మార్కెట్లది బలహీనబాటే!
చిన్న ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగేయాలి...
* లిక్విడిటీ క్రమంగా తగ్గే అవకాశం
* ఫెడ్ రేటు, అమెరికా ఎన్నికల ప్రభావం
* భారత్-పాక్ ఉద్రిక్తతలూ సమస్యే
ఆర్థిక, ద్రవ్య సమాచారాలను బట్టే మార్కెట్ కదలికలుంటాయనేది కొత్త విషయమేమీ కాదు. అయితే ఇబ్బందల్లా ఒకదాని వెంట మరొకటి చోటుచేసుకునే పలు సంఘటనలు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కదలికలు ఎటు వెళతాయో తెలియని అయోమయాన్నీ సృష్టిస్తాయి. గత పక్షం రోజుల్లో ఒకదానివెంట మరొకటి ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.
అమెరికా, జపాన్ కేంద్ర బ్యాంకుల సమావేశం- ఆర్థిక నిర్ణయాలు ఇందులో ప్రధానమైనవి. పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం(ఒపెక్) సమావేశం, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి మొదటి విడతగా డెమోక్రటిక్, రిపబ్లిక్ అభ్యర్థులు- హిల్లరీ, ట్రంప్ చర్చ వీటిలో కీలకమైనవి. దేశీయంగా చూస్తే... పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్ సైనికుల సర్జికల్ దాడులు కీలకం.
ఇవన్నీ అటు అంతర్జాతీయంగా ఇటు దేశీయంగా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపేవే. ఈ ఏడాది ఫెడ్ ఫండ్ రేటు ప్రస్తుత 0.50 శాతం పైకి పెంచుతామని సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలివ్వటం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తక్షణం కాకున్నా క్రమంగా గ్లోబల్ లిక్విడిటీ తగ్గే వీలుంది. ఇవన్నీ సమీప కాలంలో భారత్ మార్కెట్ బలహీనంగా ఉండొచ్చనే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రత్యేకించి చిన్న పెట్టుబడిదారులు తమ కష్టార్జితంపై ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.
లిక్విడిటీ తగ్గే చాన్స్...
ప్రస్తుతానికైతే అమెరికా, జపాన్ ఉద్దీపనలకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదని మార్కెట్‌కు సంకేతాలందాయి. అయితే ఇవి గతంలో ఉన్నంత దూకుడుగా ఉండవన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది. గడచిన పక్షం రోజుల్లో భారత్‌కు ఎఫ్‌ఐఐ పెట్టుబడుల ప్రవాహం తగ్గుతుండటాన్ని మనం గమనిస్తున్నాం. ఆగస్టులో దేశానికి 10,000 కోట్ల ఎఫ్‌ఐఐ పెట్టుబడులు వచ్చాయి. సెప్టెంబర్ చివరినాటికి ఈ మొత్తం రూ.5,000 కోట్లకు పడిపోయింది. జూలై అయితే ఈ మొత్తం ఏకంగా రూ.11,000 కోట్లుంది.
మరో నాలుగు అంశాలు...
* అమెరికా అధ్యక్ష అభ్యర్థుల చర్చల ప్రక్రియ నవంబర్ వరకూ కొనసాగుతుంది. ఇది మార్కెట్‌పై నిరంతరం ప్రభావితం చూపేదే. ఎన్నికల చర్చల నేపథ్యంలో గత వారం అంతర్జాతీయంగా పలు మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. చివరకు హిల్లరీకి అనుకూలంగా వచ్చిన ఒపీనియన్ పోల్ ఫలితాలు ఒడిదుడుకులను కొద్దిగా తగ్గించాయి. అయితే మున్ముందు అమెరికా అధ్యక్ష ఎన్నికలు మార్కెట్లకు చాలా కీలకం.
* చమురు ఉత్పత్తిని తగ్గించాలని గత బుధవారం జరిగిన ఒపెక్ సమావేశం నిర్ణయించింది. ఎనిమిదేళ్లలో ఈ తరహా నిర్ణయం ఇదే తొలిసారి. అంతర్జాతీయ ఆర్థిక మందగమన పరిస్థితులు, ఈ నేపథ్యంలో చమురు ధరలు పడిపోకుండా చూసే దిశగా ఒపెక్ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందన్నది వేచి చూడాల్సి ఉంది.
* జర్మనీ డాయిష్ బ్యాంక్‌పై ఆందోళనలు మూడవ అంశం. తాజాగా ఈ షేర్ ధర ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది బ్యాంక్ విలువ 55 శాతం హరించుకుపోయింది. 2008 ఆర్థిక సంక్షోభానికి సంబంధించి అమెరికా న్యాయశాఖ విధించిన 14 బిలియన్ డాలర్ల జరిమానా బ్యాంకు పరిస్థితిని మరింత విషమింపజేసింది. పరిస్థితి ఎటువైపు దారితీస్తుందన్న అంశంపై జర్మనీతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థా ఆందోళన పడుతోంది.
* దేశీయంగా చూస్తే... భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుండడం మనం ఇప్పటికే గమనిస్తున్నాం. భారత్ సైనికుల చర్య నేపథ్యంలో ఒక్కసారిగా సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా పడిపోయింది. అసలే అంతర్జాతీయ పరిణామాల ప్రభావంలో ఉన్న భారత్ మార్కెట్లను తాజా పరిణామాలు ఏం చేస్తాయోనని ఆలోచనలో ఇన్వెస్టర్ ఉన్నాడు. లాభాల స్వీకరణకే మొగ్గు కనబడుతోంది.
నిఫ్టీ కన్సాలిడేషన్..!
మొత్తంగా ఆయా పరిణామాలు భారత్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే... నిఫ్టీ ఇటీవలి గరిష్టానికి (8,968, సెప్టెంబర్ 7) చేరటం కష్టమన్న అంచనాలున్నాయి. మార్కెట్ విలువ బాగా పెరిగిందన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. 8,900-9,000 మధ్య నిఫ్టీ కొంత బలహీన పరిస్థితిని ఎదుర్కొనడం కొనసాగుతుందన్నది నా అభిప్రాయం.
డాలర్ రూపంలో చూస్తే గడచిన పక్షం రోజులుగా ఆసియా మార్కెట్లు 3 శాతంపైగా రిటర్న్స్ అందిస్తే, భారత్ మార్కెట్ రిటర్న్ మైనస్‌లో ఉంది. స్వల్పకాలంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నాం. పాక్‌తో ఉద్రిక్తతలు తగ్గడం, ఇండియా ఎకనమిక్ అవుట్‌లుక్ మరింత మెరుగుపడటం వంటి అంశాలతోనే మార్కెట్ తిరిగి పుంజుకునే వీలుంది. ఈ నెలలో విడుదల కానున్న అమెరికా జీడీపీ మూడవ త్రైమాసిక గణాంకాలు కూడా మార్కెట్‌పై ప్రభావాన్ని చూపిస్తాయి.