Blue-chip company
-
రెండేళ్లలో సీఈఓల వేతనం డబుల్
న్యూఢిల్లీ : ప్రైవేటు రంగంలో బ్లూచిప్ కంపెనీల సీఈవోల వేతనాలు రెండేళ్లలోనే దాదాపు రెట్టింపయ్యాయి. సగటున వార్షిక వేతనం రూ.19 కోట్లకు పెరిగింది. రెండేళ్ల క్రితం (2013-14) ఇది రూ.9.9 కోట్లుగానే ఉంది. అయితే, అమెరికాలోని లిస్టెడ్ బ్లూచిప్ కంపెనీల సీఈవోల వేతనాలతో పోల్చి చూస్తే దేశీయ లిస్టెడ్ బ్లూచిప్ కంపెనీల సీఈవోల వేతనం సగటున ఆరింట ఒక వంతు కంటే తక్కువే. అమెరికన్ కంపెనీల్లో సీఈవో వేతనాలు 2015లో 2 కోట్ల డాలర్లు (రూ.130 కోట్లు సుమారు)గా ఉన్నాయి. అదే దేశీయంగా చూస్తే మాత్రం ప్రభుత్వ-ప్రైవేటు రంగాల మధ్య కూడా ఇదే అంతరం కనిపిస్తోంది. ప్రభుత్వ రంగ కంపెనీల సీఈవోల వేతనం సగటున రూ.25-30 లక్షలుగానే ఉంది. సెన్సెక్స్‌లో భాగమైన ప్రైవేటు కంపెనీల సీఈవోలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో సగటున అందుకున్న వేతనాలను పరిశీలిస్తే... సీఈవోలు లేదా ఉన్నత స్థానంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్లు, లేదా ఎండీలు వార్షికంగా అందుకున్న వేతనం 19 కోట్లు. వేతనాలు, కమీషన్లు, పారితోషికాలు, ఎంప్లాయ్ స్టాక్ ఆప్షన్లు, ఇతర భత్యాలు అన్నీ ఇందులో భాగంగానే ఉన్నాయి. 24 కంపెనీలకు గాను 20 కంపెనీలు వెల్లడించిన వివరాల ఆధారంగా వేసిన అంచనాలు ఇవి. మరి అదే సెన్సెక్స్‌లో భాగంగా ఉన్న ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య వేతనం మాత్రం రూ.31.1 లక్షలుగానే ఉంది. అత్యధికంగా ఎల్అండ్టీ చైర్మన్ ఏఎం నాయక్ రూ.66.14 కోట్లు స్వీకరించగా... సగటున తక్కువ అందుకున్నది ప్రైవేటు రంగ బ్యాంకుల అధిపతులు కావడం గమనార్హం. కొన్ని సంస్థల బాస్‌ల వేతనాలు ⇔ ఏఎం నాయక్, ఎల్అండ్టీ రూ.66.14 కోట్లు ⇔ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం, ఎల్అండ్టీ రూ.22 కోట్లు ⇔ విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ రూ.48.73 కోట్లు ⇔ దేశ్‌బంధు గుప్తా, లుపిన్ రూ.44.8 కోట్లు ⇔ శిఖర్ శర్మ, యాక్సిక్ బ్యాంకు రూ.5.5 కోట్లు ⇔ చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంకు రూ.6.6 కోట్లు ⇔ దీపక్ పరేఖ్, చైర్మన్ హెచ్డీఎఫ్సీ రూ.1.89 కోట్లు ⇔ ముకేశ్ అంబానీ, ఆర్ఐఎల్ రూ.15 కోట్లు ⇔ గౌతం అదానీ, అదానీ పోర్ట్స్ రూ.2.8 కోట్లు ⇔ రాహుల్ బజాజ్, బజాజ్ ఆటో రూ.11.3 కోట్ల్లు ⇔ సంజీవ్ మెహతా, హెచ్‌యూఎల్ 13.87 కోట్లు -
ఒడిదుడుకుల వారం!
