
ఫెడ్ రేట్లు పావు శాతం పెంపు
అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లు పావు శాతం పెంచింది.
⇒ ఈ ఏడాది మరో రెండు విడతల్లో పెంపు ఉండొచ్చని అంచనా...
⇒ పటిష్టమైన ఉద్యోగ గణాంకాల తోడ్పాటు
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లు పావు శాతం పెంచింది. ఫెడ్ ఫండ్స్ వడ్డీ రేట్ల శ్రేణి 0.75–1 శాతం మేర ఉంటుందని వెల్లడించింది. ఈ ఏడాది మరో రెండు విడతలు, వచ్చే ఏడాది మూడు విడతల మేర వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ఫెడ్ కమిటీ అంచనా వేసింది. మరోవైపు ద్రవ్యోల్బణం లక్ష్యించిన రెండు శాతం స్థాయికి పెరగగలదని ఫెడరల్ రిజర్వ్ పేర్కొంది. అటు జీడీపీ, ద్రవ్యోల్బణం అంచనాలు యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వివరించింది.
బుధవారం రాత్రి ఫెడ్ నిర్ణయం వెలువడగానే అమెరికా స్టాక్స్ అర శాతం మేర, బంగారం ఒక్క శాతం లాభాల్లో ట్రేడయ్యాయి. డాలర్ ఇండెక్స్ ఒక శాతం బలహీనపడి.. 100.70 వద్ద ట్రేడయ్యింది. 2007–09 మధ్య ఆర్థిక మాంద్యం పరిణామాల తర్వాత ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం ఇది మూడోసారి. 2015 డిసెంబర్‌లో తొలిసారి, ఆ తర్వాత గతేడాది డిసెంబర్‌లో రెండోసారి వడ్డీ రేట్లు పెంచింది. పటిష్టమైన ఉద్యోగ గణాంకాలు, ఇన్వెస్టర్లు .. వ్యాపార వర్గాల విశ్వాసం గణనీయంగా మెరుగుపడటం తదితర అంశాలు రేట్ల పెంపునకు తోడ్పడ్డాయి.