
నష్టాల నుంచి రికవరీ
విదేశీ మార్కెట్ల అండతో రెండు రోజుల భారీ నష్టాలకు బుధవారం చెక్ పడింది. వెరసి మూడు వారాల కనిష్ట స్థాయి నుంచి మార్కెట్లు కోలుకున్నాయి. ప్రధానంగా ఐటీ, ఆటో, పవర్ రంగాలు 1%పైగా పుంజుకోవడంతో సెన్సెక్స్ 139 పాయింట్లు లాభపడింది. 26,631 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 43 పాయింట్లు పెరిగి 7,975 వద్ద నిలిచింది. చైనా కేంద్ర బ్యాంకు నుంచి భారీ సహాయక ప్యాకేజీ వార్తలతో ఆసియా మార్కెట్లు బలపడగా, యూరప్ సూచీలు సైతం లాభాలతో మొదలయ్యాయి.
దీంతో దేశీయంగానూ సెంటిమెంట్ మెరుగుపడింది. అయితే ఫెడరల్ రిజర్వ్ సమీక్షపై దృష్టి పెట్టిన ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషణ అమెరికా వడ్డీ పెంపు ఆందోళనలతో గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 568 పాయింట్లు కోల్పోయింది. రెండు రోజుల ఫెడ్ సమీక్ష ఫలితాలు దేశీ కాలమానం ప్రకారం బుధవారం అర్థరాత్రి వెలువడనున్నాయి. కాగా, ప్యాకేజీలో భాగంగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 500 బిలియన్ యువాన్‌లను ఆ దేశ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకులు ఐదింటికి అందించనున్నట్లు వార్తలు వెలువడటంతో జపాన్ మినహా ఆసియా మార్కెట్టు 0.5-1% లాభాలతో ముగిశాయి.
ఒకటి మినహా...: బీఎస్‌ఈలో వినియోగ వస్తు రంగం మినహా అన్ని సూచీలూ లాభపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూర్ జిల్లాలో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న హీరో మోటో దాదాపు 2% లాభపడింది. దక్షిణాఫ్రికా కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ వార్తలతో అపోలో టైర్స్ షేరు 3% పుంజుకోగా, మణప్పురం, జేకే టైర్, నాల్కో, కోల్టేపాటిల్, ఏబీబీ, ఎన్‌సీసీ, చోళమండలం ఫైనాన్స్, సోలార్ ఇండస్ట్రీస్, అరవింద్ 11-4.5% మధ్య ఎగశాయి.
ఎఫ్‌డీఐలకు ఈక్విటీల జారీ నిబంధనలు సరళతరం
ముంబై: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సరళీకరించింది. తద్వారా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకుగాను దేశీ కంపెనీలు ఆటోమాటిక్ మార్గంలో ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని పరిమితులకు లోబడి సంస్థకు లభించే ఏ విధమైన విదేశీ పెట్టుబడులైనప్పటికీ షేర్లు లేదా మార్పిడికి వీలయ్యే డిబెంచర్ల జారీకి కంపెనీలను అనుమతించింది. ఇందుకు ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవలసిన అవసరం ఉండదు. అయితే ఎఫ్‌డీఐ నిబంధనలకు అనుగుణంగా ఈక్విటీ షేర్లను రంగాలవారీగా పరిమితులు, ధరల మార్గదర్శకాలు, పన్ను చట్టాలు తదితరాలకు లోబడి జారీ చేయాల్సి ఉంటుంది.