వచ్చే ఐదు సెషన్లే కీలకం!!
అమెరికా ఆర్థిక అంశాలే ప్రాతిపదిక
పసిడిపై విశ్లేషకుల అంచనాలు
న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచాక అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ నైమెక్స్‌లో పసిడి ఔన్స్ ధర దాదాపు 1,300 డాలర్ల నుంచి 1,127 డాలర్లకు పడిపోయినప్పటికీ... నాలుగు వారాలుగా ఒడిదుడుకులతోనే క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం 6వ తేదీతో ముగిసిన వారంలో 1,173 డాలర్లకు చేరింది. ఒకదశలో 1,182 డాలర్ల స్థాయిని కూడా తాకింది. ఈ వారంలో దాదాపు 16 డాలర్లు ఎగసింది. ఈ నేపథ్యంలో ఇకపై పసిడి పయనం ఎటువైపన్న అంచనాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇప్పటివరకూ పసిడి ర్యాలీకి సోమవారం నుంచీ రాబోయే ఐదు రోజులు కీలకం కానున్నాయి. ముఖ్యంగా అమెరికా ఆర్థిక రంగం గురించి ఆ దేశ సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ ప్రకటన, శుక్రవారం విడుదల కానున్న రిటైల్ అమ్మకాల గణాంకాలు పసిడి కదలికలకు కీలకం కానున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఆర్థిక పరిణామాల ప్రాతిపదికగా పసిడి కదలికలకు తక్షణ మద్దతు 1,150 డాలర్లుకాగా, నిరోధం 1,200, 1,215 డాలర్లుగా ఉన్నట్లు డైలీ ఎఫ్‌ఎక్స్ కరెన్సీ వ్యూహకర్త మైఖేల్ బౌత్రోస్ పేర్కొన్నారు.
దేశీయంగా...
అంతర్జాతీయ ధోరణి దేశీయ బులియన్ మార్కెట్‌పైనా గత వారం కనబడింది. ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్‌లో వారం వారీగా పసిడి ధర 99.9 ప్యూరిటీ 10 గ్రాముల ధర శుక్రవారం రూ.435 పెరిగి (1.55 శాతం) రూ.28,485 వద్ద ముగిసింది. 99.5 ప్యూరిటీ ధర కూడా అదే స్థాయిలో ఎగసి రూ.28,335 వద్ద ముగిసింది.