- మార్కెట్‌పై నిపుణుల అంచనా - మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులకు ముగింపు - కార్పొరేట్ల ఫలితాల తుదిదశ న్యూఢిల్లీ: చివరిదశ కార్పొరేట్ ఫలితాలు, మే నెల డెరివేటివ్స్ ముగింపు వంటి అంశాలతో ఈ వారం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనుకావొచ్చని విశ్లేషకులు అంచనావేశారు. ఈ వారం బ్లూచిప్ కంపెనీలైన బీహెచ్ఈఎల్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, గెయిల్, కోల్ ఇండియా, హిందాల్కో, ఓఎన్జీసీ, ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, సిప్లాలు క్యూ4 ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనున్నాయి. ఇక మే నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్నాయి. వీటి ముగింపు, జూన్ నెలకు జరిగే రోలోవర్స్ కారణంగా మార్కెట్ అటూ, ఇటూ ఊగిసలాడవచ్చన్న అంచనాల్ని నిపుణులు వ్యక్తంచేశారు. కార్పొరేట్ ఫలితాల సీజన్ చివరిదశకు వచ్చిందని, ఆయా ఫలితాలకు అనుగుణంగా షేర్లు హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అన్నారు. ఆర్థిక వృద్ధికి కీలకమైన రుతుపవనాల కదలికల్ని మార్కెట్ జాగ్రత్తగా గమనిస్తుందని ఆయన చెప్పారు. ఆర్బీఐ వైపు చూపు....: రేట్ల కోతపై రిజర్వుబ్యాంక్ తీసుకోబోయే నిర్ణయంపై అంచనాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిస్తాయని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ హితేశ్ అగర్వాల్ అన్నారు. జూన్ 2న ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష వుంటుంది. ద్రవ్యోల్బణం తగ్గడం, పారిశ్రామికోత్పత్తి క్షీణించడం వంటి కారణాలతో ఆర్బీఐ ఈ దఫా సమీక్షలో రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు మార్కెట్లో వున్నాయని ఆయన చెప్పారు. గతవారం మార్కెట్...: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలత ఫలితంగా గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 634 పాయింట్లు లాభపడి 27,957 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా మూడువారాల్లో సెన్సెక్స్ 946 పాయింట్లు వృద్ధిచెందింది. అదేతీరులో ఎన్ఎస్ఈ నిఫ్టీ 197 పాయింట్ల లబ్దితో 8,459 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ షేర్లు క్రితం వారం ర్యాలీ జరిపాయి. ఎఫ్‌పీఐల విక్రయాలు 14,000 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) మే నెలలో ఇప్పటివరకూ స్టాక్, డెట్ మార్కెట్లలో రూ. 14,000 కోట్ల నికర విక్రయాలు జరిపారు. రూ. 5,867 కోట్ల విలువైన షేర్లను, రూ. 8,807 కోట్ల విలువైన రుణపత్రాల్ని విక్రయించడంతో ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ. 14,674 కోట్లకు చేరినట్లు డేటా వెల్లడిస్తున్నది. పన్నుల సమస్య, అంతర్జాతీయంగా క్రూడ్ ధర పెరగడం, ఆర్బీఐ రేట్ల తగ్గింపుపై అనిశ్చితి అమ్మకాలకు కారణమని విశ్లేషకులంటున్నారు. -
క్యూ2 ఫలితాలే మార్కెట్లకు దిక్సూచి
జాబితాలో ఐసీఐసీఐ, మారుతీ, టెక్ మహీంద్రా చమురు ధరలు, రూపాయి కదలికలూ కీలకమే ఎఫ్ఐఐల పెట్టుబడులు, విదేశీ అంశాలపైనా దృష్టి అమెరికా ఫెడ్ సమీక్షపై అంచనాలు న్యూఢిల్లీ: రెండో దశలో వెల్లడికానున్న బ్లూచిప్ కంపెనీల ఫలితాలపైనే ఇకపై మార్కెట్ల నడక ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పటికే తొలి దశలో భాగంగా సాఫ్ట్వేర్ దిగ్గజాలు, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఫలితాలు ప్రకటించగా, ప్రయివేట్ రంగ ఆయిల్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ పనితీరు సైతం వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, టెక్ మహీంద్రా తదితర దిగ్గజాలు ఈ వారంలో ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటికితోడు సిమెంట్ రంగ దిగ్గజాలు ఏసీసీ, అంబుజాలతోపాటు టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్, మెటల్స్ దిగ్గజం సెసాస్టెరిలైట్, లుపిన్, సుజ్లాన్ ఎనర్జీ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. విదేశీ మార్కెట్ల ట్రెండ్ దేశీయంగా కంపెనీల క్యూ2 ఫలితాలపైనే ఇన్వెస్టర్లు దృష్టిపెట్టినప్పటికీ, ప్రపంచ స్టాక్ మార్కెట్ల తీరు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు సైతం కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు తెలిపారు. మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు, దేశీయంగా డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని వివరించారు. రానున్న రోజుల్లో మార్కెట్లు సానుకూలంగా కదిలే అవకాశాలే అధికంగా ఉన్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. అయితే ఫలితాల సీజన్ నేపథ ్యంలో ట్రేడర్లు షేర్ల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉన్నదని చెప్పారు. ఫె‘డర్’ల్ రిజర్వ్... ప్రపంచవ్యాప్తంగా కమోడిటీలు, స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయగల అమెరికా ఫెడలర్ రిజర్వ్ ఈ వారంలో పాలసీ సమీక్షను నిర్వహించనుంది. మంగళవారం(28న) మొదలుకానున్న రెండు రోజుల సమావేశం బుధవారం(29న) ముగుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చెలరేగిన రుణ సంక్షోభం నేపథ్యంలో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ఫెడరల్ రిజర్వ్ 2009 నుంచీ సహాయక ప్యాకేజీలను అమలు చేస్తూ వస్తోంది. దీనిలో భాగంగా నామమాత్ర వడ్డీ రేట్లను కొనసాగించడంతోపాటు, బాండ్ల కొనుగోలు ద్వారా బిలియన్ల కొద్దీ డాలర్లను వ్యవస్థలోకి పంప్చేస్తూ వచ్చింది. అయితే గత కొన్ని నెలలుగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ఉద్యోగ గణాంకాలు మెరుగుపడటం వంటి అంశాల కారణంగా ప్యాకేజీలో కోత విధించింది. ఈ బాటలో నవంబర్‌కల్లా ప్యాకేజీకి పూర్తిగా మంగళం పాడనుంది. ఆపై మిగిలింది వడ్డీ రేట్ల పెంపే. అయితే సమీప భవిష్యత్‌లో వడ్డీ రేట్లను పెంచబోమంటూ గల సమీక్షలో ఫెడరల్ స్పష్టం చేసినప్పటికీ, ఈ అంశంపై అంచనాలు కొనసాగుతూనే ఉన్నాయ్. వెరసి ఫెడ్ పాలసీ సమీక్షపై అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకోవడం విశేషం! తాజాగా జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఒక్కసారిగా సెంటిమెంట్ పుంజుకుంది. దీంతో గడిచిన వారంలో సెన్సెక్స్ నికరంగా 743 పాయింట్లు ఎగసింది. 26,851 వద్ద ముగిసింది. అక్టోబర్‌లో విదేశీ పెట్టుబడులు రూ. 9,000 కోట్లు దేశీ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు కొనసాగుతున్నాయి. సెబీ తాజా గణాంకాల ప్రకారం సెప్టెంబర్‌లో 1.5 బిలియన్ డాలర్లను(రూ. 9,000 కోట్లు) ఇన్వెస్ట్‌చేశారు. దీంతో జనవరి మొదలు ఇప్పటివరకూ ఈ ఏడాది ఎఫ్‌పీఐల పెట్టుబడులు 35 బిలియన్ డాలర్లను చేరుకున్నాయి. అయితే ఈ నెల అక్టోబర్‌లో 1 నుంచి 22 వరకూ రుణ సెక్యూరిటీల మార్కెట్లో రూ. 12,645 కోట్లు(2.06 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్‌చేయగా, ఈక్విటీల నుంచి మాత్రం రూ. 3,500 కోట్ల(57 కోట్ల డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కాగా, జనవరి నుంచి చూస్తే ఈక్విటీలలో నికరంగా రూ. 79,938 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. రూ. 1.3 లక్షల కోట్ల విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు.