రెండేళ్లలో సీఈఓల వేతనం డబుల్
న్యూఢిల్లీ : ప్రైవేటు రంగంలో బ్లూచిప్ కంపెనీల సీఈవోల వేతనాలు రెండేళ్లలోనే దాదాపు రెట్టింపయ్యాయి. సగటున వార్షిక వేతనం రూ.19 కోట్లకు పెరిగింది. రెండేళ్ల క్రితం (2013-14) ఇది రూ.9.9 కోట్లుగానే ఉంది. అయితే, అమెరికాలోని లిస్టెడ్ బ్లూచిప్ కంపెనీల సీఈవోల వేతనాలతో పోల్చి చూస్తే దేశీయ లిస్టెడ్ బ్లూచిప్ కంపెనీల సీఈవోల వేతనం సగటున ఆరింట ఒక వంతు కంటే తక్కువే. అమెరికన్ కంపెనీల్లో సీఈవో వేతనాలు 2015లో 2 కోట్ల డాలర్లు (రూ.130 కోట్లు సుమారు)గా ఉన్నాయి. అదే దేశీయంగా చూస్తే మాత్రం ప్రభుత్వ-ప్రైవేటు రంగాల మధ్య కూడా ఇదే అంతరం కనిపిస్తోంది. ప్రభుత్వ రంగ కంపెనీల సీఈవోల వేతనం సగటున రూ.25-30 లక్షలుగానే ఉంది. సెన్సెక్స్‌లో భాగమైన ప్రైవేటు కంపెనీల సీఈవోలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో సగటున అందుకున్న వేతనాలను పరిశీలిస్తే...
సీఈవోలు లేదా ఉన్నత స్థానంలో ఉన్న ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్లు, లేదా ఎండీలు వార్షికంగా అందుకున్న వేతనం 19 కోట్లు. వేతనాలు, కమీషన్లు, పారితోషికాలు, ఎంప్లాయ్ స్టాక్ ఆప్షన్లు, ఇతర భత్యాలు అన్నీ ఇందులో భాగంగానే ఉన్నాయి. 24 కంపెనీలకు గాను 20 కంపెనీలు వెల్లడించిన వివరాల ఆధారంగా వేసిన అంచనాలు ఇవి. మరి అదే సెన్సెక్స్‌లో భాగంగా ఉన్న ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య వేతనం మాత్రం రూ.31.1 లక్షలుగానే ఉంది. అత్యధికంగా ఎల్‌అండ్‌టీ చైర్మన్ ఏఎం నాయక్ రూ.66.14 కోట్లు స్వీకరించగా... సగటున తక్కువ అందుకున్నది ప్రైవేటు రంగ బ్యాంకుల అధిపతులు కావడం గమనార్హం.
కొన్ని సంస్థల బాస్‌ల వేతనాలు
⇔ ఏఎం నాయక్, ఎల్‌అండ్‌టీ రూ.66.14 కోట్లు
⇔ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యం, ఎల్‌అండ్‌టీ రూ.22 కోట్లు
⇔ విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ రూ.48.73 కోట్లు
⇔ దేశ్‌బంధు గుప్తా, లుపిన్ రూ.44.8 కోట్లు
⇔ శిఖర్ శర్మ, యాక్సిక్ బ్యాంకు రూ.5.5 కోట్లు
⇔ చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంకు రూ.6.6 కోట్లు
⇔ దీపక్ పరేఖ్, చైర్మన్ హెచ్‌డీఎఫ్‌సీ రూ.1.89 కోట్లు
⇔ ముకేశ్ అంబానీ, ఆర్‌ఐఎల్ రూ.15 కోట్లు
⇔ గౌతం అదానీ, అదానీ పోర్ట్స్ రూ.2.8 కోట్లు
⇔ రాహుల్ బజాజ్, బజాజ్ ఆటో రూ.11.3 కోట్ల్లు
⇔ సంజీవ్ మెహతా, హెచ్‌యూఎల్ 13.87 కోట్లు