మందకొడిగా ట్రేడింగ్
♦ స్వల్పంగా తగ్గిన సూచీలు
♦ ఫెడ్ ఛైర్‌పర్సన్ ప్రసంగం కోసం ఎదురుచూపులు
ముంబై: సెప్టెంబర్ నెల డెరివేటివ్ సిరీస్‌లో తొలిరోజైన శుక్రవారం ట్రేడింగ్ మందకొడిగా సాగింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్‌పర్సన్ జానెట్ యెలెన్ శుక్రవారం రాత్రి అమెరికాలో చేయనున్న ప్రసంగంలో వడ్డీ రేట్లపై ఎటువంటి సంకేతాలు వెలువడతాయోనన్న సందిగ్దత ఇన్వెస్టర్లను వెన్నాడటంతో ట్రేడింగ్ నిస్తేజంగా సాగిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. వడ్డీ రేట్లు పెంచడానికి ఫెడ్ మొగ్గుచూపితే, భారత్ వంటి వర్థమాన మార్కెట్ల నుంచి కొద్దికాలంపాటు విదేశీ నిధులు తరలివెళతాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ రాయ్ చెప్పారు.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 54 పాయింట్ల తగ్గుదలతో 27,782 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచి 20 పాయింట్ల క్షీణతతో 8,572 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 295 పాయింట్లు, నిఫ్టీ 94 పాయింట్ల చొప్పున తగ్గాయి. ఆసియాలో జపాన్, సింగపూర్ సూచీలు తగ్గగా, హాంకాంగ్ మార్కెట్ స్వల్పంగా పెరిగింది. యూరప్ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిసాయి.
ఐటీ షేర్లు వెలవెల...
సెన్సెక్స్-30 షేర్లలో 17 షేర్లు నష్టాల్లో ముగిసాయి. ఐటీ షేరు విప్రో అన్నింటికంటే అధికంగా 3 శాతం క్షీణించగా, ఇన్ఫోసిస్, టీసీఎస్‌లు 1-2 శాతం మధ్య తగ్గాయి. ఎస్‌బీఐ, సన్‌ఫార్మా, ఎల్ అండ్ టీలు కూడా 1-2 శాతం మధ్య నష్టపోయాయి. ఇక తాజాగా ఆర్థిక ఫలితాలు ప్రకటించిన టాటా మోటార్స్ షేరు 2 శాతం ఎగిసింది. గెయిల్, ఆర్‌ఐఎల్ 1-2 శాతం మధ్య ర్యాలీ జరిపాయి.