రూపాయి, ద్రవ్యోల్బణంపై దృష్టి
ఈ వారం మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలు
⇒ అడ్వాన్సు ట్యాక్స్ చెల్లింపులు
⇒ పార్లమెంటు సమావేశాల్లో పరిణామాలు
⇒ ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: ఫిబ్రవరి నెల టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు, అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, పార్లమెంటు సమావేశాల్లో జరగబోయే పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయంటూ విశ్లేషకులు అంచనాల్ని వెల్లడించారు.
అలాగే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, రూపాయి మారకపు విలువ కదలికలు కూడా మార్కెట్‌కు కీలకమని వారు వ్యాఖ్యానించారు. గతవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 3.21 శాతం పడిపోయింది. ఒకవారంలో సూచీ ఇంతగా క్షీణించడం ఈ ఏడాది ఇదే ప్రధమం.రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలకంటే అధికంగా నమోదుకావడంతో రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్ల కోత ప్రక్రియకు బ్రేక్‌వేస్తుందన్న భయాలతో క్రితం వారం మార్కెట్ పడిపోయింది.
ఇక ఈ సోమవారం వెల్లడయ్యే ఫిబ్రవరి టోకు ద్రవ్యోల్బణం డేటా కోసం ఇన్వెస్టర్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. కార్పొరేట్ల అడ్వాన్సు ట్యాక్స్ చెల్లింపుల డేటా కూడా ఈ వారం తెలుస్తుంది. అడ్వాన్సు పన్ను చెల్లింపుల్ని బట్టి మార్చి త్రైమాసికంలో ఆయా కంపెనీలు సాధించబోయే లాభనష్టాలపట్ల ఇన్వెస్టర్లకు అంచనాలు ఏర్పడతాయి. తొలి విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మార్చి 20తో ముగియనున్నందున, ఈ సభల్లో జరిగే పరిణామాల పట్ల మార్కెట్ ఆసక్తి కనపరుస్తోందని మాంగ్లిక్ వివరించారు.
అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి మార్చి 17-18 తేదీల్లో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ జరిపే సమావేశం కీలకమైనదని ఆయన వివరించారు. ఫెడ్ వడ్డీ రేట్లను ఎప్పట్నించి పెంచవచ్చన్న సంకేతాల కోసం ఈ సమావేశంపై దేశీ, విదేశీ ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు. సమీప భవిష్యత్తులో దేశీ మార్కెట్లు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని మరికొంతమంది విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ వారం మార్కెట్ అటూఇటూ కదిలినా, బుల్లిష్‌గానే వుండవచ్చని బొనంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హిరేన్ ధకన్ చెప్పారు.
రూ. 72,000 కోట్లకు విదేశీ పెట్టుబడులు
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ క్యాపిటల్ మార్కెట్లో ఈ ఏడాది ఇప్పటివరకూ చేసిన పెట్టుబడుల మొత్తం రూ. 72,000 కోట్లకు చేరింది. ఈ మార్చి నెల తొలి రెండు వారాల్లో వారు ఈక్విటీ మార్కెట్లో రూ. 9,134 కోట్లు, రుణ మార్కెట్లో రూ. 4,567 కోట్లు పెట్టుబడి చేయడంతో ఈ పక్షంరోజుల్లో వారి పెట్టుబడుల మొత్తం రూ.13,706 కోట్లకు పెరిగినట్లు సెంట్రల్ డిపాజిటరీ డేటా వెల్లడిస్తున్నది. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్‌ఐఐల పెట్టుబడులు రూ.71,958 కోట్లకు చేరాయి.