‘ఎగ్జిట్‌ పోల్స్‌’ లాభాలు | Bulls take charge ahead of exit polls: Sensex up 537 pts; Nifty over 11,400 | Sakshi
Sakshi News home page

‘ఎగ్జిట్‌ పోల్స్‌’ లాభాలు

Published Sat, May 18 2019 12:04 AM | Last Updated on Sat, May 18 2019 4:22 AM

Bulls take charge ahead of exit polls: Sensex up 537 pts; Nifty over 11,400 - Sakshi

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు మరో రెండు రోజుల్లో రానుండటంతో స్టాక్‌ మార్కెట్లో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జోరుగా సాగాయి. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 38,000 పాయింట్లపైకి ఎగబాకగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,400 పాయింట్ల ఎగువన ముగిసింది.  స్థిరమైన ప్రభుత్వమే ఏర్పడగలదని, సంస్కరణలు కొనసాగుతాయనే అంచనాలతో అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా రెండో రోజు లాభపడగా, ఈ నెలలో స్టాక్‌ సూచీలకు ఇది మూడో రోజు లాభం. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 537 పాయింట్లు పెరిగి 37,931 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 11,407 పాయింట్ల వద్ద ముగిశాయి. ప్రైవేట్‌ బ్యాంక్, వా హన, ఆర్థిక, రియల్టీ, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ షేర్లలో కొనుగోళ్లు జోరుగా జరగ్గా, లోహ, ఐటీ, ఫార్మా షేర్లలో అమ్మకాలు కనిపించాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 468 పాయింట్లు, నిఫ్టీ 128 పాయింట్లు చొప్పున పెరిగాయి.  

ప్రపంచ మార్కెట్లు పతనమైనా... 
అమెరికా– చైనా చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్నా, ఆదివారం ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడనున్న నేపథ్యంలో మంచి లాభాలు వచ్చాయని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఎనలిస్ట్‌ జగన్నా«థమ్‌ తునుగుంట్ల వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లో జోరుగా కొనుగోళ్లు జరగడం... కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడగలదన్న అంచనాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకులున్నా, ఎగ్జిట్‌ పోల్స్‌ నేపథ్యంలో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు, బ్లూ చిప్‌ షేర్లలో కొనుగోళ్ల కారణంగా మార్కెట్‌ పెరిగిందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌  సర్వీసెస్‌ ఎనలిస్ట్‌ వినోద్‌ నాయర్‌ వ్యాఖ్యానించారు.  

ఇంట్రాడేలో 608 పాయింట్లు లాభం... 
ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా, సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. మధ్యాహ్నం తర్వాత కొంత జోరు తగ్గినప్పటికీ, ట్రేడింగ్‌ చివర్లో మళ్లీ పుంజుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 608 పాయింట్లు, నిఫ్టీ 169 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం 16 పైసలు క్షీణించి 70 మార్క్‌కు చేరినా, ముడి చమురు ధరలు పెరిగినా, స్టాక్‌ సూచీలు ముందుకే దూసుకుపోయాయి.
మరిన్ని విశేషాలు.... 

బజాజ్‌ ఫైనాన్స్‌ లాభాలు శుక్రవారం కూడా కొనసాగాయి. ఈ షేర్‌ 6 శాతం లాభంతో రూ.3,301 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. గత క్యూ4లో ఈ కంపెనీ నికర లాభం 50 శాతం ఎగియడంతో గత రెండు రోజులుగా ఈ షేర్‌ లాభపడుతోంది. ఇంట్రాడేలో ఈ షేర్‌ ఆల్‌టైమ్‌ హై, రూ.3,315 ను తాకింది. ఈ షేరుతో పాటు పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైలను తాకాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ లాంబార్డ్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, మెర్క్, ఎస్‌ఆర్‌ఎఫ్, టైటాన్, యూపీఎల్, ఆవాస్‌  ఫైనాన్షియర్స్‌  ఈ జాబితాలో ఉన్నాయి.  

క్యూ4లో నికర లాభం 20% పెరగడంతో బజాజ్‌ ఆటో షేర్‌ 3.3% పెరిగి రూ.3,042 వద్ద ముగిసింది. ఈ షేర్‌ ఇంట్రాడేలో 7% ఎగసింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.2,812 కోట్లు పెరిగి రూ.88,020 కోట్లకు చేరింది.  

మార్కెట్‌ బలంగా ఉన్న డెల్టా కార్ప్‌ షేర్‌ 22 నెలల కనిష్ట స్థాయి, రూ.155కు పడిపోయింది. చివరకు 12 శాతం క్షీణించి రూ.166 వద్ద ముగిసింది. గత ఆరు రోజుల్లో ఈ షేర్‌ 32 శాతం పతనమైంది. ఈ కంపెనీ భారీ మొత్తంలో జీఎస్‌టీని ఎగవేసిందనే వార్తలు దీనికి కారణం.

లాభాలు ఎందుకు వచ్చాయంటే

ఎగ్జిట్‌ పోల్స్‌...  
ఏడు దశల్లో సుదీర్ఘంగా జరుగుతున్న 17వ లోక్‌సభ ఎన్నికలు ఈ ఆదివారంతో ముగియనున్నాయి. చివరి దశ ఎన్నికలు ముగియగానే ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడతాయి. మోదీ  సర్కారే   మళ్లీ అధికారంలోకి రాగలదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఎగ్జిట్‌ పోల్స్‌కు ముందు ఇన్వెస్టర్లు భారీగా షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఎగ్జిట్‌ పోల్స్‌ నేపథ్యంలో ట్రేడర్లు భారీగా లాంగ్‌ పొజిషన్లు, షార్ట్‌ పొజిషన్లు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని, అందుకే షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు భారీగా జరిగాయని విశ్లేషకులంటున్నారు.  

క్యూ4 ఫలితాల మెరుపులు... 
ఇటీవల వెలువడిన కొన్ని కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు మెరుపులు మెరిపించాయి. ఒక్క శుక్రవారం రోజే నాలుగు నిఫ్టీ కంపెనీల ఫలితాలు వెలువడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, బజాజ్‌ ఆటో, ఐఓసీ, డాక్టర్స్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ కంపెనీల ఫలితాలు అంచనాలను మించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ మెరుగుపడి కొనుగోళ్లు జోరుగా సాగాయి.  

హెవీ వెయిట్స్‌ షేర్ల ర్యాలీ 
సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో వెయిటేజీ అధికంగా ఉన్న షేర్లు జోరుగా పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఐటీసీ, , కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్‌ ఫైనాన్స్‌.. ఈ ఆరు షేర్లు 2–6 శాతం రేంజ్‌లో పెరిగాయి.   

సాంకేతిక అంశాలు 
ఇన్వర్టెడ్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ ప్యాటర్న్‌లో కీలకమైన 11,260 పాయింట్లపైకి నిఫ్టీ చేరడంతో కొనుగోళ్లు జోరుగా సాగాయని ఎనలిస్ట్‌లు పేర్కొన్నారు. ఈ వారం మొత్తం 200 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన నిఫ్టీ శుక్రవారం 11,400 పాయింట్ల మార్క్‌ను మళ్లీ అందుకుంది. దీంతో నిఫ్టీ 11,500–11,550  స్థాయిని చేరొచ్చన్న అంచనాలతో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. 

రూ.1.4 లక్షల కోట్లు ఎగసిన ఇన్వెస్టర్ల సంపద 
స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ.1.4 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాప్‌ రూ.1.4 లక్షల కోట్లు ఎగసి రూ.146.59 లక్షల కోట్లకు చేరింది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement