పసిడి పయనం ఎటువైపు?
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బంగారం, వెండి, ప్లాటినం ధరలు పెరగనున్నాయా? విశ్లేషకులు అంచనాలను గమనిస్తే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు పాలసీ సమావేశాల నేపథ్యంలో ప్యూచర్స్ మార్కెట్ లో పసిడి ధరలు పెరిగాయని న్యూయార్క్ మెర్కంటైల్ ఎక్సేంజ్ తెలిపింది. జూన్ నెల నాటి కాంట్రాక్ట్ లో బంగారం ధరలు 0.83 శాతం పెరిగాయని తెలిపింది. సోమవారం నాటికి ఔన్స్ బంగారం ధర 82 777 రూపాయల దగ్గర స్థిరంగా ఉందని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది.
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన నివేదికలో మార్చి నెల గృహ అమ్మకాలు అంచనాల కంటే అధ్వాన్నంగా ఉండటంతో పసిడి ధరలకు ఊతం మిచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే మంగళ, బుధ, గురు, శుక్రవారం విడుదల కానున్న వివిధ అంతర్జాతీయ నివేదికలు పసిడి ధరలను ప్రభావితం చేయనున్నాయని జిన్హువా తెలిపింది. అటు అమెరికా కరెన్సీ డాలర్ క్షీణించడం కూడా గోల్డ్ ధరలకు సానుకూలంకానుంది. గోల్డ్ , డాలర్ సాధారణంగా వ్యతిరేక దిశలో పయనించడం తెలిసిందే.
మరోవైపు అంతర్జాతీయంగా పసిడి ధరలు బలపడుతోంటే.. భారత ఫ్యూచర్స్ మార్కెట్లో కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ అందించిన వివరాల ప్రకారం జూన్ నెల ఫ్యూచర్స్ లో 56 రూ (0,19) క్షీణించి 10 గ్రా. బంగారం ధర 29, 436 దగ్గర స్థిరపడింది. ఇటీవలి లాభాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో స్వల్పంగా నష్టపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళవారం నాటికి 10 గ్రాముల బంగారం ధర 70 రూపాయల నష్టంతో రూ 29, 192 దగ్గర ట్రేడ్ అవుతోంది. అటు వెండి ధరలో కూడా స్వల్ప క్షీణత నమోదైంది.
అదేవిధంగా రేపు ఫెడరల్ రిజర్వు ఏప్రిల్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం జరగనుంది. దీనిలో కొత్తగా ఫెడ్ ఎలాంటి చర్యలను ప్రవేశపెట్టదని సంకేతాలు వస్తున్నాయి. కానీ మానిటరీ పాలసీపై ముందస్తు మార్గదర్శకాలు, భవిష్యత్ లో వడ్డీరేట్లు పెరుగుతాయనే సూచనలను ఫెడ్ ప్రకటిస్తుందని డీలర్లు ఆశిస్తున్నారు. ఈ అంచనాల నేపథ్యంలో పసిడి పరుగులు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.