
ఫెడ్ భయాలు తొలగి..
• జోష్‌నిచ్చిన మూడీస్ వృద్ధి అంచనాలు
• 118 పాయింట్ల లాభంతో 28,123కు సెన్సెక్స్
• 49 పాయింట్ల లాభంతో 8,673కు నిఫ్టీ
ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు ఆందోళనలు తొలగిపోవడంతో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. భారత వృద్ధి అంచనాలను ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ కొనసాగించడం కూడా కలసివచ్చింది. దీంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 118 పాయింట్లు పెరిగి 28,123 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 49 పాయింట్లు పెరిగి 8,673 పాయింట్ల వద్ద ముగిశాయి.
ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు జాప్యం కావడం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సానుకూలమైన అంశమని నిపుణులంటున్నారు. ఈ ఫెడ్ రేట్ల ఆందోళనలు తొలగిపోవడంతో రిటైల్, సంస్థాగత ఇన్వెస్టర్లు తాజాగా కొనుగోళ్లు జరిపారని, స్టాక్ సూచీలు లాభాల బాట పట్టాయని వారు పేర్కొన్నారు. లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు కొనసాగించింది. ఇంట్రాడేలో 28,214 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో చివరకు 118 పాయంట్ల లాభంతో 28,123 పాయింట్ల వద్ద ముగిసింది.
బ్యాంక్ షేర్ల జోరు...
బ్యాంక్ షేర్లు ముఖ్యంగా ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. యస్ బ్యాంక్ ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిని తాకగా, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.3 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.6 శాతం చొప్పున పెరిగాయి. బ్యాంక్ నిఫ్టీ 312 పాయింట్లు లాభపడి 19,353 వద్ద ముగిసింది.
వెలుగులో చక్కెర షేర్లు
ఏడాది గరిష్ట స్థాయికి చేరిన చక్కెర షేర్లు ఇటీవల కాలంలో 20 శాతానికి పైగా కరెక్షన్‌కు గురయ్యాయి. పంచదార ఉత్పత్తి అంచనాలకంటే తక్కువగానే ఉంటుందన్న వార్తల కారణంగా ఈ షేర్లు గురువారం లాభపడ్డాయి. ఇక ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి.