Rs 1 crore salary
-
‘రూ.కోటి జీతమిచ్చినా సాఫ్ట్వేర్ ఉద్యోగులంతే’
భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులపై తీవ్ర విమర్శలు చేశారు అమెరికాకు చెందిన ఓ కంపెనీ సీఈవో. భారత్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రూ. 1 కోటి వరకు అధిక జీతాలు ఇస్తున్నా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా లేరని విమర్శించారు. ఐఐటీ పూర్వ విద్యార్థి అయిన వరుణ్ ఉమ్మడి తన కంపెనీ భారతీయ కార్యాలయానికి నియామకం ఇబ్బందిగా మారిందని, చాలా మంది ఇంజనీర్లు కూడా వారానికి ఆరు రోజులు పని చేయడానికి కూడా ఇష్టపడటం లేదంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు."మా భారతీయ కార్యాలయానికి ఇంజనీర్లను నియమించుకోవడంలో ఒక విచిత్ర పరిస్థితిని గమనించాను. రూ. 1 కోటి మూల వేతనం ఉన్నప్పటికీ, చాలా మంది కష్టపడి పనిచేయడానికి ఇష్టపడటం లేదు. 3 నుంచి 8 సంవత్సరాల అనుభవం ఉన్న ఇంజనీర్లు చాలా మంది వారానికి ఆరు రోజులు పని చేయడానికి ముందుకు రాలేదు" అంటూ వరుణ్ రాసుకొచ్చారు.వరుణ్ ‘ఎక్స్’ పోస్ట్‌కు లక్షలలో వ్యూస్ వచ్చాయి. భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే కాదు.. ప్రస్తుతం అన్ని వృత్తులలోనివారూ మెరుగైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారని చాలా మంది వినియోగదారులు కామెంట్స్ చేశారు.ఉద్యోగులను ఆదివారాలు కూడా పని చేయాలంటూ ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలతో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వివాదం మళ్లీ రాజుకుంది. ఈ నేపథ్యంలో వరుణ్ ఉమ్మడి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఉద్యోగులతో వారానికి ఆరు రోజులు ఎందుకు పని చేయిస్తున్నారంటూ కొంతమంది ఎక్స్ యూజర్లు వరుణ్‌ను ప్రశ్నించారు. -
రూ.కోటి జీతమొచ్చే ఉద్యోగానికి ‘ఆనందం’గా రాజీనామా
సాధారణంగా ఎవరైనా చేస్తున్న ఉద్యోగాన్ని ఎప్పుడు వదిలేస్తారు? ఏదైనా మరో మంచి ఉద్యోగ అవకాశం చేతిలో ఉన్నప్పుడు ఇలా చేస్తారు. కానీ బెంగుళూరుకు చెందిన ఓ టెక్కీ రూ.కోటి జీతమొచ్చే లక్షణమైన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేశారు. అది కూడా చేతిలో ఎలాంటి ఆఫర్ లేకుండా..అంతటి భారీ జీతమొచ్చే జాబ్‌ను తాను ఎందుకు విడిచిపెట్టింది.. వివరిస్తూ బెంగుళూరుకు చెందిన టెక్కీ వరుణ్ హసిజా ఇటీవల ‘ఎక్స్’లో పెట్టిన పోస్ట్ విస్తృత చర్చకు దారితీసింది. బెంగుళూరులో తన ప్రోడక్ట్ మేనేజ్మెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయడం ద్వారా తాను ఒక ముఖ్యమైన జీవిత నిర్ణయం తీసుకున్నట్లు హసిజా వెల్లడించారు. ఇక్కడ ఆయనకు రూ. 1 కోటి పైగా వార్షిక వేతనం వచ్చేదని వివరించారు.కారణం ఇదే..చేతిలో ఎటువంటి ఉద్యోగ ఆఫర్ లేకుండా భారీ జీతమొచ్చే జాబ్ నుంచి ఎందుకు విరమించిదీ వరుణ్ హసిజా ఆసక్తికరమైన కారణం చెప్పారు. దశాబ్దంపాటు కెరీర్ సాగిన తర్వాత అర్ధవంతమైన విరామం అవసరమని పేర్కొంటూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.