‘రూ.కోటి జీతమిచ్చినా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులంతే’ | even with Rs 1 crore salary techies in India are unwilling to work hard says US based CEO | Sakshi
Sakshi News home page

రూ.కోటి జీతమిచ్చినా వారంతే.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులపై సీఈవో వ్యాఖ్యలు

Published Mon, Feb 3 2025 11:24 AM | Last Updated on Mon, Feb 3 2025 11:44 AM

even with Rs 1 crore salary techies in India are unwilling to work hard says US based CEO

భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులపై తీవ్ర విమర్శలు చేశారు అమెరికాకు చెందిన ఓ కంపెనీ సీఈవో. భారత్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లు రూ. 1 కోటి వరకు అధిక జీతాలు ఇస్తున్నా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా లేరని విమర్శించారు. ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన వరుణ్ ఉమ్మడి తన కంపెనీ భారతీయ కార్యాలయానికి నియామకం ఇబ్బందిగా మారిందని, చాలా మంది ఇంజనీర్లు కూడా వారానికి ఆరు రోజులు పని చేయడానికి కూడా ఇష్టపడటం లేదంటూ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

"మా భారతీయ కార్యాలయానికి ఇంజనీర్లను నియమించుకోవడంలో ఒక విచిత్ర పరిస్థితిని గమనించాను. రూ. 1 కోటి మూల వేతనం ఉన్నప్పటికీ, చాలా మంది కష్టపడి పనిచేయడానికి ఇష్టపడటం లేదు. 3 నుంచి 8 సంవత్సరాల అనుభవం ఉన్న ఇంజనీర్లు చాలా మంది వారానికి ఆరు రోజులు పని చేయడానికి ముందుకు రాలేదు" అంటూ వరుణ్‌ రాసుకొచ్చారు.

వరుణ్‌ ‘ఎక్స్‌’ పోస్ట్‌కు లక్షలలో వ్యూస్‌ వచ్చాయి. భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన వచ్చింది.  సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు మాత్రమే కాదు.. ప్రస్తుతం అన్ని వృత్తులలోనివారూ మెరుగైన వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ కోరుకుంటున్నారని చాలా మంది వినియోగదారులు కామెంట్స్‌ చేశారు.

ఉద్యోగులను ఆదివారాలు కూడా పని చేయాలంటూ ఎల్‌అండ్‌టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలతో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వివాదం మళ్లీ రాజుకుంది. ఈ నేపథ్యంలో వరుణ్‌ ఉమ్మడి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఉద్యోగులతో  వారానికి ఆరు రోజులు ఎందుకు పని చేయిస్తున్నారంటూ కొంతమంది ఎక్స్‌ యూజర్లు వరుణ్‌ను  ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement