సమీప భవిష్యత్తులో 1425 డాలర్లు!
పసిడిపై నిపుణుల అంచనా..
న్యూఢిల్లీ: పసిడి ధర సమీప భవిష్యత్తులో మరింత ముందుకు దూసుకుపోవడం ఖాయమన్న అంచనాలు బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులే దీనికి ప్రధాన కారణమన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఏబీఎన్ ఆమ్రో గ్రూప్ కమోడిటీ స్ట్రేటజీ విభాగం గ్లోబల్ హెడ్ జార్జిట్ బోలే ఈ మేరకు తన అభిప్రాయాలను వెల్లడిస్తూ... వచ్చే మూడు నెలల్లో న్యూయార్క్ కమోడిటీ మార్కెట్ నెమైక్స్ కాంట్రాక్ట్ ధర 1,425 డాలర్లకు చేరుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.1,425 డాలర్లకు చేరిన తర్వాత లాభాల స్వీకరణ జరిగే వీలుందని , ఫెడ్ ఫండ్ రేటు పెరిగే పరిస్థితుల్లో ఈ లాభాల స్వీకరణ ధోరణి మరింత దూకుడుగా ఉండవచ్చని ఆయన అన్నారు.
కాగా, శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి ధర అటు అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా భారీగా పెరిగింది. అంతర్జాతీయంగా ధర వారం వారీగా 24 డాలర్ల లాభంతో 1,368 డాలర్ల వద్ద ముగిసింది. దేశీయంగా ముంబై ప్రధాన మార్కెట్‌లో శుక్రవారంతో ముగిసిన వారంలో 99.9 స్వచ్ఛత 10 గ్రాముల పసిడి ధర రూ.460 పెరిగింది. రూ.31,355 వద్ద ముగిసింది. వెండి ధర వారంలో భారీగా కేజీకి రూ.1,435 ఎగసి రూ.46,515 వద్ద ముగిసింది.