించే అవకాశం ఉందా?
 వచ్చే మూడు నుంచి ఆరు నెలలు వడ్డీరేట్లలో ఆర్‌బీఐ ఎటువంటి మార్పులు చేయదని భావిస్తున్నాం. వడ్డీరేట్లు పెరిగే అవకాశం లేదు కానీ.. మరింత తగ్గుతాయా లేదా అన్నదానిపై మరో ఆరు నెలలు ఆగితే కాని స్పష్టత రాదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement