2016 ప్రథమార్ధంలో 1,000 డాలర్ల దిగువకు..!
పసిడిపై నిపుణుల అభిప్రాయం
న్యూయార్క్: పసిడిపై అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు పావు శాతం పెంపు (0.50 శాతం) ప్రభావం కనిపించింది. న్యూయార్క్ కామెక్స్ ట్రేడ్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఫిబ్రవరి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) ధర శుక్రవారం వారం వారీగా దాదాపు 11 డాలర్లు తగ్గి 1,065 వద్ద ముగిసింది. ఇదే ధోరణి ఇకముందూ కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని ఈ రంగంలో నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 2016 తొలి నెలల్లోనే వెయ్యి డాలర్ల దిగువకు పడిపోతుందన్నది వారి అంచనా.
తొమ్మిది సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారి బుధవారం (16వ తేదీ) ఫెడ్ వడ్డీరేటు పెంచిన వెంటనే పసిడి ఆరేళ్ల కనిష్ట స్థాయిలను చూసింది. ఒక్కసారిగా దాదాపు 15 డాలర్లు పడిపోయి 1,049 డాలర్లకు పతనమైంది. కాసేపటికి తిరిగి కోలుకుంది. టెక్నికల్ సపోర్ట్‌గా భావిస్తున్న 1,050 డాలర్లకు పైకి చేరి 1,055 వద్ద స్థిరపడింది.
కాగా చురుగ్గా ట్రేడవుతున్న మార్చి కాంట్రాక్టుకు సంబంధించి వెండి ధర 14.09 డాలర్ల నుంచి 13.88 డాలర్లకు పడిపోయింది. పసిడిని చూస్తే... భవిష్యత్ బలహీనమైన ధోరణే కనిపిస్తోందన్నది నిపుణుల వాదన. ఆయా వర్గాల అభిప్రాయాలను ఒక్కసారి పరిశీలిస్తే...
* వడ్డీరేట్ల పెరుగుదల నేపథ్యంలో పసిడి బలహీన ధోరణి అవకాశాలే ఉన్నాయని వాల్ స్ట్రీల్ జర్నల్ పేర్కొంది. విలువైన మెటల్ డిమాండ్ పడిపోతుందని ట్రేడర్లు భావిస్తుండడమే దీనికి కారణంగా పేర్కొంది.
* మున్ముందు డాలర్ కదలికలు పసిడి ధర నిర్ణయంపై ప్రభావం చూపుతాయని మైనింగ్.కామ్ పేర్కొంది. మధ్యకాలికంగా చూస్తే.. పసిడి ధర మందగమనంలోనే ఉంటుందని అభిప్రాయపడింది. పసిడికి డిమాండ్ పెరగాలంటే... ద్రవ్యోల్బణం భారీగా ఉండాలనీ... ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లేకపోవడం పసిడికి బలహీన అంశమేనని విశ్లేషించింది. దీనివల్ల ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ పెరగడం కష్టంగా అంచనావేసింది. టెక్నికల్‌గా... ఇతర విలువైన మెటల్స్‌తో పోల్చిచూస్తే... పసిడి ధర ఇంకా అధికంగానే ఉందని కూడా పేర్కొంది.
* గ్లోబల్ పోస్ట్ అభిప్రాయం కూడా పసిడి ధర పడిపోతుందనే. ఈ మేరకు తన నోట్స్‌లో గోల్డ్‌మన్ శాక్స్, జేపీ మోర్గాన్, సిటీ, ఏబీఎన్ ఆమ్రో, సొసైటీ జనరాలీ అంచనాలను కూడా ఉటంకించింది. 2016 తొలి నెలల్లోనే ఔన్స్ 1,000 డాలర్ల దిగువకు పడిపోతుందని అంచనావేసింది.
* ప్రస్తుతం కన్నా... 2016 చివర్లో పసిడి బలంగా ముగుస్తుందని అంచనా వేస్తున్న హెచ్‌ఎస్‌బీసీ కూడా... రికవరీకి ముందు పసిడి సమీపకాలంలో భారీగా తగ్గుతుందని పేర్కొంటోంది.
దేశీయంగా మళ్లీ నష్టాల్లోకి...
ఏడు వారాల తరువాత ఎనిమిదవ వారం స్వల్పంగా లాభపడిన పసిడి... మళ్లీ ఏడు రోజులు తిరిగే సరికి... యథాపూర్వం నష్టాల్లోకి జారుకుంది. 18వ తేదీ శక్రవారంతో ముగిసిన వారంలో ముంబై స్పాట్ బులియన్ మార్కెట్‌లో 99.5 ప్యూరిటీ 10 గ్రాముల పసిడి విలువ రూ.25,380 నుంచి రూ. 25,085కు పడింది. అంటే రూ. 295 నష్టపోయింది. 99.9 ప్యూరిటీ 10 గ్రాముల పసిడి ధర కూడా ఇంతే పరిమాణంలో తగ్గి... రూ. 24,935 వద్ద ముగిసింది. ఇక వెండి (.999 ఫైన్) కేజీ ధర 33,520 వద్ద ముగిసింది. వారం వారీగా రూ.510 నష్టపోయింది.