వెనక్కు తగ్గిన జానెట్ ఎలెన్...ఇక రాజన్ తగ్గిస్తారా | Janet Ellen backtracked | Sakshi
Sakshi News home page

వెనక్కు తగ్గిన జానెట్ ఎలెన్...ఇక రాజన్ తగ్గిస్తారా

Published Sat, Sep 19 2015 12:42 AM | Last Updated on Mon, Oct 1 2018 5:28 PM

వెనక్కు తగ్గిన జానెట్ ఎలెన్...ఇక రాజన్ తగ్గిస్తారా - Sakshi

వెనక్కు తగ్గిన జానెట్ ఎలెన్...ఇక రాజన్ తగ్గిస్తారా

వడ్డీ రేటు పెంచని ఫెడ్
బలహీన చైనా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కారణం
 
 వాషింగ్‌టన్/ ముంబై : ఉత్కంఠగా వేచిచూస్తున్న ప్రపంచ దేశాలు, మార్కెట్లకు ఊరటనిస్తూ అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జానెట్ ఎలెన్ వెనక్కుతగ్గారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనత, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులు, అమెరికా ద్రవ్యోల్బణం కనిష్టస్థాయిలోనే కొనసాగడం వంటి అంశాలతో ప్రస్తుతానికి వడ్డీ రేట్లను జీరోస్థాయిలోనే యథాతథంగా ఫెడ్ అట్టిపెట్టింది. సెప్టెం బర్ 17నాటి ఫెడ్ మార్కెట్ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందన్న భయాలు, అంచనాలు కొద్దికాలంగా వెలువడుతున్న సంగతి తెలి సిందే. 

చైనా మందగమన ప్రభావం అమెరికా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పడవచ్చన్న భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయన్న అభిప్రాయాన్ని ఫెడ్ వ్యక్తం చేసింది. అయితే అసాధారణ జీరో రేటు ద్రవ్య విధానాన్ని సాధారణ స్థితికి తీసుకురావాల్సిన అవసరాన్ని ఫెడ్ చైర్‌పర్సన్ ప్రస్తావిస్తూ తదుపరి రోజుల్లో రేట్ల పెంపు నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. 2015లోనే రేట్ల పెంపు ఉండవచ్చన్న సంకేతాల్ని గురువారంనాటి సమావేశంలో ఫెడ్ కమిటీ సభ్యులు వెలువరించారు.

వచ్చే అక్టోబర్ నెలలో జరిగే ఫెడ్ మీటింగ్‌లో కాకుండా, డిసెంబర్ నెలలో ఫెడ్ రేట్లు పెరగవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అమెరికా ఉపాధి మార్కెట్ పటిష్టంగా వుందని, అలాగే ద్రవ్యోల్బణం 2 శాతం లక్ష్యాన్ని చేరుతుందన్న విశ్వాసం ఫెడ్ కమిటీలో వుందని యెలెన్ ప్రకటించారు. కానీ ఇంధన ధరలు తగ్గినందున, ద్రవ్యోల్బణం కొద్దికాలం కనిష్టస్థాయిలో కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లను పెంచినా, భవిష్యత్ ద్రవ్య విధానం సరళంగానే వుంటుందని ఆమె చెప్పారు.  

 ఇక బంతి రాజన్ కోర్టులో...
 ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంపై వెనకడుగు వేయడంతో సెప్టెంబర్ 29 నాటి రిజర్వుబ్యాంక్ పరపతి విధాన సమీక్షపై దేశీయ పరిశ్రమ, మార్కెట్ల దృష్టిమళ్లింది. గురువారంనాటి యెలెన్ సరళ విధాన ప్రకటనకు అనుగుణంగా ఫెడ్ రేటు పెంపు సమయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఆర్‌బీఐకి లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇక రేట్ల కోతపై ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ నిర్ణయం తీసుకోవడమే తరువాయి అని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

భారత్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని, కరెంటు ఖాతా లోటు దిగివచ్చిందని, ఫారెక్స్ నిల్వలు పుష్కలంగా వున్నాయని, ఈ సానుకూలాంశాలన్నీ వడ్డీ రేట్ల తగ్గింపునకు మార్గం కల్పిస్తున్నట్లు విశ్లేషకులు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది తొలినాళ్లలో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే, సహజంగానే కొంతమేర విదేశీ నిధులు తరలివెళతాయని, అంతమాత్రాన ఆ రేట్ల పెంపు సమయం గురించి అంచనాలు వేసుకుంటూ, భారత్ స్వంత ద్రవ్య విధానాన్ని స్తంభింపచేయాల్సిన అవసరం లేదని వారు వివరించారు.
 
