ఆరు వారాల కనిష్టం
వరుసగా ఐదో రోజూ నష్టాలు
సెన్సెక్స్ 17 పాయింట్లు డౌన్
25,007 వద్ద ముగింపు
రోజు మొత్తం ఒడిదుడుకులు
వరుసగా ఐదో రోజు నష్టాలు కొనసాగాయ్. తొలి నుంచీ స్వల్ప స్థాయిలో లాభనష్టాల మధ్య కదలిన సెన్సెక్స్ కనిష్టంగా 24,892, గరిష్టంగా 25,096ను తాకింది. చివరికి 17 పాయింట్ల క్షీణతతో 25,007 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 7,472- 7,422 మధ్య కదిలి చివరికి 5 పాయింట్లు తక్కువగా 7,454 వద్ద ముగిసింది. ఇది దాదాపు ఆరు వారాల కనిష్టం! జూన్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) 6% నుంచి 5.4%కు తగ్గినప్పటికీ సెంటిమెంట్ మెరుగుపడలేదని నిపుణులు పేర్కొన్నారు.
ఇదే విధంగా మే నెలలో పారిశ్రామికోత్పత్తి 19 నెలల గరిష్టం 4.7%కు పుంజుకున్న అంశాన్నీ ఇన్వెస్టర్లు పెడచెవిన పెట్టారని తెలిపారు. ఈ గణాంకాలు గడిచిన శుక్రవారం మార్కెట్లు ముగిశాక వెలువడ్డాయి. కాగా, జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) 8.3% నుంచి 7.3%కు బలహీనపడినట్లు సోమవారం(14న) మార్కెట్లు ముగిశాక వెల్లడైంది.
* శుక్రవారం అంచనాలకు తగ్గ ఫలితాలు ప్రకటించిన ఇన్ఫోసిస్ తాజాగా 3% పతనమైంది. మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో హెచ్‌యూఎల్, విప్రో 2.5% స్థాయిలో తిరోగమించాయి.
* కేజీ డీ6 బ్లాకునుంచి లక్ష్యానికంటే తక్కువగా గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నందున ఆర్‌ఐఎల్‌పై ప్రభుత్వం 57.9 కోట్ల డాలర్ల అదనపు జరిమానాను విధించడంతో షేరు 0.5% నష్టపోయింది.
* మరోవైపు హిందాల్కో 4% జంప్‌చేయగా, టాటా పవర్, టాటా స్టీల్, టాటా మోటార్స్ 2.5% స్థాయిలో ఎగశాయి. ఈ బాటలో యాక్సిస్, ఓఎన్‌జీసీ, ఎల్‌అండ్‌టీ, భెల్ 1.5% చొప్పున లాభపడ్డాయి.
* ఎఫ్‌పీఐలు రూ. 558 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీ సంస్థలు రూ. 332 కోట్లను ఇన్వెస్ట్‌చేశాయి.
ట్రేడైన షేర్లలో 1,690 నష్టపోతే, 1,126 లాభపడ్డాయి.