బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు.. సోమవారం అత్యంత తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు భిన్నంగా బీజేపీకి కాంగ్రెస్ గుజరాత్‌లో గట్టిపోటీనివ్వడంతో సెన్సెక్స్ భారీ కుదుపులకు గురైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో బీజేపీ, కాంగ్రెస్‌లు నువ్వా, నేనా అన్న రీతిలో పోటీపడగా, ఇదే స్థాయిలో సెన్సెక్స్, నిఫ్టీలు లాభ నష్టాల మధ్య దోబూచులాడాయి. బీజేపీ విజయం ఖాయమన్న తేలిన తర్వాతనే సూచీలు ఊపిరి పీల్చుకున్నాయి. లాభాల బాట పట్టాయి. గుజరాత్‌లో గెలుపు కోసం బీజీపీ చెమటోట్చడం, సునాయాస విజయం కాక నామమాత్రపు విజయం మాత్రమే దక్కే అవకాశాలుండటం(మార్కెట్ ముగిసేటప్పటికి పూర్తి ఫలితాలు వెలువడలేదు), ఎందుకైనా మంచిదంటూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారు. దీంతో సూచీల లాభాలు పరిమితమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 139 పాయింట్ల లాభంతో 33,602 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,389 పాయింట్ల వద్ద ముగిశాయి. దీంతో వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లోనూ స్టాక్ మార్కెట్ లాభాలు కొనసాగాయి.
ఉదయం 9.15 ఫలితాల ప్రారంభ ట్రెండ్ బీజేపీతో కాంగ్రెస్ పోటాపోటీ. సెక్సెక్స్ 33,364 వద్ద ఓపెన్ – 98 పాయింట్లు
ఉదయం 9.25 ట్రెండ్ రివర్స్... బీజేపీతో సమానంగా కాంగ్రెస్. కనిష్ట స్థాయి 32,596 – 867 పాయింట్లు
మధ్యాహ్నం 12.40 మెజారిటీ మ్యాజిక్ ఫిగర్‌ను అధిగమించిన బీజేపీ. గరిష్ట స్థాయి 33,802 +339 పాయింట్లు
సాయంత్రం 3.30 హిమాచల్, గుజరాత్‌లలో బీజేపీ గెలుపు ఖరారు ముగింపు 33,602 +139 పాయింట్లు
ఆరంభంలోనే 800 పాయింట్లకు పైగా నష్టం...
ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గంటసేపటికే సెన్సెక్స్ 867 పాయింట్ల నష్టంతో కీలకమైన 33 వేల పాయింట్ల దిగువకు పడిపోయి, 32,596 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. నిఫ్టీ కూడా 258 పాయింట్లు క్షీణించి కీలకమైన 10,100 పాయింట్ల దిగువకు పతనమైంది. గుజరాత్‌లో బీజేపీ ఆధిక్యం పెరుగుతున్న కొద్దీ సెన్సెక్స్, నిఫ్టీల లాభాలు కూడా పెరగడం ప్రారంభమైంది.
ఇంట్రాడేలో 339 పాయింట్ల లాభంతో 33,802 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన సెన్సెక్స్ చివరకు 139 పాయింట్ల లాభంతో 33,602 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తం మీద సోమవారం రోజంతా సెన్సెక్స్ 1,206 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 258 పాయింట్ల నష్టంతో 10,075 పాయింట్ల కనిష్టస్థాయిని, 110 పాయింట్ల లాభంతో 10,444 పాయింట్ల గరిష్టస్థాయిల మధ్య కదలాడింది. చివరకు 55 పాయింట్ల లాభంతో 10,389 పాయింట్ల వద్ద ముగిసింది.
ఫలితాలతో పాటే మారుతూ వచ్చిన సెంటిమెంట్..!
ఎన్నికల ఫలితాలతో పాటే మార్కెట్ సెంటిమెంట్ కూడా మారుతూ వచ్చిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బ్యాంక్‌ల మూలధన నిధుల దిశగా కొన్ని చర్యలు ఉండొచ్చన్న అంచనాల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయని పేర్కొన్నారు. ప్రారంభంలో ఒడిదుడుకులకు గురైన డాలర్‌తో రూపాయి మారకం ఆ తర్వాత కోలుకోవడం, ట్రంప్ ప్రతిపాదిత పన్ను సంస్కరణల బిల్లు ఆమోదం పొందే అవకాశాలున్నాయన్న అంచనాల కారణంగా ఆసియా మార్కెట్లు లాభపడగా, యూరప్ మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభం కావడం స్టాక్ మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించాయని వివరించారు.
ఆల్‌టైమ్ హైకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్...
నిధుల సమీకరణ వార్తల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్టస్థాయి, రూ.1,900ను తాకింది. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ నొముర ఈ షేర్‌కు ‘కొనచ్చు’ రేటింగ్‌ను కొనసాగిస్తూ, టార్గెట్ ధరను రూ.2,200 నుంచి రూ.2,350కు పెంచింది. ఈ షేర్‌తో పాటు మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకీ, హిందుస్తాన్ యూనిలీవర్, గెయిల్, సన్ టీవీ నెట్‌వర్క్, టైటాన్ కంపెనీ, గ్రీన్‌ప్లై ఇండస్ట్రీస్, సెంచురీ ప్లైబోర్డ్స్, రిలాక్సో ఫుట్‌వేర్, రేమండ్, పేజ్ ఇండస్ట్రీస్, టీటీకే ప్రెస్టీజ్, టీవీఎస్ మోటార్స్, వర్ల్‌పూల్ ఇండియా తదితర షేర్లు కూడా జీవిత కాల గరిష్టస్థాయిలను తాకాయి.
రెండు వారాలు కన్సాలిడేషన్.!
స్టాక్ మార్కెట్‌కు సంబంధించి ప్రధాన ఈవెంట్స్ అన్నీ అయిపోయాయని, క్రిస్మస్, కొత్త ఏడాది సెలవులతో విదేశీ ఇన్వెస్టర్ల లావాదేవీలు కూడా మందకొడిగానే ఉంటాయని, దీంతో మరో 2 వారాల పాటు స్టాక్ మార్కెట్ స్తబ్దుగానే ట్రేడవుతుందనేది నిపుణుల మాట.
పడిలేచిన గుజరాత్ షేర్లు
ఎన్నికల ఫలితాల సరళి ఎప్పటికప్పుడు మారుతుండటంతో పలు గుజరాత్ షేర్లు తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురయ్యాయి. అదానీ గ్రూప్ షేర్లతో పాటు కేడిలా, అరవింద్, గుజరాత్ గ్యాస్, రత్నమణి మెటల్స్ తదితర షేర్లు ఇంట్రాడేలో 2–15 శాతం పతనమయ్యాయి. బీజేపీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో ఈ షేర్లు నష్టాలన్నీ పూడ్చుకొని చివరకు లాభాల్లో ముగిశాయి.
ఇంట్రాడేలో 18 శాతం వరకూ నష్టపోయిన అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ చివరకు 3 శాతం లాభంతో రూ.160 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ రూ.132 కనిష్టస్థాయిని తాజా ఏడాది గరిష్టస్థాయిని, రూ.166ను తాకింది. వేదాంత, సన్ ఫార్మా, ఎస్‌బీఐ, టీసీఎస్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, ఐషర్ మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, విప్రో షేర్లు 1–3 శాతం వరకూ లాభపడ్డాయి. ఐఓసీ, యస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, హెచ్‌పీసీఎల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేర్లు నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment