
ఫెడ్ పాలసీ సమీక్షపై దృష్టి
అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేపట్టనున్న పాలసీ సమీక్షపై ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు దృష్టిపెట్టాయని విశ్లేషకులు పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేపట్టనున్న పాలసీ సమీక్షపై ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు దృష్టిపెట్టాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక దేశీయంగా ఆగస్ట్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. కాగా, గత వారం చివర్లో మార్కెట్లు ముగిశాక ఆగస్ట్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ)తోపాటు, జూలై నెలకు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) వెలువడ్డాయి.
ఈ వారం స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ నిర్ణయంపై వీటి ప్రభావం ఉంటుందని ఎక్కువమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. సోమవారం మధ్యాహ్నం డబ్ల్యూపీఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. గత వారం వెలువడ్డ ఐఐపీ నిరాశపరచగా, సీపీఐ కాస్త ఫరవాలేదనిపించింది. వెరసి సోమవారం ఈ అంశాల ఆధారంగా మార్కెట్లు ఎలా స్పందించేదీ వేచిచూడాల్సి ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు.
వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు: పరపతి విధానాల సమీక్షపై ఫెడరల్ రిజర్వ్ నిర్వహించనున్న రెండు రోజుల సమావేశాలు బుధవారం ముగియనున్నాయి. ప్రధానంగా సహాయక ప్యాకేజీ నిలిపివేత, వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు వంటి అంశాలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నాయని నిపుణులు పేర్కొన్నారు. దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమెరికా వడ్డీ పెంపు అంశాన్ని నిశితంగా పరిశీలిస్తారని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ చె ప్పారు. అంచనాలకంటే ముందుగానే పెంపునకు అవకాశాలు కనిపిస్తే వర్థమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులు తరలిపోతాయన్న ఆందోళనలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.
ముందస్తు పన్ను చెల్లింపులు
సోమవారం వెల్లడికానున్న లిస్టెడ్ దిగ్గజాల ముందస్తు పన్ను చెల్లింపులపైనా ఇన్వెస్టర్లు కన్నేస్తారని విశ్లేషకులు తెలిపారు. వీటి ఆధారంగా కార్పొరేట్ల జూలై-సెప్టెంబర్(క్యూ2) ఫలితాలను అంచనా వేస్తారని తెలిపారు. ఇక మరోవైపు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడుల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు వంటి అంశాలు కూడా కీలకంగా నిలుస్తాయని వివరించారు.
ప్రభుత్వం సంస్కరణల అజెండాను కొనసాగిస్తుందన్న అంచనాలతో ఎఫ్‌ఐఐలు ఈ నెలలోనూ రూ. 17,000 కోట్లను ఇన్వెస్ట్ చేశారని, దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను అందుకుంటున్నాయని సియాన్స్ అనలిటిక్స్ సహవ్యవస్థాపకుడు, సీఈవో అమన్ చౌదరి చెప్పారు. మార్కెట్లు సానుకూలంగానే ఉన్నప్పటికీ సిరియా, ఇరాక్, అమెరికాల మధ్య ఏర్పడ్డ ఉద్రేక పరిస్థితుల కారణంగా సెంటిమెంట్ బలహీనపడవచ్చునని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ అభిప్రాయపడ్డారు.