పుత్తడి ధరకు ఈ వారం కీలకం!
విశ్లేషకుల అంచనా
అంతర్జాతీయంగా ఈ వారం బంగారం ధరలకు కీలకం కానున్నదని నిపుణులంటున్నారు. గత శుక్రవారం వెలువడి న అమెరికా ఉద్యోగ గణాంకాలు ఆదేశ కేంద్ర బ్యాంక్-ఫెడరల్ రిజర్వ్ ఇప్పట్లో రేట్లను పెంచే అవకాశాల్లేవని సంకేతాలిచ్చాయి. దీంతో ఈ వారంలో పుత్తడి 1,300 డాలర్ల స్థాయిని దాటుతుందా లేదా ట్రేడర్ల లాభాల స్వీకరణతో ధర పతనమవుతుందా అన్న విషయమై గందరగోళం నెలకొంది. గత వారంలో ఔన్స్ బంగారం 1,300 డాలర్లను తాకి , చివరకు అంతకు ముందటి వారం ముగింపు(1,290 డాలర్లు)తో పోల్చితే ఔన్స్ బంగారం స్వల్ప లాభంతో 1,294 డాలర్ల వద్ద ముగిసింది.
కాగా సమీప భవిష్యత్తులో ఫెడ్ వడ్డీరేట్లను పెంచకపోవచ్చని, దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,300 డాలర్లకు ఎగియవచ్చని కొంతమంది నిపుణలు అంచనా వేస్తున్నారు. అయితే లాభాల స్వీకరణ జరిగితే ధర తగ్గుతుందని మరికొంత మంది నిపుణులంటున్నారు.
ఇక దేశీయ మార్కెట్లో స్టాకిస్టులు, ట్రేడర్ల నుంచి డిమాండ్ జోరుగా ఉండటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. పండుగ, పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో స్థానికంగా కొనుగోళ్ల జోరు బాగా ఉంది. పుత్తడి పండగ-అక్షయ తృతీయ(నేడు-సోమవారం) కారణంగా వినియోగదారుల నుంచి కొంతమేర కొనుగోళ్లు ఉంటాయనే అంచనాలున్నాయి.
అయితే అధిక ధర ఉండటంతో అక్షయ తృతీయ నాడు అమ్మకాలు తగ్గే అవకాశాలున్నాయని వర్తకులు ఆందోళన చెందుతున్నారు. అంతకు ముందటి వారంలో రూ.29,970 వద్ద ముగిసిన 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం గత వారంలో రూ.30,460 గరిష్ట స్థాయిని తాకి చివరకు గత శుక్రవారం రూ.30,090 వద్ద ముగిసింది.