మార్కెట్ పంచాంగం
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ అసలు ఉద్దేశ్యమేమిటో గతవారం స్పష్టమైపోయింది. ఈ సంవత్సరాంతంలో వడ్డీ రేట్ల పెంపు తప్పదంటూ ఫెడ్ ఛైర్‌పర్సన్ యెలెన్ వెల్లడించేసేశారు. ఈ నేపథ్యంలో మన రిజర్వుబ్యాంక్ పాలసీ నిర్ణయం వెలువడనున్నది. దేశీయంగా ద్రవ్యోల్బణం కనిష్టస్థాయికి పడిపోయినందున, పావుశాతం రేట్ల కోత వుండవచ్చన్న అంచనాలు ఇప్పటికే షేర్ల ధరల్లో ఇమిడిపోయాయి. ఈ కారణంగా అరశాతం తగ్గితేనే మార్కెట్లో మరింత ర్యాలీ జరిగే ఛాన్స్ వుంటుంది. లేదంటే ఆర్‌బీఐ పాలసీ మీట్ తర్వాత సూచీలు పడిపోయే ప్రమాదం వుంటుంది. ఇక భారత్ సూచీల సాంకేతికాంశాలకు వస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు
సెప్టెంబర్ 24తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్ వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 26,339 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత 900 పాయింట్లకుపైగా క్షీణించి, 25,386 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. అటుతర్వాత క్రమేపీ కోలుకుని, చివరకు 1.3 శాతం స్వల్పనష్టంతో 25,863 పాయింట్ల వద్ద ముగిసింది. సెప్టెంబర్ 8నాటి 24,833 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి ప్రస్తుతం జరుగుతున్న రిట్రేస్‌మెంట్ ర్యాలీలో గతవారపు 26,339 పాయింట్ల గరిష్టస్థాయిని ‘లోయర్ హై’గా (సెప్టెంబర్ 18నాటి 26,472 పాయింట్ల గరిష్టంతో పోలిస్తే) పరిగణించవచ్చు.
ఈ కారణంగా రిట్రేస్‌మెంట్ ర్యాలీ కొనసాగాలంటే గతవారపు గరిష్టస్థాయి అయిన 26,339 పాయింట్ల స్థాయిని సెన్సెక్స్ ఈ వారం తప్పనిసరిగా అధిగమించాల్సివుంటుంది. ఆర్‌బీఐ పాలసీ ప్రకటన తర్వాత ఆ స్థాయిని దాటలేకపోయినా, గతవారపు కనిష్టస్థాయి అయిన 25,386 పాయింట్ల స్థాయిని కోల్పోయినా మళ్లీ డౌన్‌ట్రెండ్‌లోకి మళ్లీ తర్వాతి రోజుల్లో 24,833 పాయింట్ల వద్దకు పతనమయ్యే ప్రమాదం వుంటుంది.
ఆగస్టు 24న సెన్సెక్స్ భారీగా నష్టపోయినపుడు రికార్డు ట్రేడింగ్ పరిమాణంతో 26,730 స్థాయి నుంచి పతనం జరిగింది. ఈ వారం 26,339 పాయింట్ల నిరోధస్థాయిని అధిగమిస్తే 26,500-26,816 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. అటుపైన పటిష్టంగా ముగిస్తే 27,130 పాయింట్ల స్థాయిని చేరే ఛాన్స్ వుంటుంది. ఈ వారం 25,386 పాయింట్ల మద్దతుస్థాయిని కోల్పోతే తిరిగి 24,830 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు.
నిఫ్టీ మద్దతు 7,723-నిరోధం 8,021
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8,021 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన తర్వాత 7,723 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు 114 పాయింట్ల నష్టంతో 7,868 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లానే నిఫ్టీకి కూడా గతవారపు కనిష్ట, గరిష్టస్థాయిలు ఈ వారం కీలకమైనవి. ఈ వారం 8,021 పాయింట్ల గరిష్టస్థాయిని దాటితే 8,060-8,142 పాయింట్ల శ్రేణిని సూచీ అందుకోవొచ్చు. ఆపైన ముగిస్తే 8,225 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపే అవకాశం వుంది.
ఈ వారం 7,723 పాయింట్ల మద్దతుస్థాయిని కోల్పోతే మరోదఫా 7,540 పాయింట్ల స్థాయి వద్దకు తగ్గవచ్చు. ఆర్‌బీఐ పాలసీ ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో అక్టోబర్ డెరివేటివ్ సిరీస్‌లో బిల్డప్ తక్కువగా జరిగింది. ఉన్నంతలో 7,800, 7,500 స్ట్రయిక్స్ వద్ద అధిక పుట్ బిల్డప్, 8,000, 8,200 స్ట్రయిక్స్ వద్ద అధిక కాల్ బిల్డప్ వుంది. పాలసీ తర్వాత భారీ ట్రేడింగ్ పరిమాణంతో 7,800 స్థాయిని కోల్పోతే తదుపరి 7,500 మద్దతుస్థాయివరకూ నిఫ్టీ తగ్గవచ్చని, 8,000 స్థాయిని భారీ టర్నోవర్‌తో దాటితే 8,200 స్థాయివరకూ పెరగవచ్చని ప్రస్తుత ఆప్షన్ బిల్డప్ సూచిస్తున్నది.
నిరోధం 26,339- మద్దతు 25,386
Published Mon, Sep 28 2015 12:41 AM | Last Updated on Mon, Oct 1 2018 5:32 PM
Advertisement
Advertisement