3 రోజుల లాభాలకు బ్రేక్‌ | Sensex ends 139 pts lower | Sakshi
Sakshi News home page

3 రోజుల లాభాలకు బ్రేక్‌

Published Fri, Jun 15 2018 12:43 AM | Last Updated on Mon, Oct 1 2018 5:32 PM

Sensex ends 139 pts lower - Sakshi

మూడు రోజుల లాభాలకు గురువారం బ్రేక్‌ పడింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లను పెంచడం, మే నెల టోకు ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయి 4.43 శాతానికి పెరగడం, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో కరెంట్‌ అకౌంట్‌ లోటు భారీగా పెరగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 139 పాయింట్ల నష్టంతో 35,600 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 49 పాయింట్లు పతనమై 10,808 పాయింట్ల వద్ద ముగిశాయి.  

ఇంట్రాడేలో 251 పాయింట్ల నష్టం  
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లను పావు శాతం పెంచింది. ఈ ఏడాది ఫెడ్‌ రేట్లను పెంచడం ఇది రెండోసారి. అంచనాలకు అనుగుణంగానే రేట్ల పెంపు ఉన్నప్పటికీ, ఈ ఏడాది మరో రెండు దఫాలు రేట్ల పెంపు ఉంటుందని సూచించడంతో ప్రపంచ మార్కెట్లు ప్రధానంగా ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్‌ స్వల్ప లాభాలతో ఆరంభమైంది. అయితే ఆసియా మార్కెట్ల పతన ప్రభావంతో నష్టాల్లోకి జారిపోయింది.

ఇంట్రాడేలో 251 పాయింట్లు నష్టపోయి 35,489 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివర్లో రిలయన్స్‌ లాభపడడంతో వంద పాయింట్లకు పైగా రికవరీ అయింది. వివిధ కేంద్ర బ్యాంక్‌ల సమావేశాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు పతనమవుతున్నాయని, ఇది మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ ఆనంద్‌ జేమ్స్‌ చెప్పారు.

టోకు ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయికి పెరగడం, కరెంట్‌ అకౌంట్‌ లోటు మరింతగా పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అయితే ఫార్మా షేర్లు లాభపడటం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పెరగడంతో నష్టాలు తగ్గాయని వివరించారు.  

ఫార్మా జోరు...
సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నా, ఫార్మా షేర్ల లాభాలు కొనసాగాయి. పలు ఫార్మా షేర్లు తమ తమ జీవిత కాల గరిష్ట స్థాయిల నుంచి బాగా పతనమయ్యాయని, ప్రస్తుతం సమంజసమైన ధరల్లో లభిస్తున్నాయని అందుకే గత కొన్ని రోజులుగా ఫార్మా షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరుగుతున్నాయని నిపుణులంటున్నారు.

మరోవైపు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆల్‌టైమ్‌ హై 1,012ను తాకింది. చివరకు 0.5 శాతం లాభంతో రూ.1,007 వద్ద ముగిసింది. ఈ షేర్‌కు ఇది ఆల్‌ టైమ్‌ గరిష్ట క్లోజింగ్‌. గత మూడు రోజుల్లో ఈ షేర్‌ 10 శాతం ఎగసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement