4వ త్రైమాసికంలో వృద్ధి పుంజుకుంటుంది
⇒ వ్యవస్థలో నగదు లభ్యత పెరగడమే కారణం
⇒ ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి నాల్గవ త్రైమాసికంలో (2016–17 జనవరి–మార్చి) వేగం పుంజుకుంటుందని ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఫిబ్రవరి 7,8 తేదీల్లో సమావేశమై రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు (రెపో)ను 6.25 శాతంగా కొనసాగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఇకమీదట మరింత రేటు పుంపు ఉండబోదనీ ఆర్‌బీఐ ఈ సందర్భంగా సంకేతాలు ఇచ్చింది.
ఈ సమావేశం మినిట్స్ బుధవారం విడుదలయ్యాయి. ‘‘పెద్ద నోట్ల రద్దు వెన్వెంటనే వినియోగ డిమాండ్ తగ్గింది. అయితే ఇది తిరిగి పుంజుకుంటుందని భావిస్తున్నాం. వ్యవస్థలో నగదు లభ్యత పెరగడమే దీనికి ప్రధాన కారణం’’ అని పటేల్ ఈ సమావేశంలో అన్నారు. 2017–18 బడ్జెట్ తగిన విధంగా ఉందని, మౌలిక రంగం, హౌసింగ్‌కు బడ్జెట్ ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రపంచ వృద్ధి 2016లోకన్నా 2017లో బాగుంటుందన్న అభిప్రాయాన్నీ ఆయన వ్యక్తం చేశారు.