నిర్ణయం ఉద్వేగభరితమైనది కాదని, ఉద్యోగ అవకాశాలను అంచనా వేసేటప్పుడు తాను అనుసరించే నిర్మాణాత్మక ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా తీసుకున్నది హసిజా పేర్కొన్నారు. తన ఫ్రేమ్‌వర్క్ ఆనందం, ప్రభావం, సంపద సృష్టి అనే మూడు ప్రధాన కారకాల చుట్టూ తిరుగుతుందని వివరించారు. పనిలో ఆనందం ఉండాలనేది హసిజా సిద్ధాంతం. అన్నింటికీ అదే పునాదిగా పనిచేస్తుందని ఆయన భావన.అంత జీతం వస్తున్నా తాను ఇప్పడు చేస్తున్న ఉద్యోగంలో సంతోషం, ప్రభావం ఎక్కువగా కనిపించడం లేదని హసిజా కనుగొన్నారు. ఎడ్టెక్ రంగం ఇప్పటికే పరిశ్రమ వ్యాప్త సవాళ్లను ఎదుర్కొంటోంది. అర్ధవంతమైన పని కంటే కూడా మనుగడ వైపు దృష్టిని మార్చడం ప్రారంభించింది. ఫలితంగా అంతర్గత మార్పులు పని ప్రదేశాన్ని అసంతృప్తికరంగా చేసింది. ఈ వాతావరణం పెరుగుతున్న ఒత్తిడితో పాటు ఆయన ప్రాధాన్యతలకు అనుగుణంగా లేని ఉద్యోగంలో కొనసాగడం విలువైనదేనా అని ప్రశ్నించేలా చేసింది.వరుణ్ హసిజా పెట్టిన పోస్టుకు సోషల్ మీడియాలో విస్తృత స్పందన వచ్చింది. అతని పోస్ట్‌లకు 2.2 లక్షల వ్యూస్ వచ్చాయి. సాహసోపేతమైన నిర్ణయానికి ప్రశంసలు వచ్చాయి. కొందరు హసిజా ధైర్యాన్ని మెచ్చుకోగా మరికొందరు ఆర్థిక భద్రత లేకుండా అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలివేయడం ఆచరణాత్మకతను ప్రశ్నించారు. -
కో అంటే.. జీతం కోటి రూపాయలే!
ముంబై: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ సంస్థలో 23 మంది ఉద్యోగులు ఏడాదికి కోటి రూపాయలకుపైగా జీతాన్ని తీసుకుంటున్నారు. ఐటీసీ తరహాలో ఫ్లిప్‌కార్ట్ కూడా ఉద్యోగుల ప్రతిభను గుర్తిస్తూ, వారికి భారీ స్థాయిలో వేతనాలిస్తూ ప్రోత్సహిస్తోంది. గతేడాది ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం ఉద్యోగులకు 476 కోట్ల రూపాయలను చెల్లించింది. 2014-15 సంవత్సరానికి గాను ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ మెకిన్ మహేశ్వరి 18.73 కోట్ల రూపాయల వేతనాన్ని అందుకున్నారు. హిందుస్తాన్ యునిలివర్ ఎండీ సంజీవ్ మెహతా, ఐటీసీ చైర్మన్ దేవేశ్వర్ వంటి టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాల కంటే మెకిన్ మహేశ్వరి జీతం ఎక్కువ కావడం విశేషం. కాగా మెకిన్ మహేశ్వరి గత సెప్టెంబర్ ఈ పదవి నుంచి వైదొలగి.. సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. గతేడాది హిందుస్తాన్ యూనిలివర్ కంపెనీలో 169 మంది ఎగ్జిక్యూటివ్‌లు ఎనిమిదంకెల జీతాన్ని (కోటి) తీసుకున్నారు. ఇన్ఫోసిస్‌లో 123 మంది, విప్రోలో 70 మంది ఉద్యోగులు కోటి రూపాయలకుపైగా జీతాన్ని అందుకున్నారు. ఈ ఏడాది ఈ కామర్స్ కంపెనీల్లో 500 మందికిపైగా ఎగ్జిక్యూటివ్‌లు కోటి రూపాయల వేతనాలను తీసుకోబోతున్నారు. కాగా ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులకు తాము అందుకుంటున్న భారీ స్థాయి వేతనాలకు తగినట్టుగా లక్ష్యాలకు చేరువకావాల్సిన బాధ్యత ఉంటుంది. నిరంతరం ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుంది.