
మూడు వారాల కనిష్టానికి మార్కెట్
215 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ నిఫ్టీ 68 పాయింట్లు డౌన్
ముంబై: ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు, భారత్ కార్పొరేట్ల క్యూ4 ఫలితాలు అంతంతమాత్రంగానే వుండవచ్చన్న అంచనాలతో గురువారం ఇన్వెస్టర్లకు అమ్మకాలకు పాల్పడటంతో స్టాక్ మార్కెట్ సూచీలు మూడు వారాల కనిష్టస్థాయిలో ముగిసాయి. సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభంలో 25,013 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత క్రమేపీ క్షీణిస్తూ చివరకు 24,685 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం రోజుతో పోలిస్తే 215 పాయింట్లు నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 7,546 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. రెండు సూచీలకు ఇది మూడు వారాల కనిష్టస్థాయి.
ఫెడ్ మినిట్స్ ఎఫెక్ట్...: బుధవారం రాత్రి వెల్లడైన అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమావేశపు మినిట్స్‌లో అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థకున్న రిస్క్‌ల ప్రస్తావన వుండటంతో ప్రధాన ఆసియా మార్కెట్లు క్షీణతతో ముగిసాయి.
బీహెచ్‌ఈఎల్ ర్యాలీ: గత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్ ప్రకటించిన తాత్కాలిక ఫలితాల్లో నష్టాలు కనపర్చినప్పటికీ, కంపెనీకి ఆర్డర్లు పెరిగాయన్న వార్తలతో ఈ షేరు సెన్సెక్స్-30 కంపెనీల్లో అత్యధికంగా 4.6 శాతం ర్యాలీ జరిపింది. సెన్సెక్స్-30 షేర్లలో 18 నష్టపోగా, 12 లాభపడ్డాయి.