ఎన్నికల ఫలితాలే దిక్సూచి
స్టాక్ మార్కెట్ భవిష్యత్తు గమనంపై ఫలితాల ప్రభావం
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయమూ కీలకమే..
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రానున్న రోజుల్లో స్టాక్ మార్కెట్ కదలికలను నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. ఈ ఫలితాలు ఈ నెల 11న(శనివారం) రానున్నాయి. వీటితో పాటు రేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం, ప్రపంచ స్టాక్ మార్కెట్ల గమనం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి తదితర అంశాల ప్రభావం స్టాక్‌సూచీలపై ఉంటుందని మార్కెట్ విశ్లేషకుల అంచనా.
9న ఎగ్జిట్ పోల్ ఫలితాలు
వడ్డీరేట్ల పెంపు తప్పదన్న సంకేతాలతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జానెట్ ఎలెన్ గత శుక్రవారం చేసిన వ్యాఖ్యలకు నేడు(సోమవారం) మార్కెట్ ప్రతిస్పందిస్తుంది. ఈ నెల 13న హోలి కారణంగా స్టాక్ మార్కెట్‌కు సెలవు కావడంతో 11న వెలువడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ నెల 14న(మంగళవారం) కనిపిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ హెడ్(ప్రైవేట్ క్లయింట్ గ్రూప్) వి.కె. శర్మ చెప్పారు. అయితే 9న(గురువారం) వెలువడే ఎగ్జిట్ పోల్ ఫలితాల నుంచి మార్కెట్ కొన్ని సంకేతాలను అందిపుచ్చుకునే వీలు ఉందని ఆయన పేర్కొన్నారు. రేట్ల నిర్ణయానికి సంబంధించి అమెరికా ఫెడరల్ రిజర్వ్‌సమావేశం మార్చి 14–15 మధ్య జరగనున్నందున మార్కెట్లో అనిశ్చితి నెలకొనవచ్చని వివరించారు.
విదేశీ పెట్టుబడులు : రూ.15,862
నాలుగు నెలల అమ్మకాల అనంతరం గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, ఎఫ్‌పీఐలు ఈ ఏడాది ఫిబ్రవరిలో మన స్టాక్ మార్కెట్లో రూ.9,902 కోట్లు, డెట్‌మార్కెట్లో రూ.5,960 కోట్లు వెరశి మన క్యాపిటల్ మార్కెట్లో రూ.15,862 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఎఫ్‌పీఐ పన్నులపై స్పష్టత, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం కంపెనీల క్యూ3 ఫలితాలపై పెద్దగా లేకపోవడం తదితర కారణాల వల్ల విదేశీ పెట్టుబడులు జోరుగా వస్తున్నాయని నిపుణులంటున్నారు.