క్యూ2 ఫలితాలే మార్కెట్లకు దిక్సూచి | Cue 2 results compass markets | Sakshi
Sakshi News home page

క్యూ2 ఫలితాలే మార్కెట్లకు దిక్సూచి

Published Mon, Oct 27 2014 12:11 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

క్యూ2 ఫలితాలే మార్కెట్లకు దిక్సూచి - Sakshi

క్యూ2 ఫలితాలే మార్కెట్లకు దిక్సూచి

జాబితాలో ఐసీఐసీఐ, మారుతీ, టెక్ మహీంద్రా
     
చమురు ధరలు, రూపాయి కదలికలూ కీలకమే
ఎఫ్‌ఐఐల పెట్టుబడులు, విదేశీ అంశాలపైనా దృష్టి
అమెరికా ఫెడ్ సమీక్షపై అంచనాలు

 
న్యూఢిల్లీ: రెండో దశలో వెల్లడికానున్న బ్లూచిప్ కంపెనీల ఫలితాలపైనే ఇకపై మార్కెట్ల నడక ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే తొలి దశలో భాగంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఫలితాలు ప్రకటించగా, ప్రయివేట్ రంగ ఆయిల్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ పనితీరు సైతం వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, టెక్ మహీంద్రా తదితర దిగ్గజాలు ఈ వారంలో ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటికితోడు సిమెంట్ రంగ దిగ్గజాలు ఏసీసీ, అంబుజాలతోపాటు టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్, మెటల్స్ దిగ్గజం సెసాస్టెరిలైట్, లుపిన్, సుజ్లాన్ ఎనర్జీ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి.

విదేశీ మార్కెట్ల ట్రెండ్

దేశీయంగా కంపెనీల క్యూ2 ఫలితాలపైనే ఇన్వెస్టర్లు దృష్టిపెట్టినప్పటికీ, ప్రపంచ స్టాక్ మార్కెట్ల తీరు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు సైతం కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు తెలిపారు. మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు, దేశీయంగా డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని వివరించారు. రానున్న రోజుల్లో మార్కెట్లు సానుకూలంగా కదిలే అవకాశాలే అధికంగా ఉన్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ అభిప్రాయపడ్డారు. అయితే ఫలితాల సీజన్ నేపథ ్యంలో ట్రేడర్లు షేర్ల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉన్నదని చెప్పారు.
 
ఫె‘డర్’ల్ రిజర్వ్...

ప్రపంచవ్యాప్తంగా కమోడిటీలు, స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయగల అమెరికా ఫెడలర్ రిజర్వ్ ఈ వారంలో పాలసీ సమీక్షను నిర్వహించనుంది. మంగళవారం(28న) మొదలుకానున్న రెండు రోజుల సమావేశం బుధవారం(29న) ముగుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చెలరేగిన రుణ సంక్షోభం నేపథ్యంలో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ఫెడరల్ రిజర్వ్ 2009 నుంచీ సహాయక ప్యాకేజీలను అమలు చేస్తూ వస్తోంది. దీనిలో భాగంగా నామమాత్ర వడ్డీ రేట్లను కొనసాగించడంతోపాటు, బాండ్ల కొనుగోలు ద్వారా బిలియన్ల కొద్దీ డాలర్లను వ్యవస్థలోకి పంప్‌చేస్తూ వచ్చింది. అయితే గత కొన్ని నెలలుగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ఉద్యోగ గణాంకాలు మెరుగుపడటం వంటి అంశాల కారణంగా ప్యాకేజీలో కోత విధించింది. ఈ బాటలో నవంబర్‌కల్లా ప్యాకేజీకి పూర్తిగా మంగళం పాడనుంది. ఆపై మిగిలింది వడ్డీ రేట్ల పెంపే. అయితే సమీప భవిష్యత్‌లో వడ్డీ రేట్లను పెంచబోమంటూ గల సమీక్షలో ఫెడరల్ స్పష్టం చేసినప్పటికీ, ఈ అంశంపై అంచనాలు కొనసాగుతూనే ఉన్నాయ్. వెరసి ఫెడ్ పాలసీ సమీక్షపై అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకోవడం విశేషం! తాజాగా జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఒక్కసారిగా సెంటిమెంట్ పుంజుకుంది. దీంతో గడిచిన వారంలో సెన్సెక్స్ నికరంగా 743 పాయింట్లు ఎగసింది. 26,851 వద్ద ముగిసింది.
 
అక్టోబర్‌లో విదేశీ పెట్టుబడులు రూ. 9,000 కోట్లు

దేశీ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు కొనసాగుతున్నాయి. సెబీ తాజా గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌లో 1.5 బిలియన్ డాలర్లను(రూ. 9,000 కోట్లు) ఇన్వెస్ట్‌చేశారు. దీంతో జనవరి మొదలు ఇప్పటివరకూ ఈ ఏడాది ఎఫ్‌పీఐల పెట్టుబడులు 35 బిలియన్ డాలర్లను చేరుకున్నాయి. అయితే ఈ నెల అక్టోబర్‌లో 1 నుంచి 22 వరకూ రుణ సెక్యూరిటీల మార్కెట్లో రూ. 12,645 కోట్లు(2.06 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్‌చేయగా, ఈక్విటీల నుంచి మాత్రం రూ. 3,500 కోట్ల(57 కోట్ల డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా, జనవరి నుంచి చూస్తే ఈక్విటీలలో నికరంగా రూ. 79,938 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. రూ. 1.3 లక్షల కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement