
ఫిక్స్‌డ్ డిపాజిట్లవైపే మొగ్గు
• ఎఫ్‌డీల్లో 11 శాతం పెరిగిన వ్యక్తిగత సంపద
• రూ. 36.8 లక్షల కోట్లకు చేరిక
• అయిదేళ్లలో రూ. 558 లక్షల కోట్లకు చేరనున్న వ్యక్తిగత సంపద
• కార్వీ ప్రైవేట్ వెల్త్ 2016 నివేదిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మదుపుదారులు తమ పెట్టుబడుల ధోరణిని మార్చుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈక్విటీల్లో పెట్టుబడుల కన్నా.. ఎక్కువగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్ల వైపే మొగ్గు చూపారు. దీంతో ఎఫ్‌డీల్లో వ్యక్తిగత సంపద 11 శాతం పెరిగి రూ.36.8 లక్షల కోట్లకు చేరింది. పెట్టుబడి సాధనాలకు సంబంధించి నేరుగా ఈక్విటీల్లో పెట్టుబడులు, బీమా మొదలైనవి రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. ఆర్థిక సేవల దిగ్గజం కార్వీ గ్రూప్‌లో భాగమైన కార్వీ ప్రైవేట్ వెల్త్ ఏడో విడతగా విడుదల చేసిన ‘భారత సంపద నివేదిక– 2016’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
దేశీయంగా వ్యక్తిగత ఇన్వెస్టర్ల మదుపు ధోరణులను ప్రతిబింబించే ఈ నివేదిక ప్రకారం 2015–16లో దేశీయంగా వ్యక్తిగత సంపద 8.5 శాతం వృద్ధితో రూ.304 లక్షల కోట్లకు చేరింది. రాబోయే అయిదేళ్లలో ఇది చక్రగతిన 12.80 శాతం వృద్ధితో రూ.558 లక్షల కోట్లకు చేరనుంది. అంతంత మాత్రమైన ఈక్విటీల పనితీరుతో ఆర్థిక అసెట్స్‌లో వ్యక్తిగత సంపద కేవలం 7.14 శాతం పెరిగి రూ. 172 లక్షల కోట్లకు చేరింది. అదే భౌతిక ఆస్తుల్లో మాత్రం 10.32 శాతం వృద్ధితో రూ. 132 లక్షల కోట్లకు పెరిగింది.
ప్రత్యామ్నాయ ఆస్తులపై ఆసక్తి..
దేశీ ఇన్వెస్టర్ల సంపద ప్రత్యామ్నాయ, అంతర్జాతీయ ఆస్తుల్లోనూ గణనీయంగా పెరిగింది. ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడుల పరిమాణం ఏకంగా 85% పెరిగి రూ. 41,960 కోట్ల నుంచి రూ. 77,503 కోట్లకు, అంతర్జాతీయ అసెట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ రూ. 14,040 కోట్ల నుంచి 31 శాతం వృద్ధితో రూ. 18,462 కోట్లకు పెరిగాయి. డెట్, రియల్ ఎస్టేట్ వంటి సాధనాల్లో పెట్టుబడుల విషయంలో దేశీ ఇన్వెస్టర్ల తీరు అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగానే ఉన్నప్పటికీ.. ఈక్విటీలు, ప్రత్యామ్నాయ ఆస్తుల అంశంలో మాత్రం భిన్నంగా ఉంది.
అంతర్జాతీయంగా ఈక్విటీల్లో వ్యక్తిగత సంపద 25 శాతంగా ఉండగా.. దేశీయంగా మాత్రం ఇది 13 శాతమే ఉంది. అటు ప్రత్యామ్నాయ ఆస్తుల్లో దేశీయంగా వ్యక్తిగత సంపద 25.7 శాతంగా ఉండగా.. అంతర్జాతీయ స్థాయి లో ఇది 16%. డీమోనిటైజేషన్, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు మొదలైన పరిణామాలు స్వల్పకాలికంగా భారత ఎకానమీలో కొంత మేర పెనుమార్పులు తెచ్చే అవకాశం ఉందని కార్వీ ప్రైవేట్ వెల్త్ సీఈవో అభిజిత్ భవే తెలిపారు. అయితే, దీర్ఘకాలికంగా మాత్ర భారత వృద్ధి గాధ పటిష్టంగానే ఉంటుందని పేర్కొన్నారు.
స్వల్పకాలికంగా ఒడిదుడుకులు..
వర్ధమాన దేశాల్లో భారత్ ఇంకా ఆశాదీపంగా వెలుగొందుతున్నప్పటికీ .. పెద్ద నోట్ల రద్దు పరిణామాల నేపథ్యంలో స్వల్పకాలంలో ఎకానమీ కాస్త మందగించవచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో అటు అంతర్జాతీయ మార్కెట్లు.. వాటికి అనుగుణంగా దేశీ మార్కెట్లలోనూ కొంత ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. అయితే దీర్ఘకాలంలో చూస్తే జీఎస్‌టీ, రియల్ ఎస్టేట్ చట్టం తదితర సంస్కరణల ఊతంతో చైనా సహా వర్ధమాన దేశాలన్నింటిలోనూ భారత్ మెరుగ్గా రాణించగలదు. మరింత సంపద అధికారికంగా ఆర్థిక వ్యవస్థలకు రావడం ద్వారా డీమోనిటైజేషన్ కూడా దీర్ఘకాలంలో సానుకూల ప్రభావం చూపగలదు.
వచ్చే ఏడాది.. ఆపైన కూడా సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, చిన్న మొత్తాల పొదుపు పథకాలు మెరుగైన పెట్టుబడి సాధనాలుగా కొనసాగుతాయి. అయితే అంతిమంగా ఈ సంపద ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి సాధనాల్లోకి మళ్లగలదు. మరోవైపు.. బంగారం, రియల్ ఎస్టేట్ వంటి స్థిరాస్తుల్లో పెట్టుబడుల పరిమాణం తగ్గొచ్చు. వచ్చే అయిదేళ్లలో నేరుగా ఈక్విటీల్లో పెట్టుబడులు చక్రగతిన 20 శాతం మేర వృద్ధితో ఫేవరెట్ పెట్టుబడి సాధనంగా మళ్లీ అగ్రస్థానం దక్కించుకోగలదని అంచనా.