 రూపాయి 79 పైసలు జంప్-ఫెడ్ నిర్ణయంతో నెల గరిష్టానికి...
 ముంబై: డాలర్‌తో రూపాయి మారకం శుక్రవారం 79 పైసలు బలపడి 65.67 వద్ద ముగిసింది. ఒక్క రోజులో ఈ స్థాయిలో రూపాయి పెరగడం ఈ ఏడాది ఇదే మొదటిసారి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచకపోవడంతో డాలర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో రూపాయి నెల గరిష్టానికి ఎగసింది. ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాలు తొలగిపోవడంతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక, కరెన్సీ మార్కెట్లలో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుంది. భారత్ స్టాక్ మార్కెట్ బలపడపడడం, ద్రవ్యోల్బణం తగ్గడంతో కరంట్ అకౌంట్ లోటు ఆందోళనలు తగ్గుముఖం పట్టటం  కూడా ప్రభావం చూపాయి. సర్వీసుల రంగం ఎగుమతులు పెరగడం, వాణిజ్య లోటు తగ్గడంతో జూన్ క్వార్టర్‌కు కరంట్ అకౌంట్ లోటు జీడీపీలో 1.2 శాతానికి తగ్గి 620 కోట్ల డాలర్లకు చేరింది. ఫారెక్స్ మార్కెట్లో గత బుధవారం డాలర్‌తో రూపాయి మారకం 66.46 వద్ద ముగిసింది.
 
 కోతకు అవకాశం
 ఫెడ్ నిర్ణయం ఆర్‌బీఐ రేటు కోతకు ఒక అవకాశాన్ని కల్పించింది. ద్రవ్యోల్బణం కొంత పెరిగినా అది ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం కాదు. అయితే రేటు కోత ఎంత ఉండవచ్చన్నది మాత్రం నేను చెప్పలేను.
 - అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చీఫ్
 
 తగిన పరిస్థితులు
 ఫెడ్ నిర్ణయం, బలహీన డిమాండ్, దిగువస్థాయి ద్రవ్యోల్బణం ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు కోతకు అవకాశం కల్పిస్తున్నాయి. వృద్ధి ఊపందుకోవడానికి ఆర్‌బీఐ రేటు కోత నిర్ణయం దోహదపడుతుంది.
 - అరుణ్ సింగ్, డీఅండ్‌బీ ఎకనమిస్ట్
 

 రేటు కోతపై ఆశలు పెంచిన ఫెడ్ నిర్ణయం
  అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రేటు యథాతథంగా కొనసాగుతుండడం-  భారత్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు కోత అంచనాలను పెంచింది. ఈ ఏడాది ఆర్‌బీఐ మూడు సార్లు 75 బేసిస్ పాయింట్లు రెపోరేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం-7.25 శాతం) తగ్గించింది. ఇందులో దాదాపు 33 బేసిస్ పాయింట్ల ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు అందించాయి. తాజా ఫెడ్ నిర్ణయం, ఈ పరిస్థితుల్లో  సెప్టెంబర్ 29న ఆర్‌బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో ఈ ఏడాది మరో విడత రెపో కోతపై వివిధ సంస్థల అంచనాలను చూస్తే...
 
 పావుశాతం కోత
 ఫెడ్ నిర్ణయం- ఆర్‌బీఐ భారీ రేటు కోత అవకాశానికి గండికొట్టింది.  ఈ నిర్ణయం మార్కెట్లలో మధ్య కాలికంగా అనిశ్చితిలో నిలిపే అవకాశాలు ఉన్నాయి. అయితే 29న ఆర్‌బీఐ పావుశాతం కోతకు మాత్రం అవకాశం ఉంది.
 -  ఇండియా రేటింగ్స్
 
 మార్గం సుగమం
 అంతర్జాతీయంగా ఉన్న ఒత్తిడి ఫెడ్ నిర్ణయంతో తొలగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ నెల్లో ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల రేటు కోతకు అవకాశం ఏర్పడింది. దేశీయంగా ఉన్న అంశాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయి.
 -  బీఓఎఫ్‌ఏ-ఎంఎల్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement