
ఫెడ్ సమావేశం వరకూ అనిశ్చితి..!
* రేటు పెంపు అంచనా
* డాలర్ బలోపేతం నడుమ పసిడి బలహీనత
ముంబై/న్యూయార్క్: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ వారం 20, 21 తేదీల్లో సమీక్ష జరపనుంది. ఈ సందర్భంగా ఫెడ్ ఫండ్ రేట్లు పెంచవచ్చని కొందరు, ఒకవేళ పెంచకపోయినా తదుపరి సమీక్షలో పెంచుతామనే బలమైన సంకేతాలివ్వవచ్చని కొందరు అంచనాలు వేస్తుండటంతో పసిడి ధరలు కొంత వెనుకడుగు వేశాయి. ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంచనాలతో తాజాగా డాలర్ బలపడుతుండడం పసిడి, క్రూడ్ ధరసహా కమోడిటీలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం 0.50 శాతంగా ఉన్న ఫండ్ రేటు పెంచిన పక్షంలో పసిడికి ఒక స్పష్టమైన దిశానిర్దేశం ఏర్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
నిజానికి ఫెడ్ గనక ఫండ్ రేటును పెంచితే ఆ మేరకు చాలా డబ్బు బాండ్లలోకి వెళుతుంది. ఈ మేరకు పసిడి బలహీనపడవచ్చన్న అంచనాలున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా దిగువ స్థాయిలో ఫండమెంటల్స్ పటిష్టంగా లేకపోవటం వల్ల, ఒకవేళ ఫెడ్ రేటు పెంచినా... పసిడి ముందుకే సాగుతుందన్న వాదనా ఉంది. 0.25 శాతంగా ఉన్న ఫండ్ రేటు పెంచితే, పసిడి ఔన్స్‌కు 1,000 డాలర్ల దిగువనకు పడిపోతుందన్న మెజారిటీ విశ్లేషణలకు అంచనాలకు భిన్నంగా ఇప్పటి వరకూ పసిడి పరుగులు తీసిందన్న వాస్తవాన్ని వారు ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. మొత్తంమీద ఫెడ్ రేటు పెంపుపై మారుతున్న అంచనాలు, ఇందుకు సంబంధించి నిర్ణయాలు రానున్న వారం రోజుల్లో పసిడి కదలికలకు కారణమవుతాయన్నది నిపుణుల అంచనా.
వారంలో ధరల తీరు ఇది...
అంతర్జాతీయంగా న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్‌లో పసిడి కాంట్రాక్ట్ శుక్రవారం వరుసగా ఎనిమిది ట్రేడింగ్ సెషన్ల నుంచీ క్షీణిస్తూ వస్తోంది. గడచిన శుక్రవారం నాడు ముగిసిన వారంలో ధర ఔన్స్‌కు 19 డాలర్లు తగ్గి 1,313 డాలర్లకు చేరింది. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. ఇక దేశీయంగానూ ‘ఇప్పటి వరకూ పెరిగిన పసిడి’కి సంబంధించి లాభాల స్వీకరణ కొనసాగుతోంది. శుక్రవారంతో ముగిసిన వారంలో పసిడి 10 గ్రాములు 99.9 స్వచ్ఛత ధర రూ.125 తగ్గి రూ.31,200కు చేరింది.