
మార్కెట్లకు ఫెడ్ ఆక్సిజన్
390 పాయింట్లు అప్
26,637 వద్దకు సెన్సెక్స్
3 రోజుల నష్టాలకు చెక్
అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్ట రికవరీ సాధించేవరకూ వడ్డీ రేట్లను నామమాత్ర స్థాయిలోనే కొనసాగించేందుకు ఫెడరల్ రిజర్వ్ కమిటీ నిర్ణయించినట్లు వెలువడ్డ వార్తలు ప్రపంచ స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించింది. సెన్సెక్స్ 390 పాయింట్లు జంప్‌చేసి రెండు వారాల గరిష్టం 26,637 వద్ద ముగిసింది.
బుధవారం రాత్రి అమెరికా మార్కెట్లు హైజంప్ చేయడంతోపాటు, గురువారం ఆసియా మార్కెట్లు లాభపడటం దేశీయంగా సెంటిమెంట్‌ను మెరుగుపరచింది. వెరసి ఉదయం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో నిఫ్టీ సైతం 118 పాయింట్లు ఎగసి 7,961 వద్ద నిలిచింది.
ఇతర విశేషాలివీ...
* బీఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, బ్యాంకింగ్, పవర్, మెటల్ 3-2% మధ్య ఎగశాయి.
* క్యాపిటల్ గూడ్స్ దిగ్గజాలలో భెల్ 8.5% జంప్‌చేసింది. తమిళనాడులో రూ. 7,800 కోట్ల విలువచేసే 1,320 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ ఆర్డర్‌ను పొందడం ఇందుకు కారణం.
* బ్యాంకింగ్‌లో ఫెడరల్ బ్యాంక్ 8% దూసుకెళ్లగా, బీఓఐ, యస్ బ్యాంక్, కెనరా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, పీఎన్‌బీ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 5-2% మధ్య పెరిగాయి.
* రియల్టీలో డీబీ 8% పుంజుకోగా, యూని టెక్, హెచ్‌డీఐఎల్, ఇండియాబుల్స్, అనంత్‌రాజ్, డీఎల్‌ఎఫ్ 5-2.5% మధ్య పెరిగాయి.
* పవర్ షేర్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జీఎం ఆర్, జేపీ పవర్, అదానీ పవర్, ఆర్‌పవర్, టాటా పవర్ 6.5-2.5% మధ్య ఎగశాయి.