
ముగింపులో కొనుగోళ్లు..120 పాయింట్లు అప్
తాత్కాలికంగా ఫెడ్ భయాలు వెనక్కి
ముంబై: సోమవారం ట్రేడింగ్ ముగింపు సమయంలో కొనుగోళ్లు జరగడంతో స్టాక్ సూచీలు నష్టాల నుంచి కోలుకుని, స్వల్ప లాభాలతో ముగిసాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న సంకేతాల కారణంగా ఆసియా, యూరప్ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అయినా, ఆశ్చర్యకరంగా మన మార్కెట్ రికవరీ అయ్యిందని విశ్లేషకులు చెప్పారు. కనిష్టస్థాయిలో కొనుగోళ్లతో పాటు కొన్ని షేర్లలో షార్ట్ కవరింగ్ జరగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 27,698 పాయింట్ల నుంచి కోలుకుని, చివరకు 120 పాయింట్ల లాభంతో 27,903 పాయింట్ల వద్ద క్లోజయ్యిందని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వివరించారు.
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలతో గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 278 పాయింట్లు నష్టపోయింది. తాత్కాలికంగా రేట్ల పెంపు ఆందోళనలకు స్వస్తిచెప్పి, ఇన్వెస్టర్లు బ్లూచిప్ షేర్లను కొనుగోలు చేసినట్లు మార్కెట్ వర్గాలు వివరించాయి. ట్రేడింగ్ తొలిదశలో 8,544 పాయింట్ల కనిష్టస్థాయివరకూ తగ్గిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 35 పాయింట్ల లాభంతో 8,607 పాయింట్ల వద్ద ముగిసింది.
టాటా మోటార్స్ జూమ్: ఆటోమొబైల్ షేర్లకు పెద్ద ఎత్తున కొనుగోలు మద్దతు లభించింది. గత శుక్రవారంనాడు వెల్లడించిన ఆర్థిక ఫలితాలు ఆశావహంగా వుండటంతో టాటా మోటార్స్ షేరు 4 శాతంపైగా ర్యాలీ జరిపి ఏడాది గరిష్టస్థాయి రూ. 525 వద్ద ముగిసింది. ఇదేబాటలో హీరో మోటోకార్ప్ షేరు 2.8 శాతం ఎగిసింది. సెప్టెంబర్ 1న ఏజీఎం జరగనున్న నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2.85 శాతం పెరిగి రూ. 1,057 వద్ద క్లోజయ్యింది.