అమెరికా ఫెడరల్ రిజర్వు (ఫైల్ ఫోటో)
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఎలాంటి సర్‌ప్రైజ్‌ను ఇవ్వలేదు. అందరి అంచనాలకు తగ్గట్టే ఫెడ్ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్టు ఫెడరల్ రిజర్వు ప్రకటించింది. దీంతో ఫెడ్ వడ్డీ రేట్లు1.75 శాతం నుంచి 2 శాతంగా కొనసాగనున్నాయి. రెండు రోజులపాటు నిర్వహించిన సమావేశాలలో భాగంగా బుధవారం సాయంత్రం(భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి) ఫెడరల్ రిజర్వు తన పరపతి నిర్ణయాలను ప్రకటించింది. ప్రస్తుతం యథాతథంగా ఉన్నప్పటికీ, సెప్టెంబర్‌లో వడ్డీరేట్ల పెంపు ఉంటుందని సంకేతాలు ఇచ్చింది. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ఇప్పటికే ఈ ఏడాదిలో రెండు సార్లు వడ్డీరేట్లు పెంచారు. 2018 ముగింపు నాటికి మరో రెండు సార్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై గత నెలలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించిన సంగతి తెలిసిందే. రేట్ల పెంపు, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయనుందని మండిపడ్డారు. ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి వడ్డీరేట్లను తగ్గించాల్సివసరం ఉందని ట్రంప్ అన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో, ఫెడరల్ రిజర్వు తన వడ్డీరేట్లను పెంచడం ప్రారంభించింది. ద్రవ్యోల్బణం పెరుగుతుందంటే, ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందనే విషయానికి సంకేతమని తెలిపింది. సేవింగ్స్‌వైపు నుంచి కూడా మంచి రిటర్నులు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంతేకాక జూలైలో ప్రైవేట్ రంగంలో అంచనాలను మించుతూ 2.19 లక్షల మందికి ఉపాధి లభించినట్లు కార్మిక శాఖ తాజాగా గణాంకాలు విడుదల చేసింది.
దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నదని, ఉపాధి మార్కెట్ పటిష్టమైందని, ద్రవ్యోల్బణం సైతం లక్ష్యానికి దగ్గరగా ఉన్నదని ఫెడ్ కమిటీ తాజాగా అభిప్రాయపడింది. సమీప భవిష్యత్‌లో ధరలు టార్గెట్‌ను మించిపోయే అవకాశంలేదని, దీంతో ప్రస్తుతానికి యథాతథ పాలసీ అమలుకే మొగ్గుచూపినట్టు జెరోమీ పావెల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment