పసిడి... పటిష్టమే!
♦ రెండు వారాల్లో 43 డాలర్లు అప్
♦ ఫెడ్ రేటు ఈ ఏడాది పెరగదన్న అంచనాలు
అంతర్జాతీయంగా అమెరికా – ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలు కొంత సమసిపోయినప్పటికీ, పసిడిలోకి పెట్టుబడులు పటిష్టంగానే కొనసాగుతున్నాయి. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో ఆగస్టు 18వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో వారం వారీగా పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 5 డాలర్లు పెరిగి 1,295 వద్ద ముగిసింది. శుక్రవారం ఒక దశలో 1,306 డాలర్లకు చేరినా... అక్కడ నిలబడలేదు. గడచిన రెండు వారాల్లో పసిడి 43 డాలర్లు ఎగసింది.
అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది ఇక ఫండ్ రేటును (ప్రస్తుత శ్రేణి 1–1.25 శాతం) పెంచే అవకాశం లేదన్న అంచనాలు బంగారానికి తాజాగా బలాన్ని ఇస్తున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం అనుకున్నంతగా పెరగడం లేదని, ఇది డిమాండ్ లేకపోవడాన్ని సూచిస్తుందనీ బుధవారం వెలువడిన జూలై ఫెడ్ మినిట్స్‌లో వెల్లడవడం– ‘‘రేటు పెంపు ఈ ఏడాది ఉండకపోవచ్చ’’ అన్న అంచనాలకు బలాన్నిచ్చింది. అయితే తాజాగా 1,300 డాలర్ల వద్ద పసిడికి గట్టి నిరోధం ఉందనీ, దీనిని దాటి నిలబడితే 1,340 డాలర్లను చూస్తుందని టెక్నికల్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
ఇక దిగువదిశలో 1,272, 1,242, 1,204 స్థాయిల వద్ద మద్దతు లభిస్తుందన్నది వారి అంచనా. సోమవారం నుంచీ ప్రారంభమయ్యే వారంలో లాభాల స్వీకరణ జరిగే వీలుంటుందని, అయినా ఇది కొనుగోళ్లకు అవకాశమేనని వారు అంచనావేస్తున్నారు. ఉత్తరకొరియాతో ఉద్రిక్తతలు కొనసాగే అవకాశాలతో పాటు అమెరికాలో రాజకీయ, ఆర్థిక అనిశ్చితిని ఇందుకు కారణంగా చూపుతున్నారు. ఇక డాలర్ వారం వారీగా స్వల్పంగా పెరిగి 93.36 వద్ద ఉంది. 1,204 వరకూ పడిపోయిన పసిడి తిరిగి నెలతిరక్కుండానే 100 డాలర్లు ఎగయడం గమనార్హం.
దేశీయంగా కూడా బులిష్ ధోరణే
దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– ఎంసీఎక్స్‌లో పసిడి వారంలో రూ.40 తగ్గి రూ. రూ.29,163 కి చేరింది. అయితే దేశీయ డిమాండ్ తోడు కావడంతో ముంబై ప్రధాన మార్కెట్‌లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర రూ.75 ఎగసి రూ.29,285కి చేరింది. ఇక 99.5 స్వచ్ఛత విషయంలో ధర ఇదే స్థాయిలో పెరిగి రూ. 29,135కి చేరింది. వెండి కేజీ ధర కూడా స్వల్పంగా రూ.190 పెరిగి రూ. 39,300కి చేరింది.