మార్కెట్ పంచాంగం
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు ఉద్దీపన ప్యాకేజీని నిలిపివేయనున్నట్లు 2013 ప్రథమార్థంలో సంకేతాలు ఇచ్చినపుడు ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా భారత్‌లో సూచీలు దాదాపు 15 శాతం తగ్గాయి. ఇప్పుడు కూడా అంతేశాతం సెన్సెక్స్, నిఫ్టీలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ జరిగింది సాధారణమైన పతనంగానే భావించాలి. కానీ గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు 1997 తర్వాత అత్యధికస్థాయిలో రూ. 17 వేల కోట్లు భారత్ మార్కెట్లో నికర అమ్మకాలు జరిపారు. అలాగే ఈ నెల రెండు వారాల్లో కూడా 7,000 కోట్లు విక్రయించారు. మార్కెట్ క్షీణత సాధారణంగానే వున్నా, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు అసాధారణంగా వుండటం ఆందోళనకరం. ఈ సెప్టెంబర్ 17నాటి ఫెడ్ నిర్ణయంకంటే, విదేశీ ఇన్వెస్టర్లు వ్యవహరించే తీరే మన మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తుందన్న అంచనాలకు రావొచ్చు.
సెన్సెక్స్ సాంకేతికాంశాలు
సెప్టెంబర్ 11తో ముగిసిన వారంలో 24,833 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్, అటుతర్వాత కోలుకొని, చివరకు 1.6 శాతం లాభపడి 25,610 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ పంచాంగంలో దీర్ఘకాలిక మద్దతుగా ప్రస్తావిస్తున్న 25,300 పాయింట్ల స్థాయి దిగువకు పతనమైనా, తిరిగి వేగంగా ఈ స్థాయి పైకి వచ్చి స్థిరపడటం సానుకూలాంశం. ఈ వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశం సందర్భంగా సెన్సెక్స్ హెచ్చుతగ్గులకు లోనైతే తొలుత 25,280 స్థాయికి తగ్గే అవకాశం ఉంటుంది. ఆ లోపున వేగంగా 24,745 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,420-24,160 పాయింట్ల శ్రేణి వద్దకు పతనం కావచ్చు. గతవారపు రికవరీ కొనసాగితే సెన్సెక్స్ తొలుత 25,880 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 26.202 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. అటుపైన 26,586-26,816 పాయింట్ల శ్రేణి వరకూ ర్యాలీ జరిపే అవకాశం ఉంటుంది.
నిఫ్టీ తొలి మద్దతు 7,680-నిరోధం 7,870
క్రితం వారం ప్రధమార్థంలో 7,539 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ద్వితీయార్థంలో కోలుకొని 7,865 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ పెరిగింది. చివరకు 134 పాయింట్ల లాభంతో 7,789 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం నిఫ్టీ ఎట్టకేలకు 2014 మే 16 నాటి గరిష్ట స్థాయి అయిన 7,563 స్థాయిని పరీక్షించింది. రానున్న రోజుల్లో ఈ 7,500-7,600 మద్దతు శ్రేణి నిఫ్టీకి ప్రధానమైనది. ఈ వారం నిఫ్టీ గనుక పెరిగితే తిరిగి 7,870 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపైన స్థిరపడితే 7,952 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన ముగిస్తే 8,080-8,142 పాయింట్ల శ్రేణి వరకూ పెరిగే అవకాశం వుంది. ఈ వారం క్షీణిస్తే 7,680 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఆ లోపున 7,500-7,600 పాయింట్ల మద్దతు శ్రేణికి పతనం కావొచ్చు. ఈ శ్రేణిని కోల్పోతే 7,200-7,118 పాయింట్ల మద్దతు శ్రేణికి నిలువునా పడిపోయే ప్రమాదం వుంటుంది.
సెన్సెక్స్ తొలి మద్దతు 26,280
Published Mon, Sep 14 2015 2:03 AM | Last Updated on Mon, Oct 1 2018 5:28 PM
Advertisement
Advertisement