ఫెడ్ పెంపును తట్టుకుంటాం
ఆ శక్తి మన ఆర్థిక వ్యవస్థకుంది
• కరెన్సీ మార్కెట్ స్థిరపడుతుంది
• ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్
• అనిశ్చితికి తెరపడింది: శక్తికాంత దాస్
• కొంత కాలం పాటు విదేశీ నిధులు వెనక్కి: ఆర్థికశాఖ
• 0.25% పెంపుతో... 0.75%కి ఫెడ్ రేటు
• వచ్చే ఏడాది మరో మూడుసార్లు పెంపు ఉండొచ్చన్న ఫెడ్ చీఫ్ ఎలెన్
న్యూఢిల్లీ: అమెరికా ఫెడ్ రేటు పెంపు ప్రభావాన్ని తట్టుకునే శక్తి మనకుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కరెన్సీ మార్కెట్లో తక్షణం స్వల్ప ఆటు పోట్లు కనిపించినా తర్వాత స్థిరపడుతుందని అభయమిచ్చింది. ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి అమెరికా ఆర్థిక రంగం పురోగమిస్తుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావు శాతం పెంచుతూ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటిదాకా 0.50%గా ఉన్న ఫెడ్ ఫండ్ రేటు 0.75%కి చేరింది. అంతేకాక... వచ్చే ఏడాది మరో మూడుసార్లు పెంపు నిర్ణయం ఉంటుందని కూడా ఫెడరల్ రిజర్వ్ చైర్‌పర్సన్ జానెట్ ఎలెన్ సంకేతాలిచ్చారు.
దీంతో ఈ అంశంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనిశ్చితికి తెరపడింది..: అమెరికాలో అమల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా మన వడ్డీ రేట్లను సమతుల్యం చేయాల్సి ఉందని, ఫెడ్ రేటు పెంపుతో అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితికి తెరపడిందని ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్ అన్నారు. దేశీయ మార్కెట్లు ఇప్పటికే ఈ రేటు ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్నాయని చెప్పారు.
వృద్ధి అంచనాలు స్థిరంగానే ఉన్నాయన్నారు. స్వల్ప ఆటు పోట్ల అనంతరం కరెన్సీ మార్కెట్ స్థిరపడుతుందని చెప్పారు.మన ఆర్థిక రంగానికి ఆ శక్తి ఉంది...‘‘దేశీయ ఆర్థిక రంగానికి ఫెడ్ రేటు పెంపు ప్రభావాన్ని తట్టుకునే అద్భుత శక్తి ఉంది. అయితే, అంచనాలను పునఃసమీక్షించాల్సి ఉంది. కొంత కాలం పాటు వర్ధమాన దేశాల నుంచి అమెరికాకు నిధులు తరలిపోవడం ఉంటుంది. అయితే, ఇతర దేశాలతో పోలిస్తే మనపై ప్రభావం తక్కువే’’ అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. ఫెడ్ రేటు పెంపును ఆర్‌బీఐ ఇప్పటికే పరిగణనలోకి
తీసుకుందని చెప్పారు. వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అందరూ భావించగా... యథాతథంగా కొనసాగిస్తూ ఆర్‌బీఐ ఈ నెల సమీక్ష అనంతరం నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. వడ్డీ రేట్లు తక్కువుంటే నిధులు తరలిపోతాయ్ అమెరికాను డిపాజిట్లకు సురక్షిత ప్రదేశంగా పరిగణిస్తారని వడ్డీ రేటు పెంపు ఎప్పుడు వెలువడినా నిధులు వెనక్కి మళ్లడం, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సమీక్షించుకోవడం సాధారణమేనని ఆర్థిక శాఖకు చెందిన మరో అధికారి పేర్కొన్నారు.
‘‘ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే తక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉండాలని మన దేశం భావిస్తోంది. అయితే దీన్ని బ్యాలన్స్ చేయాల్సి ఉంది. అప్పుడే ఆ ప్రభావం రూపాయిపై పడకుండా ఉంటుంది’’ అని ఆయన వివరించారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే నిధులు తరలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుందన్నారు. అమెరికా, భారత వడ్డీ రేట్లలో మరింత అంతరం ఉంటే రూపాయి ప్రభావితం అవుతుందని, కనుక వడ్డీ రేట్ల విషయంలో సమతుల్యంగా వ్యవహరించాల్సి ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫెడ్ నిర్ణయంతో గురువారం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి డాలర్‌తో 40 పైసలు బలహీనపడి 67.85కు చేరుకున్న విషయం తెలిసిందే.