మూడో రోజూ లాభాల్లోనే...
► ఫెడ్ ఎఫెక్ట్ లేదంటున్న నిపుణులు
► 174 పాయింట్ల లాభంతో 25,494కు సెన్సెక్స్
► 50 పాయింట్ల లాభంతో 7,751కు నిఫ్టీ
అంతర్జాతీయ స్టాక్‌మార్కెట్ల మాదిరే భారత స్టాక్ మార్కెట్ కూడా బుధవారం లాభాల్లో ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపును మార్కెట్లు ఇప్పటికే డిస్కౌంట్ చేసుకున్నాయని ఇన్వెస్టర్లు భావించారని దీంతో స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల బాటలోనే సాగాయని నిపుణులంటున్నారు.
దీనికి తోడు ఇంధన షేర్లు పెరగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 174 పాయింట్లు లాభపడి 25,494 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 7,751 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు రోజం తా లాభాల్లోనే ట్రేడయ్యాయి. వడ్డీరేట్లపై నిర్ణయాన్ని అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం అర్థరాత్రి వెల్లడించనున్నది.
ఆయిల్ షేర్లకు లాభాలు: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆరేళ్ల కనిష్ట స్థాయి నుంచి రికవరీ కావడంతో ఆయిల్ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, కెయిర్న్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 4% వరకూ పెరిగాయి. 2,000 సీసీ అంతకంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న డీజిల్ వాహన రిజిస్ట్రేషన్లపై వచ్చే ఏడాది మార్చి 31 వరకూ సుప్రీం కోర్ట్ నిషేధం(ఢిల్లీలో) విధించడంతో మహీంద్రా అండ్ మహీంద్రా 5.4 శాతం నష్టపోయింది.
కాగా ఎన్‌ఎస్‌ఈకి చెందిన ఇండియా ఇండెక్స్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్(ఐఐఎస్‌ఎల్) సంస్థ మూడు గ్రూప్ ఇండెక్స్‌లను బుధవారం ప్రారంభించింది. ఆయా గ్రూప్ కంపెనీల పనితీరును ట్రాక్ చేయడానికి నిఫ్టీ టాటా గ్రూప్ ఇండెక్స్, నిఫ్టీ ఆదిత్య బిర్లా గ్రూప్ ఇండెక్స్, నిఫ్టీ మహీంద్రా గ్రూప్ ఇండెక్స్‌లను పూర్తి మార్కెట్ క్యాపిటలైజేషన్ విధానం ఆధారంగా రూపొందించామని ఐఐఎస్‌ఎల్ పేర్కొంది.