అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ హఠాత్తుగా అరశాతం వడ్డీ రేటును తగ్గించడంతో పాటు పలు ప్రధాన కేంద్ర బ్యాంకులు ఉద్దీపనలకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించినప్పటికీ, కరోనావైరస్ పలు ప్రపంచదేశాల్లో తీవ్రంగా వ్యాప్తిచెందడంతో మార్కెట్ల పతనం కొనసాగుతూ వుంది. ఈ తరహా కేంద్ర బ్యాంకుల సాయం.. ఇన్వెస్టర్లను సమీప భవిష్యత్తులో శాంతింపచేస్తుందా అన్నది అనుమానమే. వ్యాధివ్యాప్తి తగ్గుముఖం పట్టి, ఉత్పత్తి, విక్రయాలు తిరిగి సాధారణస్థాయికి చేరుకుంటున్న సంకేతాలు కన్పిస్తేనే ఈక్విటీ మార్కెట్లు స్థిరపడగలుగుతాయన్నది అత్యధిక విశ్లేషకుల భావన. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
మార్చి6తో ముగిసినవారంలో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 39,090 పాయింట్ల గరిష్టస్థాయికి చేరాక బీఎస్‌ఈ సెన్సెక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడితో 37,011 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 720 పాయింట్ల నష్టంతో 37,577 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారపు పతనక్రమంలో గతేడాది అక్టోబర్9నాటి ‘స్వింగ్ లో’ అయిన 37,415 స్థాయిని శుక్రవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ కోల్పోయినందున, కరెక్షన్ మరిన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నాయి.
ఈ వారం సెన్సెక్స్ నెగిటివ్‌గా మొదలైతే 37,000 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. దీన్ని కాపాడుకోలేకపోతే వేగంగా 36,720 పాయింట్ల స్థాయికి క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 35,990 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే తొలుత 37,750 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 38,385 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. అటుపై క్రమేపీ 38,890 పాయింట్ల వరకూ పెరగవచ్చు.
నిఫ్టీ 10,830 మద్దతు కోల్పోతే మరింత కరెక్షన్...
క్రితంవారం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, గత కాలమ్‌లో ప్రస్తావించినట్లే 11,390 పాయింట్ల వరకూ పెరిగాక వేగంగా 10,827కు పతనమయ్యింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 213 పాయింట్ల నష్టంతో 10,989 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ గతేడాది అక్టోబర్9నాటి ‘స్వింగ్ లో’ అయిన 11,090 పాయింట్ల దిగువనే ముగిసినందున, రానున్న వారాల్లో 10,670 వరకూ పతనం కొనసాగే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఇక ఈ వారం 10,830 పాయింట్ల స్థాయి తొలి మద్దతు. ఇది పోతే.. వేగంగా 10,670 పాయింట్ల దాకా తగ్గొచ్చు. ఈ లోపున 10,580 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే 11,035 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 11,250 పాయింట్లు, ఆ తర్వాత క్రమేపీ 11,390 వరకూ పెరగవచ్చు.
– పి. సత్యప్రసాద్
37,000 దిగువన మరింత పతనం
Published Mon, Mar 9 2020 5:11 AM | Last Updated on Mon, Mar 9 2020 5:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment