దేశీ మార్కెట్ల గత చరిత్ర..
గత చరిత్ర చూస్తే.. అమెరికా ఫెడ్ రేట్లు పెంచిన అనంతరం ఆరు నెలల పాటు దేశీ మార్కెట్లకు సానుకూలంగానే ఉంటోంది. అమెరికా ఫెడ్ 1983 నుంచి 2006 దాకా వడ్డీ రేట్లు పెంచింది. 1994 ఫిబ్రవరి 4న ఫెడ్ రేటు పెంచడానికి ఆరు నెలల ముందు నుంచి బీఎస్‌ఈ సెన్సెక్స్ 69 శాతం ర్యాలీ చేసింది. 2,336 పాయింట్ల నుంచి 3,947 దాకా పెరిగింది. అయితే, ఆ తర్వాత ఆరు నెలలు మాత్రం ఈ వేగం మందగించింది. 8.3 శాతం పెరుగుదలతో 4,276 పాయింట్లకు పెరిగింది.
రెండోసారి..
ఇక రెండో విడత పెంపు డాట్‌కామ్ బబుల్ బరస్ట్ అయ్యే తరుణంలో జరిగింది. 1999 జూన్ 30 నుంచి ఫెడ్ రేట్లను పెంచడం మొదలెట్టింది. దేశీ మార్కెట్లు అప్పుడప్పుడే అంతర్జాతీయ ర్యాలీకి అనుగుణంగా పెరగడం మొదలెట్టాయి. సెన్సెక్స్ ఆ సమయానికి 35 శాతం పెరుగుదలతో 3,060 స్థాయి నుంచి 4,144 పాయింట్లకు ఎగిసింది. ఫెడ్ రేటు పెంపుతో తర్వాత ఆరు నెలల్లో సుమారు మరో 30% పెరిగి 5,375 పాయింట్లను తాకింది.
మూడోసారి ..
చివరిగా 2004 జూన్ 30న ఫెడ్ రేట్లు పెంచింది. దాదాపు అదే సమయంలో ప్రభుత్వం మారడం తదితర పరిణామాలు కూడా చోటుచేసుకోవడంతో మార్కెట్లు పడ్డాయి. ఆ ఏడాది ప్రారంభంలో 5,915 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్.. రేట్ల పెంపు నాటికి 18 శాతం తగ్గి 4,874 వద్ద ట్రేడవుతోంది. దీంతో రేట్లు పెంచిన ఆరు నెలల తర్వాత మార్కెట్లు 28 శాతం ఎగియగలిగాయి.
చివరిసారిగా..
2006 జూన్ 29న చివరిసారిగా ఫెడ్ వడ్డీ రేటును 5.25 శాతానికి పెంచింది. అప్పుడు సెన్సెక్స్ 10,609 పాయింట్ల వద్ద వుంది. ఇది తదుపరి ఆరు నెలల్లో 30 శాతం పెరిగి 13,846 పాయింట్లకు చేరింది. ఆర్థిక సంక్షోభం కారణంగా 2008 నుంచి వడ్డీ రేట్లను తగ్గిస్తూ క్రమేపీ 0-0.25 శాతం స్థాయికి దించింది. 2006 తర్వాత రేట్లను మళ్లీ పెంచడం ఇప్పుడే.