సెన్సెక్స్ రివర్స్.. 105 పాయింట్లు డౌన్
36 పాయింట్లు తగ్గిన నిఫ్టీ
ముంబై: ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాల్ని తగ్గించడంతో క్రితం రోజు జరిగిన ఈక్విటీ ర్యాలీ ఒకరోజుకే పరిమితమయ్యింది. గ్లోబల్ సంకేతాలు బలహీనంగా వుండటంతో ఇటీవల బాగా పెరిగిన షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. దాంతో శుక్రవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 105 పాయింట్లు క్షీణించి 28,668 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 36 పాయింట్ల తగ్గుదలతో 8,832 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అయితే వారం మొత్తంమీద సెన్సెక్స్ 69 పాయింట్లు (0.24 శాతం), నిఫ్టీ 52 పాయింట్లు (0.58 శాతం) చొప్పున లాభపడ్డాయి.
సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ వచ్చేవారం
ముగియనుండటంతో ఇన్వెస్టర్లు వారి లాంగ్ పొజిషన్లు ఆఫ్‌లోడ్ చేసుకున్నారని, దాంతో మార్కెట్ క్షీణించినట్లు జియోజిత్ బీఎన్‌పీ పారిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు.
బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు..
గురువారం భారీ కొనుగోళ్లను ఆకర్షించిన బ్యాంకింగ్ షేర్లే తాజాగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. యాక్సిస్ బ్యాంక్ 5.84 శాతం పతనమై రూ. 557 వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐలు 1.1 శాతం మేర తగ్గాయి. లుపిన్, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్‌లు 1-2.5 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.4 శాతం ఎగిసి కొత్త రికార్డుస్థాయి రూ. 1,313 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.4 శాతం ర్యాలీ జరిపి 52 వారాల గరిష్టస్థాయి రూ. 1,103 వద్ద క్లోజయ్యింది. డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీలు స్వల్పంగా పెరిగాయి.