అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు యధాతథం
డిసెంబర్ సమీక్షలో పెంచొచ్చని సంకేతం
న్యూయార్క్: అమెరికా సెంట్రల్ బ్యాంక్.. ఫెడరల్ రిజర్వ్ ‘ఫెడ్ ఫండ్’ రేటును ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ రేటు 0.25%-0.50% శ్రేణిలో ఉంది. రెండు రోజుల సమావేశం అనంతరం ఫెడ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రేటు పెంపునకు తగిన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని, ఈ ఏడాది చివరి నాటికి(డిసెంబర్ సమావేశంలో) రేటు పెంపు అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వ్ కమిటీ ఒక ప్రకటనలో సూచనప్రాయంగా తెలిపింది.
రేటు పెంపునకు తగిన పటిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయంగా ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన, వినియోగం వంటి అంశాలకు సంబంధించి రానున్న గణాంకాల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం వరకూ రేటు పెరక్కపోవచ్చన్న అంచనాల నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడ్డం గమనార్హం. వచ్చే ఏడాది కనీసం రెండు దఫాలుగా రేటు పెరగవచ్చని ఫెడ్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ‘మూడు దఫాల పెంపు’ అంచనాకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. ఏడేళ్ల పాటు 0-0.25% ఉన్న రేటు 2015 డిసెంబర్‌లో తొలిసారి పావుశాతం పెరిగి, 0.25- 0.50 శాతానికి చేరింది.