ఐటీ షేర్లకు నష్టాలు
ఫెడ్, జీఎస్‌టీ మండలి సమావేశాల కారణంగా మార్కెట్లో అప్రమత్తత
ఒడిదుడుకులమయంగా సాగిన బుధవారం నాటి ట్రేడింగ్‌లో చివరకు స్టాక్ మార్కెట్ స్వల్పంగా నష్టపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయం, నేడు(గురువారం) జీఎస్‌టీ మండలి సమావేశం నేపథ్యంలో మార్కెట్‌లో అప్రమత్తత నెలకొన్నది. బీఎస్‌ఈ సెన్సెక్స్45 పాయింట్లు నష్టపోయి 29,398 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి 9,085 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, టెక్నాలజీ, ఆయిల్, గ్యాస్ షేర్లు క్షీణించగా, రియల్టీ, వాహన, కన్సూమర్ డ్యూరబుల్స్, లోహ, బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. సెన్సెక్స్ ఒక దశలో 85 పాయింట్లు లాభపడగా, మరొక దశలో 87 పాయింట్లు నష్టపోయింది.
ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 39 నెలల గరిష్ట స్థాయిలకు పెరగడంతో వచ్చే నెలలో జరిగే పరపతి సమీక్షలో ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించకపోవచ్చన్న అంచనాలు, మంగళవారం సెన్సెక్స్ 496 పాయింట్లు లాభపడిన నేప«థ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం,.. ప్రతికూల ప్రభావం చూపించాయి. ముడి పదార్ధాల ధరల పతనం కొనసాగుతుండటం, భారత్‌కు కాకుండా అమెరికాకుకు ఎగుమతులు పెంచాలని చైనా టైర్ల కంపెనీలు నిర్ణయించడంతో, భారత్‌కు చైనా టైర్ల తాకిడి తగ్గుతుందన్న అంచనాలతో టైర్ల షేర్లు లాభాల బాట పట్టాయి. ఎంఆర్‌ఎఫ్ షేర్7.6 శాతం(రూ.4,059) లాభపడి రూ.57,040 వద్ద ముగిసింది. ఈ షేర్ ఇంట్రాడేలో ఆల్–టైమ్ హై, రూ.57,059ను తాకింది.