కో అంటే.. జీతం కోటి రూపాయలే!
ముంబై: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ సంస్థలో 23 మంది ఉద్యోగులు ఏడాదికి కోటి రూపాయలకుపైగా జీతాన్ని తీసుకుంటున్నారు. ఐటీసీ తరహాలో ఫ్లిప్కార్ట్ కూడా ఉద్యోగుల ప్రతిభను గుర్తిస్తూ, వారికి భారీ స్థాయిలో వేతనాలిస్తూ ప్రోత్సహిస్తోంది. గతేడాది ఫ్లిప్కార్ట్ యాజమాన్యం ఉద్యోగులకు 476 కోట్ల రూపాయలను చెల్లించింది.
2014-15 సంవత్సరానికి గాను ఫ్లిప్కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ మెకిన్ మహేశ్వరి 18.73 కోట్ల రూపాయల వేతనాన్ని అందుకున్నారు. హిందుస్తాన్ యునిలివర్ ఎండీ సంజీవ్ మెహతా, ఐటీసీ చైర్మన్ దేవేశ్వర్ వంటి టాప్ ఎగ్జిక్యూటివ్ల వేతనాల కంటే మెకిన్ మహేశ్వరి జీతం ఎక్కువ కావడం విశేషం. కాగా మెకిన్ మహేశ్వరి గత సెప్టెంబర్ ఈ పదవి నుంచి వైదొలగి.. సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.
గతేడాది హిందుస్తాన్ యూనిలివర్ కంపెనీలో 169 మంది ఎగ్జిక్యూటివ్లు ఎనిమిదంకెల జీతాన్ని (కోటి) తీసుకున్నారు. ఇన్ఫోసిస్లో 123 మంది, విప్రోలో 70 మంది ఉద్యోగులు కోటి రూపాయలకుపైగా జీతాన్ని అందుకున్నారు. ఈ ఏడాది ఈ కామర్స్ కంపెనీల్లో 500 మందికిపైగా ఎగ్జిక్యూటివ్లు కోటి రూపాయల వేతనాలను తీసుకోబోతున్నారు. కాగా ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులకు తాము అందుకుంటున్న భారీ స్థాయి వేతనాలకు తగినట్టుగా లక్ష్యాలకు చేరువకావాల్సిన బాధ్యత ఉంటుంది. నిరంతరం ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుంది.