మార్కెట్ పంచాంగం
రిజర్వుబ్యాంక్ వడ్డీ రేట్లను పావుశాతం మాత్రమే తగ్గించడంతో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా బ్యాంక్ నిఫ్టీలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. దాంతో ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీల (3.8 శాతం) కన్నా, బ్యాంక్ నిఫ్టీ (5.8 శాతం) అధికంగా క్షీణించింది. 2016 మార్చికి ద్రవ్యోల్బణం అంచనాల్ని 6 శాతానికి పెంచుతూ, ఇకపై రేట్ల తగ్గింపు వుండదంటూ ఆర్‌బీఐ గవర్నర్ రాజన్ చెప్పడంతో మార్కెట్లో పతనం వేగంగా జరిగింది. అయితే వారాంతంలో రాజన్ తన మాటల్ని సవరించుకుని, రేట్ల కోతకు ద్వారాలు మూసుకుపోలేదంటూ మార్కెట్‌ను శాంతపర్చే ప్రయత్నం చేశారు.
అలాగే వర్షాభావ పరిస్థితుల్ని ముందస్తు అంచనాల్లో ప్రకటించిన వాతావరణ శాఖ రుతుపవనాల కదలికలు తొలి రెండురోజుల్లో ఆశావహంగా వున్నట్లు తెలిపింది. రాజన్, వాతావరణ శాఖల మలి ప్రకటనలు రెండూ ఈ వారం మార్కెట్లో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీని తీసుకువచ్చే చాన్స్ వుంది. అయితే గత శుక్రవారం అమెరికా జాబ్స్ డేటా పటిష్టంగా వున్నందున, ఆ దేశపు కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు బలపడ్డాయి. ఈ అంచనాలు మార్కెట్లో క్షీణతను కొనసాగించే ప్రమాదమూ వుంది. ఇక సూచీల సాంకేతికాంశాలకొస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
జూన్ 5తో ముగిసిన వారంలో 27,959 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 26,552 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 1,060 పాయింట్ల నష్టంతో 26,768 వద్ద ముగిసింది. గత వారపు కనిష్టస్థాయి అయిన 26,550 పాయింట్ల స్థాయి ఈ వారం సెన్సెక్స్‌కు తొలి మద్దతు అందించవచ్చు. ఈ మద్దతును కోల్పోయి, ముగిస్తే మే నెల కనిష్టస్థాయి 26,424 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు.
ఈ స్థాయిని కూడా కోల్పోతే 26,250 పాయింట్ల స్థాయికి క్షీణించవచ్చు. ఈ వారం రెండో మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 27,280 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. రానున్న రోజుల్లో ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో దాటితే మార్కెట్లో డౌన్‌ట్రెండ్ ముగిసి, 27,470 స్థాయికి ర్యాలీ జరగవచ్చు. ఆపైన సెన్సెక్స్ సాంకేతిక లక్ష్యం 27,950 పాయింట్లు.
నిఫ్టీ మద్దతు 8,050-నిరోధం 8,240
ఆర్‌బీఐ పాలసీ సమీక్ష తర్వాత వేగంగా క్షీణించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 8,050 పాయింట్ల స్థాయికి పడిపోయింది. చివరకు 319 పాయింట్ల నష్టంతో 8,115 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా జాబ్స్ డేటా ప్రభావంతో ఈ సోమవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైతే మరోదఫా 8,050 స్థాయి నిఫ్టీకి మద్దతునివ్వవచ్చు. ఈ స్థాయిని కోల్పోయి, ముగిస్తే 7,990 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున మరో ముఖ్యమైన మద్దతు 7,960 పాయింట్లు. ఈ వారం రెండో మద్దతును పరిరక్షించుకోగలిగితే 8,240 పాయింట్ల అవరోధస్థాయికి నిఫ్టీ పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 8,305 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. తదుపరి అవరోధ స్థాయిలు 8,380, 8,450 పాయింట్లు.
మద్దతు 26,550- నిరోధం 27,280
Published Mon, Jun 8 2015 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM
Advertisement