
స్వల్ప నష్టాలు
• తగ్గిన లావాదేవీలు
• 30 పాయింట్ల నష్టంతో 26,490కు సెన్సెక్స్
• 14 పాయింట్ల నష్టంతో 8,139కు నిఫ్టీ
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది మరిన్ని మార్లు పెంచనుందన్న భయాలతో స్టాక్ మార్కెట్ శుక్రవారం స్వల్పంగా నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు వరుసగా మూడో రోజూ క్షీణించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 30పాయింట్లు నష్టపోయి 26,490 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 14 పాయింట్ల నష్టంతో 8,139 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, మౌలిక, బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ, టెలికం షేర్లు షేర్లు పతనం కాగా, ఐటీ, కన్సూమర్‌డ్యూరబుల్ షేర్లు లాభపడ్డాయి. ఇన్పోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభపడడంతో నష్టాలు పరిమితమయ్యాయి. ఈ వారంలో సెన్సెక్స్ 258 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోవటంగమనార్హం. గత నెల 18 తర్వాత స్టాక్ సూచీలు ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి.
లావాదేవీలు తక్కువగా...
సానుకూల సంకేతాలేవీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ట్రేడింగ్‌కు దూరంగా ఉన్నారని, దీంతో తక్కువ లావాదేవీలు నమోదయ్యాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. సెన్సెక్స్ 26,455 – 26,595 పాయింట్ల కనిష్ట,గరిష్ట పాయింట్ల మధ్య కదలాడింది. రేట్ల పెంపుపై ఫెడ్ ధోరణిని అర్థం చేసుకోవడానికి మార్కెట్‌కు కొంత సమయం పడుతుందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. డాలర్‌బలపడుతుండడం, ముడి చమురు ధరలు పెరుగుతుండడం వంటి కారణాల వల్ల సమీప భవిష్యత్తులో మన మార్కెట్‌పై ఒత్తిడి తీవ్రంగానే ఉండగలదని ఆయన అంచనా వేశారు.
మందగమన భయాలు..
పుత్తడి దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు రెండేళ్ల గరిష్ట స్థాయి 1,300 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇక పెరుగుతున్న చమురు ధరలు, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా నగదు కొరత కంపెనీల పనితీరుపై ప్రభావంచూపుతుందని, ఆర్థిక మందగమన భయాలతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని విశ్లేషకులు చెప్పారు. కాగా సెన్సెక్స్‌లో అత్యధికంగా భారతీ ఎయిర్‌టెల్ 2.6 శాతం నష్టపోయింది.