పడదు... పరిగెత్తదు?
2017 ప్రథమార్ధం వరకూ ఇదే పరిస్థితి
ఆ తరవాత పాలసీ నిర్ణయాలతో దిశానిర్దేశం
పెద్ద నోట్ల రద్దు ప్రభావం కొంత ఉండొచ్చు
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపే అతిపెద్ద ప్రతికూలం
సానుకూలాంశాలు కూడా చాలా ఉన్నాయ్
డిజిటల్‌తో పన్నుల వ్యవస్థ మెరుగుపడొచ్చు
ఎఫ్‌ఎంసీజీ రంగమే అత్యంత ఆకర్షణీయం
ఇన్‌ఫ్రా, ఆటో రంగాల్లోనూ త్వరగా రికవరీ
2017పై బ్రోకింగ్ సంస్థల అంచనాలివీ...
గతేడాది స్టాక్ మార్కెట్లు తక్కువ లాభాన్నే ఇచ్చాయనుకుంటారంతా!!. నిజమే.. మార్కెట్ సూచీలైన సెన్సెక్స్‌ను గానీ, నిఫ్టీని గానీ చూస్తే ఇదే అనిపిస్తుంది. ఏడాది ఆరంభం నుంచి చివరిదాకా చూసినపుడు సెన్సెక్స్ దాదాపు 560 పాయింట్లు లాభపడగా... నిఫ్టీ దాదాపు 220 పాయింట్లు లాభపడింది. శాతాల్లో చూస్తే ఇది 3కు మించదు. మరి నిజంగా ఇన్వెస్టర్లకు 3 శాతం లాభాలే వచ్చాయా? నిజం చెప్పాలంటే... కాస్త తెలివిగా, నిపుణుల సూచనలు పాటించి ఇన్వెస్ట్ చేసిన వారికి లాభం బాగానే వచ్చింది. ఇది ఎంత శాతమన్నది మాత్రం వారి పోర్టుఫోలియోపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇదే కాలంలో కొన్ని షేర్లు దాదాపు నూరు శాతం పెరిగిపోయాయి. కొన్ని ప్రభుత్వ సంస్థల షేర్లు సైతం 70–80 శాతం లాభమిచ్చాయి. ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి దిగ్గజ షేర్లను తీసుకున్నా 10 శాతానికి తక్కువ కాకుండా లాభాలు అందించాయి. ఇక ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటివైతే పరుగులు తీశాయి. ఏకంగా 40 నుంచి 55 శాతం మధ్య పెరిగాయి.
దీన్నిబట్టి తెలుసుకోవాల్సింది ఒక్కటే!!. మొత్తంగా మార్కెట్ ఎలా ఉన్నా సరే మనం ఎంచుకున్న రంగమో, కంపెనీయో బాగుంటే పరుగులు తీయక మానదు. మార్కెట్ నష్టాల్లో ఉన్నా కూడా మన షేర్లు మాత్రం లాభపడే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే... 2017లో మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయన్న విషయమై పలువురు నిపుణుల్ని, బ్రోకరేజీ సంస్థల్ని ‘సాక్షి’ సంప్రతించింది. మొత్తంగా ఈక్విటీ మార్కెట్లు ఎలా ఉంటాయి? ఏఏ రంగాలు బాగుంటాయి? ఏఏ షేర్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు? అనే అంశాలపై వారి అభిప్రాయాలు తెలుసుకుంది. 2017వ సంవత్సరంలోకి అడుగుపెడుతూ... మార్కెట్లు కొత్త సంవత్సర తొలి ట్రేడింగ్‌ను ఆరంభిస్తున్న తరుణంలో... ‘సాక్షి ప్రాఫిట్’ పాఠకుల కోసం ఈ ప్రత్యేక కథనం.
–సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
త్వరగానే సాధారణ స్థితి!
నిఫ్టీ 7572–9465 శ్రేణిలో కదలొచ్చు
ఫైనాన్స్, డిఫెన్స్, ఆటో షేర్లు రాణిస్తాయి
హెచ్చుతగ్గులు ఎలా ఉన్నా.. దీర్ఘకాలంలో పసిడి, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ వంటి సాధనాల కన్నా ఈక్విటీలే చక్కని రాబడులు అందించే అవకాశముంది. అందుకే స్వల్పకాలిక లాభాలు చూసుకోకుండా సిస్టమాటిక్ విధానంలో దీర్ఘకాలిక కోణంలో ఇన్వెస్ట్ చేయాలి. మంచి క్వాలిటీ కంపెనీల షేర్లలో పెట్టుబడులు కొనసాగించడం మంచిది. కొత్త సంవత్సరానికొస్తే... రాబోయే 12–15 నెలల్లో నిఫ్టీ 7572–9465 శ్రేణిలో తిరగొచ్చని అంచనా వేస్తున్నాం. దీర్ఘకాలిక ప్రాతిపదికన కన్సూమర్ గూడ్స్, ఫైనాన్షియల్, ఆటోమొబైల్, డిఫెన్స్, కెమికల్ రంగాల సంస్థల షేర్లు రాణించే అవకాశముంది. పెద్ద నోట్ల రద్దుతో అనిశ్చితి నెలకొన్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలో వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం ముందుగా అనుకున్నట్లు 2017 ఏప్రిల్ 1 నుంచి కాకుండా.. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకాస్త ఆలస్యమైనా కూడా ఆశ్చర్యం లేదు. డిమోనిటైజేషన్ కారణంగా స్వల్పకాలికంగా కొంత అనిశ్చితి నెలకొన్నప్పటికీ... డిజిటల్ లావాదేవీలు పెరగటం, పన్నులు కట్టేవారి సంఖ్య ఎక్కువవటం, వ్యాపార విశ్వాసం మెరుగుపడటం వంటివి జరుగుతాయి. వీటన్నిటి వల్లా 2017లో మళ్లీ సాధారణ పరిస్థితులు రాగలవని భావిస్తున్నాం.
రిస్కులు లేవనటం లేదు... చాలా రిస్కులున్నాయి
►నోట్ల రద్దు ప్రభావాలు దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మందగించే ప్రమాదముంది.
►ముడి చమురు ధరలు మెల్లగా పెరుగుతూ వస్తున్నాయి. ఒక్కసారిగా ఎగిసే అవకాశమూ లేకపోలేదు.
►పశ్చిమాసియా, సౌత్ చైనా సముద్రంలో భౌగోళిక, రాజకీయపరమైన సమస్యలు దేనికైనా దారితీయొచ్చు.
► జీఎస్‌టీ అమలు వంటి పాలసీపరమైన కీలకాంశాల్లో పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం ఇబ్బందే.
►అమెరికాలాంటి సంపన్న దేశాలు రక్షణాత్మక ధోరణిలోకి వెళుతున్నాయి. ఇది మంచిది కాదు.
ద్వితీయార్థంలో బాగుండొచ్చు ఇన్‌ఫ్రా, ఎగుమతి ఆధారిత కంపెనీలకు అనుకూలం ∙అంతర్జాతీయంగా కరెక్షన్ వస్తే మనపైనా ప్రభావం మార్కెట్లు ఈ ఏడాది ఒక దశలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిల దరిదాపులకు వెళ్లాయి. కానీ అక్కడ నిలదొక్కుకోలేకపోయాయి. తర్వాత తగ్గి.. అప్పటి నుంచి అంతంతమాత్రంగానే రాణించాయి. భారత్ సహా అంతర్జాతీయంగా వర్ధమాన మార్కెట్లలో అమ్మకాల వెల్లువ, ఇటు దేశీయంగా పెద్ద నోట్ల రద్దు వంటి పరిణామాలతో మార్కెట్లు బలహీనపడటం మొదలైనవి కరెక్షన్‌కి కారణమయ్యాయి. కాకపోతే, 2016లో పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులు, ముడి చమురు మొదలైన వాటిలో వేగంగా రికవరీ జరిగింది. మా అంచనా ప్రకారం కొత్త సంవత్సరంలో పెద్ద ర్యాలీల్లాంటివేమీ ఉండకపోయినా... స్టాక్‌మార్కెట్లు సానుకూలంగానే ఉండొచ్చు. డీమోనిటైజేషన్, జీఎస్‌టీ తదితర అంశాలతో పాటు అంతర్జాతీయ అనిశ్చితి పరిణామాల ప్రభావం వల్ల లాభాలు ఓ మోస్తరు స్థాయిలోనే ఉంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా మార్కెట్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. వాటిల్లో ఏదైనా కరెక్షన్ వస్తే.. అది మన మార్కెట్లపై కూడా ప్రభావం చూపిస్తుంది. ప్రథమార్ధం కాస్త బలహీనంగా ఉన్నా... పరిస్థితులన్నీ చక్కబడితే ద్వితీయార్థంలో మార్కెట్లు మెరుగ్గా ఉండవచ్చు. రూపాయి విషయానికొస్తే .. 2016 మాదిరిగానే 2017లోనూ మారకం విలువ కాస్త హెచ్చుతగ్గులకు లోనుకావచ్చు. కాకపోతే విలువ మరీ అంత ఎక్కువగా పడిపోకపోవచ్చు. జీఎస్‌టీ అమలు వంటి పరిణామాలతో... అటు తర్వాతి సంవత్సరంపై ఆశావహ అంచనాలతో... ఎఫ్‌ఐఐలు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావచ్చు. ఇది రూపాయి బలోపేతానికి కొంత దోహదపడొచ్చు. వచ్చే ఏడాది కూడా పసిడి రేట్లు పెద్దగా రికవరీ లేకుండా ఒక మోస్తరు స్థాయిలోనే కొనసాగవచ్చు. అయితే, ఇదంతా కూడా డిమాండ్, సరఫరా మీదే ఎక్కువగా ఆధారపడి మారిపోతుంటుంది.
ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫ్రా ఆకర్షణీయం...
దేశీ వృద్ధిపై పెద్దగా ఆధారపడని ఎగుమతి సంస్థలు, ప్రభుత్వ వ్యయాలతో ముడిపడి ఉన్న ఇన్‌ఫ్రా రంగ సంస్థలు మెరుగ్గా రాణించే అవకాశముంది. వాయిదా వేసుకున్నా పర్వాలేదు అనుకునేటువంటి... విచక్షణాయుతమైన కొనుగోళ్లపై ఆధారపడిన రంగాలు మాత్రం కోలుకునేందుకు కాస్త సమయం పడుతుంది. డీమోనిటైజేషన్ ప్రభావాలు ఎలా ఉన్నా.. చాలా వేగంగా సాధారణ పరిస్థితికి వచ్చేస్తున్న వాటిల్లో ఎఫ్‌ఎంసీజీ ఒకటి. ఈ విభాగంలో.. ముందుగా ఎఫ్‌ఎంసీజీ, ఆ తర్వాత చౌక వినియోగ వస్తువులు, వాటి తర్వాత ఖరీదైన వినియోగ వస్తువుల విభాగాలు కోలుకుంటాయి. ఆటోమొబైల్ రంగం విషయానికొస్తే... గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగుపడితే టూ వీలర్ల అమ్మకాలు మెరుగుపడొచ్చు. మొత్తంగా చూస్తే.. ముందుగా తక్కువ ధర ఉండే ఫోర్ వీలర్ల విభాగం... ఆ తర్వాత టూ వీలర్లు, చిట్టచివరికి హై ఎండ్ వాహనాల విభాగాల్లో అమ్మకాల రికవరీ ఉండొచ్చు.
ఫెడ్ రేట్లే ప్రధాన రిస్కు!!
అమెరికాలో ఫెడ్ రేట్లు పెంచడం మన మార్కెట్లకు ప్రధాన రిస్కుగా భావించవచ్చు. అలాగే, అంతర్జాతీయంగా మందగమనం రిస్కుతో పాటు దేశీయంగా పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు ప్రభావాల ప్రతికూలత కూడా ఉండొచ్చు. డీమోనిటైజేషన్ ప్రభావం కొన్ని త్రైమాసికాల పాటు... అటుపైన జీఎస్‌టీ అమల్లోకి వస్తే మరికొన్ని త్రైమాసికాల పాటు ఉండే అవకాశముంది. తదనుగుణంగా వృద్ధిపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. జీఎస్‌టీ ఉన్న దేశాలను చూస్తే... సాధారణంగానే అమలు చేసిన తొలినాళ్లలో వృద్ధి కొంత మందగించింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ ప్రభావాలు ఎక్కువగా నగదు లావాదేవీలు జరిగే అసంఘటిత రంగంపైనే ఉంటాయి. వ్యాపార సంస్థలు ఈ కొత్త మార్పులకు అనుగుణంగా సర్దుకోవడానికి కాస్త సమయం పడుతుంది కూడా.
బడ్జెట్ ప్రతిపాదనలతో దిశానిర్దేశం!!
ప్రభుత్వం నుంచి కొత్తగా వెలువడే పాలసీపరమైన ప్రకటనలు, బడ్జెట్ ప్రతిపాదనలు మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయి. వీటిలో సానుకూలాంశాలేమైనా ఉంటే రికవరీ అనేది ద్వితీయార్ధం దాకా కాకుండా కాస్త ముందే జరగొచ్చు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల సమీప భవిష్యత్‌లో తలెత్తే మందగమనాన్ని ఎదుర్కొనడానికి బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసినా, పాలసీపరంగా సానుకూల ప్రకటనలేమైనా చేసినా... మార్కెట్లపై ప్రతికూలత పెద్దగా ఉండకపోవచ్చు. బడ్జెట్‌లో సానుకూలాంశాలే కాకుండా మార్కెట్లను కాస్త కలవరపర్చే ప్రతిపాదనలూ ఉండొచ్చు. ఇటీవలి ప్రకటనలను బట్టి చూస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టీసీజీ) వ్యవధిని ప్రస్తుతమున్న ఏడాది నుంచి రెండు లేదా మూడేళ్లకు పొడిగించే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. చిన్న సంస్థల షేర్లలో బాగా అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అలాంటి వాటికే దీన్ని వర్తింపచేయొచ్చు. ఏదేమైనా క్యాపిటల్ గెయిన్స్ విషయంలో కొన్ని పరిమితులు ఉండొచ్చన్న అంచనాలున్నాయి. అలా కాకుండా అన్ని స్టాక్స్‌కూ వర్తింపచేస్తే మార్కెట్లు ఖచ్చితంగా నెగటివ్‌గానే స్పందిస్తాయి. అయితే ఆర్థిక మంత్రి జైట్లీ అలాంటివేమీ చేయబోమంటూ హామీ ఇచ్చిన దరిమిలా.. ఏవో కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం చేయొచ్చు.